న్యూఢిల్లీ: ఏడేళ్ల పాలనలో దేశం గర్వించదగిన ఎన్నో విజయాలు సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దేశం గర్వించే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ ఏడేళ్లలో విజయాలతో పాటు పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నామని వివరించారు. వాటిలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం అత్యంత తీవ్రమైనదన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ఆదివారం ఈ విషయాలను ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు. దేశ భద్రతతో పాటు పలు ఇతర రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రధాని తన ప్రసంగంలో వివరించారు.
కరోనా కారణంగా వేలాది ప్రజల ప్రాణాలను కోల్పోయామని, ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం భారీగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాణాంతక వైరస్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడు సంవత్సరాలు సమిష్టిగా, జనులందరి అభివృద్ధి లక్ష్యంగా, అందరి విశ్వాసాన్ని చూరగొంటూ పాలన సాగించామన్నారు. ‘సబ్ కాసాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ తాము పాటించే మంత్రమన్నారు. ఇతర దేశాల ఒత్తిడి మేరకు కాకుండా.. స్వీయ ప్రయోజనాలు లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారికి తగిన బుద్ధి చెప్పామని గుర్తు చేశారు. ‘దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడనప్పుడు, మన భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలు పెరిగినప్పుడు.. సరైన మార్గంలోనే వెళ్తున్నాం అనిపిస్తూ ఉంటుంది’ అన్నారు.
దశాబ్దాల సమస్యలకు పరిష్కారం
దశాబ్దాల తరబడి సాగుతున్న సమస్యలను కూడా శాంతియుతంగా పరిష్కరించగలిగామన్నారు. ఈ ఏడేళ్ల పాలనలో ఈశాన్యం నుంచి కశ్మీరం దాకా ప్రజల్లో శాంతి, పురోగతితో కూడిన విశ్వాసాన్ని పెంపొందించగలిగామన్నారు. స్వాతంత్య్రం తరువాత ఏడు దశాబ్దాల్లో కేవలం 3.5 కోట్ల గ్రామీణ నివాసాలకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందించగలిగారని, తాము గత 21 నెలల్లోనే 4.5 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించగలిగామని తెలిపారు. ఆ 21 నెలల్లో 15 నెలలు ఒకవైపు కరోనాతో పోరాడుతూ మరోవైపు ఈ కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. రికార్డుస్థాయిలో గ్రామాలకు విద్య, వైద్యం, రహదారి, విద్యుత్, బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించామని వివరించారు.
ఈ సదుపాయాలు పొందిన ఎంతోమంది ప్రజలు ఆ వివరాలు తెలుపుతూ సందేశం పంపించారని తెలిపారు. ప్రభుత్వ పథకం కింది గృహ నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు తనను ఆహ్వానించారన్నారు. డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రపంచదేశాలకు దిక్సూచిగా నిలిచామన్నారు. మరోవైపు, 2014 నుంచి ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని, అయినా, ప్రతీసారి మరింత బలోపేతమవుతూ వచ్చామని తెలిపారు. కరోనా మహమ్మారి పెద్ద పెద్ద దేశాల్లోనూ మారణహోమం సృష్టించిందన్న ప్రధాని.. మొదటి వేవ్‌ను భారత్ సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని, ఈ రెండో వేవ్‌పై కూడా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
వికాస యాత్ర
ఏడేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ‘వికాస యాత్ర’ పేరుతో ఒక ప్రకటనను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకటనను ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. తమ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేది సేవాస్ఫూర్తి మాత్రమేనని అందులో పేర్కొన్నారు. కరోనా గడ్డుకాలంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించినా, రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి సేకరించినా, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించినా.. అన్నిటికీ ఆ సేవాస్ఫూర్తే కారణమన్నారు.
సంక్షోభంలోనూ వ్యవసాయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ పేదలకు వ్యవసాయం ఎంతో చేయూతనిచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రికార్డు స్థాయిలో రైతులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన కారణంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వగలిగామని ప్రధాని పేర్కొన్నారు. కరోనా దేశంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేసిందని, అయితే ఈ దాడి నుంచి వ్యవసాయ రంగం తనను తాను రక్షించుకోవడమే కాకుండా పురోగతి సాధించిందన్నారు. కోవిడ్‌పై దేశం పూర్తి శక్తితో ఎలా పోరాడుతుందో అందరూ చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల కాలంలో కరోనాయే అతి పెద్ద మహమ్మారి అన్నారు. సెకండ్ వేవ్‌లో కరోనాతో పోరాటంలో ప్రముఖపాత్ర పోషించిన వారు చాలా మంది ఉన్నారన్నారు.
క్రయోజెనిక్ ట్యాంకర్ల డ్రైవర్లు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, వైమానిక దళ పైలట్లు, ల్యాబ్ టెక్నిషియన్లు తదితరులు చాలామంది సంక్షోభ సమయంలో పనిచేసి లక్షలాది మంది ప్రాణాలు రక్షించారని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ యోధుల సేవలకు దేశం వారికి నమస్కరిస్తోంది. లక్షలాది మంది రాత్రింబవళ్లు కరోనా సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఆక్సిజన్‌ను కొరత ఏర్పడటంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంవో) ఉత్పత్తిని రోజుకు 900 మెట్రిక్ టన్నులు నుంచి 10 రెట్లు పెంచి రోజుకు 9,500 టన్నులకు తీసుకెళ్లాం. దేశం ఇప్పుడు రోజుకి 20 లక్షలుపైగా కరోనా పరీక్షలు చేసే స్థాయికి చేరింది’’ అని మోదీ పేర్కొన్నారు.
విజయనగరం మామిడి ప్రస్తావన
ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో విజయనగరం మామిడిని ప్రస్తావించారు. కిసాన్ రైలు ద్వారా విజయనగరం నుంచి ఢిల్లీకి మామిడి వస్తోందన్నారు. దీని వల్ల ఉత్తరాది వారికి విజయనగరం మామిడి తినడానికి లభిస్తోం దని, విజయనగరం రైతులకు మంచి ఆదా యం వస్తోందన్నారు. కిసాన్ రైళ్లు ఇప్పటి వరకు సుమారు 2 లక్షల టన్నుల ఉత్పత్తులను రవాణా చేశాయని ప్రధాని తెలిపారు. కిసాన్ రైలు ద్వారా తక్కువ రవాణా ఖర్చులతో రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలను దేశం నలు మూలకు పంపగలుగుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment