government ruling
-
Narendra Modi: దేశం గర్వించదగిన క్షణాలెన్నో!
న్యూఢిల్లీ: ఏడేళ్ల పాలనలో దేశం గర్వించదగిన ఎన్నో విజయాలు సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దేశం గర్వించే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ ఏడేళ్లలో విజయాలతో పాటు పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నామని వివరించారు. వాటిలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం అత్యంత తీవ్రమైనదన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ఆదివారం ఈ విషయాలను ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు. దేశ భద్రతతో పాటు పలు ఇతర రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా కారణంగా వేలాది ప్రజల ప్రాణాలను కోల్పోయామని, ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం భారీగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాణాంతక వైరస్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడు సంవత్సరాలు సమిష్టిగా, జనులందరి అభివృద్ధి లక్ష్యంగా, అందరి విశ్వాసాన్ని చూరగొంటూ పాలన సాగించామన్నారు. ‘సబ్ కాసాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ తాము పాటించే మంత్రమన్నారు. ఇతర దేశాల ఒత్తిడి మేరకు కాకుండా.. స్వీయ ప్రయోజనాలు లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారికి తగిన బుద్ధి చెప్పామని గుర్తు చేశారు. ‘దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడనప్పుడు, మన భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలు పెరిగినప్పుడు.. సరైన మార్గంలోనే వెళ్తున్నాం అనిపిస్తూ ఉంటుంది’ అన్నారు. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం దశాబ్దాల తరబడి సాగుతున్న సమస్యలను కూడా శాంతియుతంగా పరిష్కరించగలిగామన్నారు. ఈ ఏడేళ్ల పాలనలో ఈశాన్యం నుంచి కశ్మీరం దాకా ప్రజల్లో శాంతి, పురోగతితో కూడిన విశ్వాసాన్ని పెంపొందించగలిగామన్నారు. స్వాతంత్య్రం తరువాత ఏడు దశాబ్దాల్లో కేవలం 3.5 కోట్ల గ్రామీణ నివాసాలకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందించగలిగారని, తాము గత 21 నెలల్లోనే 4.5 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించగలిగామని తెలిపారు. ఆ 21 నెలల్లో 15 నెలలు ఒకవైపు కరోనాతో పోరాడుతూ మరోవైపు ఈ కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. రికార్డుస్థాయిలో గ్రామాలకు విద్య, వైద్యం, రహదారి, విద్యుత్, బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ సదుపాయాలు పొందిన ఎంతోమంది ప్రజలు ఆ వివరాలు తెలుపుతూ సందేశం పంపించారని తెలిపారు. ప్రభుత్వ పథకం కింది గృహ నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు తనను ఆహ్వానించారన్నారు. డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రపంచదేశాలకు దిక్సూచిగా నిలిచామన్నారు. మరోవైపు, 2014 నుంచి ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని, అయినా, ప్రతీసారి మరింత బలోపేతమవుతూ వచ్చామని తెలిపారు. కరోనా మహమ్మారి పెద్ద పెద్ద దేశాల్లోనూ మారణహోమం సృష్టించిందన్న ప్రధాని.. మొదటి వేవ్‌ను భారత్ సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని, ఈ రెండో వేవ్‌పై కూడా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వికాస యాత్ర ఏడేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ‘వికాస యాత్ర’ పేరుతో ఒక ప్రకటనను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకటనను ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. తమ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేది సేవాస్ఫూర్తి మాత్రమేనని అందులో పేర్కొన్నారు. కరోనా గడ్డుకాలంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించినా, రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి సేకరించినా, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించినా.. అన్నిటికీ ఆ సేవాస్ఫూర్తే కారణమన్నారు. సంక్షోభంలోనూ వ్యవసాయం సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ పేదలకు వ్యవసాయం ఎంతో చేయూతనిచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రికార్డు స్థాయిలో రైతులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన కారణంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వగలిగామని ప్రధాని పేర్కొన్నారు. కరోనా దేశంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేసిందని, అయితే ఈ దాడి నుంచి వ్యవసాయ రంగం తనను తాను రక్షించుకోవడమే కాకుండా పురోగతి సాధించిందన్నారు. కోవిడ్‌పై దేశం పూర్తి శక్తితో ఎలా పోరాడుతుందో అందరూ చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల కాలంలో కరోనాయే అతి పెద్ద మహమ్మారి అన్నారు. సెకండ్ వేవ్‌లో కరోనాతో పోరాటంలో ప్రముఖపాత్ర పోషించిన వారు చాలా మంది ఉన్నారన్నారు. క్రయోజెనిక్ ట్యాంకర్ల డ్రైవర్లు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, వైమానిక దళ పైలట్లు, ల్యాబ్ టెక్నిషియన్లు తదితరులు చాలామంది సంక్షోభ సమయంలో పనిచేసి లక్షలాది మంది ప్రాణాలు రక్షించారని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ యోధుల సేవలకు దేశం వారికి నమస్కరిస్తోంది. లక్షలాది మంది రాత్రింబవళ్లు కరోనా సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఆక్సిజన్‌ను కొరత ఏర్పడటంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో) ఉత్పత్తిని రోజుకు 900 మెట్రిక్ టన్నులు నుంచి 10 రెట్లు పెంచి రోజుకు 9,500 టన్నులకు తీసుకెళ్లాం. దేశం ఇప్పుడు రోజుకి 20 లక్షలుపైగా కరోనా పరీక్షలు చేసే స్థాయికి చేరింది’’ అని మోదీ పేర్కొన్నారు. విజయనగరం మామిడి ప్రస్తావన ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో విజయనగరం మామిడిని ప్రస్తావించారు. కిసాన్ రైలు ద్వారా విజయనగరం నుంచి ఢిల్లీకి మామిడి వస్తోందన్నారు. దీని వల్ల ఉత్తరాది వారికి విజయనగరం మామిడి తినడానికి లభిస్తోం దని, విజయనగరం రైతులకు మంచి ఆదా యం వస్తోందన్నారు. కిసాన్ రైళ్లు ఇప్పటి వరకు సుమారు 2 లక్షల టన్నుల ఉత్పత్తులను రవాణా చేశాయని ప్రధాని తెలిపారు. కిసాన్ రైలు ద్వారా తక్కువ రవాణా ఖర్చులతో రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలను దేశం నలు మూలకు పంపగలుగుతున్నారని అన్నారు. -
ఈ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ మోదీ సర్కారు విఫలమైందని కాంగ్రెస్ మండిపడింది. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించింది. మోదీ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో చోటు చేసుకున్న భారీ వైఫల్యాలపై కాంగ్రెస్ ఆదివారం 7 పాయింట్లతో చార్జిషీట్‌ను విడుదల చేసింది. ‘ఈ ఏడేళ్ల పాలన అంటే.. 140 కోట్ల భారతీయుల భరించలేని వేదన, లెక్కించలేనంత విధ్వంసం’ అని వ్యాఖ్యానించింది. ప్రజలు చూపిన ప్రేమ, నమ్మకాలకు బదులుగా వేదనను, విధ్వంసాన్ని ఇచ్చిందని పేర్కొంది. పెట్రోలు లీటరుకు రూ. 100 కి చేరడం ఈ ప్రభుత్వ ఘనతేనని విమర్శించింది. ఆర్థిక వృద్ధి అథోముఖం పట్టిందని, నిరుద్యోగం ప్రబలిందని, కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆ చార్జిషీట్లో పేర్కొంది. అలాగే, మోదీ సర్కారు వైఫల్యాలపై ‘భారత్ మాతా కీ కహానీ’ పేరుతో 4.5 నిమిషాల నిడివి గల వీడియోను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. ‘కరోనాను కట్టడి చేయడానికి నెలకోసారి మాట్లాడితే సరిపోదు. కరోనాపై విజయం సాధించాలంటే సరైన ఆలోచన, విధానం, పట్టుదల ఉండాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. -
'ఆరునెలల పాలనపై విజయసాయి రెడ్డి కామెంట్'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 30వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రికార్డు స్థాయి గెలుపుతో ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. తమను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు సీఎం వైఎస్ జగన్ నిరంతరం తపిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆరు నెలల పాలనపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. జగన్ తన ఆరునెలల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం వరకూ అమలు చేసి చరిత్ర సృష్టించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చదవండి: జనసేనానిపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్! ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చి.. ఓట్ల రాజకీయం కోసం ఎన్నికల ముందు పథకాలు ప్రకటించే వారికి తాను భిన్నమని నిరూపించారంటున్నారు. 'నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి 52 వేల మంది కార్మికులకు భరోసా కల్పించారు. ఏటా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులకు ధైర్యాన్నిచ్చారు. అసాధారణ మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నిరంతరం తపిస్తున్నారని' విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: 'బాబుని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరు' -
బెదిరిస్తే... పారిపోతాం!
