న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ మోదీ సర్కారు విఫలమైందని కాంగ్రెస్ మండిపడింది. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించింది. మోదీ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో చోటు చేసుకున్న భారీ వైఫల్యాలపై కాంగ్రెస్ ఆదివారం 7 పాయింట్లతో చార్జిషీట్‌ను విడుదల చేసింది. ‘ఈ ఏడేళ్ల పాలన అంటే.. 140 కోట్ల భారతీయుల భరించలేని వేదన, లెక్కించలేనంత విధ్వంసం’ అని వ్యాఖ్యానించింది. ప్రజలు చూపిన ప్రేమ, నమ్మకాలకు బదులుగా వేదనను, విధ్వంసాన్ని ఇచ్చిందని పేర్కొంది.
పెట్రోలు లీటరుకు రూ. 100 కి చేరడం ఈ ప్రభుత్వ ఘనతేనని విమర్శించింది. ఆర్థిక వృద్ధి అథోముఖం పట్టిందని, నిరుద్యోగం ప్రబలిందని, కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆ చార్జిషీట్‌లో పేర్కొంది. అలాగే, మోదీ సర్కారు వైఫల్యాలపై ‘భారత్ మాతా కీ కహానీ’ పేరుతో 4.5 నిమిషాల నిడివి గల వీడియోను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. ‘కరోనాను కట్టడి చేయడానికి నెలకోసారి మాట్లాడితే సరిపోదు. కరోనాపై విజయం సాధించాలంటే సరైన ఆలోచన, విధానం, పట్టుదల ఉండాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment