పల్లెలకు ఎల్‌ఈడీలు!
వీధిదీపాలకు పొదుపు మంత్రం
సీఎస్‌ఆర్ కింద పంపిణీకి ఎన్‌టీపీసీ సంసిద్ధత
విశాఖపట్నం: విద్యుత్తు వాడకాన్ని తగ్గించే ఎల్‌ఈడీ దీపాలు విశాఖ నగరంలో విజయవంతం కావడంతో అదే రీతిలో గ్రామాల్లోనూ ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని పంచాయతీలకు అందించడానికి ఎన్‌టీపీసీ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. వీటిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని అధికారవర్గాల సమాచారం. విశాఖనగరంలో జాతీయ రహదారి, బీఆర్‌టీఎస్ రహదారితో పాటు వీధిదీపాలకు ఎల్‌ఈడీ లైట్లను వినియోగిస్తున్నారు. వీటితో విద్యుత్తు పొదుపు సాధ్యమైంది.
దీంతో జిల్లాలోని 925 పంచాయతీల్లోనూ వీధిదీపాలకు ఎల్‌ఈడీ లైట్లను వినియోగించాలనే సూచనలు వచ్చాయి. ఈమేరకు సీఎస్‌ఆర్ కింద ఎల్‌ఈడీ దీపాలను అందించేందుకు ఎన్‌టీపీసీ సింహాద్రి యాజమాన్యం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఎన్ని దశల్లో, ఏయే పంచాయతీల్లో ఎప్పుడెప్పుడు... ఎన్నెన్ని ఏర్పాటు చేయాలనే విషయమై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఎన్‌టీపీసీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... త్వరలోనే గ్రామాల్లోనూ తెల్లని ఎల్‌ఈడీ వెలుగులు విరబూస్తాయి.