కర్నూలు : కర్నూలు జిల్లాలో అధికార యంత్రాంగానికి కార్పొరేట్ సంస్థలకు మధ్య వివాదం మరింత ముదురుతోంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేపట్టాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ తమపై ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో సీఎస్ఆర్ కింద మౌలిక సదుపాయాల కల్పన అంశం కాస్తా... అటు అధికార యంత్రాంగానికి ఇటు కార్పొరేట్ సంస్థల మధ్య కొత్త చిచ్చును రేపుతోంది. వెళ్లిపొమ్మంటారా...! సీఎస్ఆర్ అమలు కింద జిల్లావ్యాప్తంగా 50కిపైగా కంపెనీలను కలెక్టర్ గుర్తించారు. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికీ జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఈ కంపెనీలు కూడా సీఎస్ఆర్ అమలు చేయమనడంతో ఇప్పుడు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఇటువంటి కంపెనీలు కొన్ని తమ మీద ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతామని పేర్కొంటున్నారు. ఉదాహరణకు.. కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీఎల్ మినరల్ ప్రాసెసింగ్ కంపెనీ యూనిటు ఏర్పాటు కోసం 150 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇక్కడ మినరల్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ అంటోంది. అయితే, ఎటువంటి పనులు ప్రారభించకుండానే తాము ఎక్కడి నుంచి నిధులు తెచ్చి సీఎస్ఆర్ కింద సంక్షేమ కార్యకలాపాలు చేపట్టాలని ఈ కంపెనీ అంటున్నట్టు సమాచారం. ఒకవేళ తమ మీద ఒత్తిడి తెస్తే యూనిట్ ఏర్పాటును విరమించుకుని జిల్లా నుంచి వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాన కంపెనీ నుంచి మైనింగ్ లీజు తీసుకున్న చిన్న కంపెనీలపై కూడా ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రధాన కంపెనీతో పాటు తమను కూడా సీఎస్ఆర్ అమలు చేయాలంటూ తమ మీద ఎలా ఒత్తిడి తెస్తారని కంపెనీల యజమానులు వాపోతున్నారు. మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కార్పొరేట్ల కొర్రీతో జిల్లాలో సీఎస్ఆర్ అమలు ప్రక్రియ కాస్తా నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కంపెనీల పట్ల గుర్రుగా ఉన్నారు. లక్షలాది రూపాయల లాభాన్ని ఆర్జించుకుంటూ.. పేద పిల్లలకు సదుపాయాలు కల్పించకపోవడం ఏమిటని కంపెనీల ప్రతినిధులను ఆయన ప్రశ్నిస్తున్నారు. కొర్రీలు వేస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుకు రాకపోవడం ఏమిటని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని సమాచారం. సీఎస్ఆర్ అమలుకు ససేమిరా అంటే.. ఐటీ దాడులు చేయిస్తానని వారిపై మండిపడ్డట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఈ వ్యవహారం కాస్తా ఇరుపక్షాల మధ్య కొత్త వివాదాలకు కారణమవుతోంది. కంపెనీల చట్టం ఏం చెబుతోంది? వాస్తవానికి సీఎస్ఆర్ను కంపెనీలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏదైనా సంస్థ సీఎస్ఆర్ కింద తమకు వచ్చిన లాభాల నుంచి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సిందే. ఇది కంపెనీల చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఏదైనా సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించి... వచ్చిన నికర లాభాల్లో 2 శాతం మొత్తాన్ని వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను సీఎస్ఆర్ కింద చేపట్టాలి. అయితే, జిల్లాలో ఇప్పటికీ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టని కంపెనీలకు కూడా సీఎస్ఆర్ కింద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాలంటూ లక్ష్యాలు విధిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.