షర్మిలపై విజయసాయిరెడ్డి మండిపాటు
సరస్వతి షేర్ల బదిలీపై సుప్రీం రిటైర్డ్ జడ్జీల న్యాయ సలహాను సైతం మీకు పంపినా పెడచెవిన పెడతారా?
ఇప్పటికే పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చిన అన్నకు.. సొంత ఆస్తిలో 40 శాతం వాటా రాసిచ్చిన జగనన్నకు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?
వైఎస్సార్ చనిపోయిన పదేళ్ల తరువాత.. మీ వివాహమైన 20 ఏళ్ల తరువాత తన సొంత ఆస్తిలో వాటా ఏ అన్న అయినా ఇస్తాడా?
కనీస కృతజ్ఞత చూపకపోగా శత్రువుల కుట్రల్లో పాలు పంచుకుంటారా?
మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా?
అతి మంచితనం వల్లే జగన్ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఈడీ జప్తు చేసిన, హైకోర్టు స్టే విధించిన సరస్వతి పవర్ షేర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురై బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసినా షర్మిల రాజకీయ కుట్రలో భాగస్వామిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్ జగన్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీల న్యాయ సలహాను షర్మిలకు పంపించినా పెడచెవిన పెట్టారని చెప్పారు.
ఏ చెల్లి అయినా ఇలా చేస్తుందా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయిన పదేళ్లకు.. షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తరువాత తాను వ్యాపారాల ద్వారా సంపాదించిన వాటిల్లో రూ.200 కోట్లు ఇచ్చిన అన్న పట్ల.. తన సొంత ఆస్తిలో 40 % ఇవ్వటానికి సిద్ధపడిన అన్నపై కనీస కృతజ్ఞత లేకపోగా నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే.. చంద్రబాబుతో కలసి బెయిల్ రద్దు చేసే కుట్రలు పన్నటమేని షర్మిలను విమర్శించారు.
మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులను షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. అతి మంచితనం వల్లే జగన్ అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాతో కలిసి నిర్వహించే మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే జగన్‌పై దూషణలకే షర్మిల 95 శాతం ప్రాధాన్యమిస్తోందన్నారు.
తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికే ఇదంతా అని షర్మిల చెప్పడం అబద్ధమని, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే అన్నపై కుయుక్తులు పన్నుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై, వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు, ఆస్తుల విషయంలో జగన్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారానికి సంబంధించిందన్నారు. జగన్‌ను తిరిగి సీఎం కాకుండా చేయాలన్నదే షర్మిల ఆలోచనని, చంద్రబాబు ఇచ్చిన అజెండాతోనే ఆమె పనిచేస్తున్నారన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నా, కేంద్రంలో ఆ పార్టీకి ఎన్‌డీఏ వ్యతిరేకమైనా, ఆమె బాబుతో లాలూచీపడి జగన్‌పై కుట్రలు చేస్తోందన్నారు.
షర్మిల మాటలను ప్రజలు నమ్మరు
తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించడం, జగన్‌ను నమ్మొదని చెప్పడం ఎంత ద్రోహమో, అన్యాయమో తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని షర్మిలకు సూచించారు. చంద్రబాబు మాటలనే ఆమె వల్లిస్తున్నారని, ఆయన అజెండాను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు.
వైఎస్ జగన్ కోటిన్నర కుటుంబాలకు, 80 లక్షల మంది అక్క చెల్మెమ్మలకు ఆసరా ఇచ్చారని, 45 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని, అలాంటి సీఎం దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇంత మందికి మేలు చేసిన జగన్ సొంత ఇంట్లో తల్లి, చెల్లికి అన్యాయం చేస్తారని కుట్రపూరితంగా చెబుతుంటే ఎవరు నమ్ముతారని షర్మిలను నిలదీశారు. మహిళల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచాలనే చంద్రబాబు దుర్మార్గ అజెండాకు షర్మిల సహకరిస్తోందన్నారు.
తండ్రి మృతికి కారణమైన బాబుతో దోస్తీ
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు చేయడం దుర్మార్గమని సాయిరెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని షర్మిల గతంలో అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాజశేఖర్‌రెడ్డి మరో 15 రోజుల్లో దుర్మార్గమైన చావు చస్తాడని’ అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు.
వైఎస్ మరణానికి చంద్రబాబే కారణమని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం, పసుపు చీర కట్టుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం, చర్చలు జరపడం, కుట్రలు చేయడం... ఇంతకన్నా అమానవీయ ప్రవర్తన ఉంటుందా? అని ప్రశ్నించారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వాడుకుని జగన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అని షర్మిలను ప్రశ్నించారు.
జగన్ మోచేతి నీళ్లు తాగుతూ అనుకూలంగా మాట్లాడుతున్నామని తనను, వైవీ సుబ్బారెడ్డిని షర్మిల విమర్శించడం సహేతుకం కాదన్నారు. శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్ననే వేటాడి, వెంటాడి కాటేసే చెల్మెమ్మ షర్మిల మినహా ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్‌ఆర్ ఆత్మ క్షోభకు కారణమైన షర్మిల ఎల్లో మీడియా ముందు పెట్టే కన్నీటికి విలువ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్రలకు షర్మిలను వాడుకుంటున్నాడని విమర్శించారు.
దేశంలో ఇలాంటి అన్న ఉంటాడా?
వైఎస్‌ఆర్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌కు వచ్చిన ఆస్తులను కుమారుడు, కుమార్తెకు ఆయన జీవించి ఉన్నప్పుడే పంచారని తెలిపారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీసు ఆస్తులు, బైరైటీస్ మినరల్స్ స్టాక్స్, 25 మెగావాట్ల సరస్వతి పవర్, ఎస్‌ఆర్‌ఎస్ హైడ్రో, 51 ఎకరాల ఇడుపులపాయ భూములు, 79 ఎకరాల శెట్టిగుంట ఆస్తులు, 7.6 ఎకరాల పులివెందుల భూములు, బంజారాహిల్స్‌లోని 280 గజాలు, విజయవాడలోని రాజ్‌యువరాజ్ థియేటర్లు షర్మిలకు అప్పగించారని చెప్పారు.
వైఎస్ జగన్ తనకు వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేశారన్నారు. జగన్ నెలకొల్పిన భారతీ సిమెంట్స్ కోసం తొలుత రూ.1,400 కోట్లు అప్పు చేశారని, ఆ తర్వాత తీర్చారని తెలిపారు. సాక్షి మీడియా మొదట్లో నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ నష్టాలు, అప్పులను షర్మిల ఎప్పుడూ పంచుకోలేదన్నారు.
ఇవన్నీ జగన్ తన దక్షతతో అభివృద్ధి చేసి, లాభాల్లోకి నడిపించారని గుర్తు చేశారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టారని, తానే ఆ పేర్లు సూచించానని వెల్లడించారు. ఆమెకు ఏదైనా కంపెనీ నచ్చితే ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల పంపకాలు ఏ విధంగా జరిగాయో తెలుస్తుందన్నారు.
అమ్మ తటస్థతపై సందేహాలు!
తన అసంబద్ధ చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు వైఎస్ విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విజయమ్మను మొదటి నుంచి భావోద్వేగాలకు గురి చేసి షర్మిల ప్రభావితం చేస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని నెటిజన్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా సరస్వతి షేర్ల ట్రాన్స్‌ఫర్ పత్రాలపై సంతకాలు చేయడం.. పలు సందర్భాల్లో షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడం ఆమె తటస్థ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చినట్లు చర్చించుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని పేర్కొంటున్నారు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తు చేస్తున్నారు. ‘క్షమార్హం కాని అక్రమ చర్యల్లో అమ్మను భాగం చేశావు.
గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసీ బదలాయింపు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికెట్లు, షేర్ ట్రాన్స్‌ఫర్ ఫారాలు పోయినట్లుగా అమ్మ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీనివల్ల కుమారుడిగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది.
ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది...’ అని తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నెటిజన్లు, ప్రజలు ఉదహరిస్తున్నారు.కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment