
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 30వ తేదీన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రికార్డు స్థాయి గెలుపుతో ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. తమను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు సీఎం వైఎస్ జగన్ నిరంతరం తపిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆరు నెలల పాలనపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. జగన్ తన ఆరునెలల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం వరకూ అమలు చేసి చరిత్ర సృష్టించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చదవండి: జనసేనానిపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్!
ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చి.. ఓట్ల రాజకీయం కోసం ఎన్నికల ముందు పథకాలు ప్రకటించే వారికి తాను భిన్నమని నిరూపించారంటున్నారు. 'నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి 52 వేల మంది కార్మికులకు భరోసా కల్పించారు. ఏటా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులకు ధైర్యాన్నిచ్చారు. అసాధారణ మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నిరంతరం తపిస్తున్నారని' విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.