సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా విద్యాధికారిని బదిలీ వ్యవహారం పీటముడిగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో డీఈఓను రిలీవ్ చేసే ప్రసక్తే లేదని తేల్చేసిన కలెక్టర్ స్మితా సబర్వాల్ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు లేఖలు కూడా రాశారు.
ప్రస్తుతం ఉన్న డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ , ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా డీఈఓ రాజేశ్వర్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగ ప్రవేశం చేశారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా అట్టడుగు స్థానంలో ఉందనీ, ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆరు నెలలుగా ప్రణాళిక వేసుకొని, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నామంటున్నారు. ఈ పరిస్థితుల్లో అర్ధాంతరంగా డీఈఓను బదిలీ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని కలెక్టర్ చెప్తున్నారు. పైగా డీఈఓను రాబోయే సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం
మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంటు నోడల్ అధికారిగా నియమించామనీ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని ఎన్నికల కమిషన్‌కు తెలియకుండా ఎలా బదిలీ చేస్తారని కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈమేరకు ఆమె ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ప్రాథమికోన్నత విద్యాశాఖ కమిషనర్‌కు నివేదించారు. అంతకుముందే కలెక్టర్ స్మితా సబర్వాల్ డీఈఓను మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారిగా నియమించిన సర్టిఫికెట్ కాపీని ఈసీకి పంపినట్టు తెలిసింది. అయితే ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాతే కలెక్టర్ లేవనెత్తిన బదిలీ అంశం ఈసీ నిబంధనల కిందకు వస్తుందని సదరు ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. మరోవైపు ప్రకాశం జిల్లా నుంచి బదిలీ అయిన రాజేశ్వర్‌రావు తన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అక్కడ నుంచి రిలీవ్ కాలేక, ఇక్కడ జాయిన్ కాలేక ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
తిరుగుబాటు
Published Thu, Feb 13 2014 11:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement