కర్నూలు : కర్నూలు జిల్లాలో అధికార యంత్రాంగానికి కార్పొరేట్ సంస్థలకు మధ్య వివాదం మరింత ముదురుతోంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేపట్టాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ తమపై ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో సీఎస్‌ఆర్ కింద మౌలిక సదుపాయాల కల్పన అంశం కాస్తా... అటు అధికార యంత్రాంగానికి ఇటు కార్పొరేట్ సంస్థల మధ్య కొత్త చిచ్చును రేపుతోంది.
వెళ్లిపొమ్మంటారా...!
సీఎస్‌ఆర్ అమలు కింద జిల్లావ్యాప్తంగా 50కిపైగా కంపెనీలను కలెక్టర్ గుర్తించారు. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికీ జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఈ కంపెనీలు కూడా సీఎస్‌ఆర్ అమలు చేయమనడంతో ఇప్పుడు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఇటువంటి కంపెనీలు కొన్ని తమ మీద ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతామని పేర్కొంటున్నారు. ఉదాహరణకు.. కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీఎల్ మినరల్ ప్రాసెసింగ్ కంపెనీ యూనిటు ఏర్పాటు కోసం 150 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇక్కడ మినరల్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ అంటోంది. అయితే, ఎటువంటి పనులు ప్రారభించకుండానే తాము ఎక్కడి నుంచి నిధులు తెచ్చి సీఎస్‌ఆర్ కింద సంక్షేమ కార్యకలాపాలు చేపట్టాలని ఈ కంపెనీ అంటున్నట్టు సమాచారం. ఒకవేళ తమ మీద ఒత్తిడి తెస్తే యూనిట్ ఏర్పాటును విరమించుకుని జిల్లా నుంచి వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాన కంపెనీ నుంచి మైనింగ్ లీజు తీసుకున్న చిన్న కంపెనీలపై కూడా ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రధాన కంపెనీతో పాటు తమను కూడా సీఎస్‌ఆర్ అమలు చేయాలంటూ తమ మీద ఎలా ఒత్తిడి తెస్తారని కంపెనీల యజమానులు వాపోతున్నారు. మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కార్పొరేట్ల కొర్రీతో జిల్లాలో సీఎస్‌ఆర్ అమలు ప్రక్రియ కాస్తా నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కంపెనీల పట్ల గుర్రుగా ఉన్నారు. లక్షలాది రూపాయల లాభాన్ని ఆర్జించుకుంటూ.. పేద పిల్లలకు సదుపాయాలు కల్పించకపోవడం ఏమిటని కంపెనీల ప్రతినిధులను ఆయన ప్రశ్నిస్తున్నారు. కొర్రీలు వేస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుకు రాకపోవడం ఏమిటని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని సమాచారం. సీఎస్‌ఆర్ అమలుకు ససేమిరా అంటే.. ఐటీ దాడులు చేయిస్తానని వారిపై మండిపడ్డట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఈ వ్యవహారం కాస్తా ఇరుపక్షాల మధ్య కొత్త వివాదాలకు కారణమవుతోంది.
కంపెనీల చట్టం ఏం చెబుతోంది?
వాస్తవానికి సీఎస్‌ఆర్‌ను కంపెనీలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏదైనా సంస్థ సీఎస్‌ఆర్ కింద తమకు వచ్చిన లాభాల నుంచి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సిందే. ఇది కంపెనీల చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఏదైనా సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించి... వచ్చిన నికర లాభాల్లో 2 శాతం మొత్తాన్ని వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను సీఎస్‌ఆర్ కింద చేపట్టాలి. అయితే, జిల్లాలో ఇప్పటికీ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టని కంపెనీలకు కూడా సీఎస్‌ఆర్ కింద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాలంటూ లక్ష్యాలు విధిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
బెదిరిస్తే... పారిపోతాం!
Published Fri, Jan 30 2015 10:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM
Advertisement