rajeswarrao
-
కరువులో పాడిపరిశ్రమనే లాభసాటి
2లక్షల లీటర్ల సేకరణే లక్ష్యం కరీంనగర్ డెయిరీ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు తిమ్మాపూర్: కరువు నెలకొన్న నేపథ్యంలో రైతులు పాడిపరిశ్రమపై దృష్టిసారిస్తే లాభసాటిగా ఉంటుందని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్, కరీంనగర్ డెయిరీ అధ్యక్షుడు సీహెచ్.రాజేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని నుస్తులాపూర్ బల్క్ కూలింగ్ యూనిట్ పరిధిలోని గ్రామాల్లో పాడి రైతులకు ఆమ్ఆద్మీ భీమా యోజన(ఏఏబీవై), పిల్లలకు స్కాలర్షిప్లు చెక్కులను ఆదివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది 1.93లక్షల లీటర్ల పాలు సేకరించగా.. ఈ సారి 2లక్షలకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ డెయిరీలోనే 4లక్షల లీటర్లను స్టోరేజీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు తెలిపారు. పాల సేకరణకు తగినట్లుగా మార్కెంటింగ్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మరో రెండేళ్లలో సంస్థను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక పాలసేకరణ, విక్రయించే సంస్థగా కరీంనగర్ డెయిరీని నిలిపేందుకు నాణ్యమైన పాలను పోస్తూ రైతులు సహకారం అందించాలని కోరారు. రైతులు కుటుంబాల్లోని విద్యార్థులు సైతం క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రతిభను చూపుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. డెయిరీ అడ్వయిజర్ హన్మంతరెడ్డి, మేనేజర్లు అంజారెడ్డి, లింగారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, నుస్తులాపూర్ డెయిరీ అధ్యక్షుడు వంగల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
భూ ఆక్రమణ కేసులో 70 మంది అరెస్టు
ఆలమూరు : తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో వివాదాస్పద భూమిని ఆక్రమించిన సంఘటనలో శుక్రవారం 70 మంది అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు, దళితకూలీలు అరెస్టయ్యారు. నర్శిపూడి-బడుగువానిలంకల మధ్య 30 ఎకరాల భూమి కోసం రెండు గ్రామాల దళితుల నడుమ మూడు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. గత ఏడాది జూన్‌లో ఇరువర్గాల మధ్య కొట్లాట జరగ్గా బడుగువానిలంకకు చెందిన ఇద్దరు దళితులు మరణించారు. అప్పటి నుంచీ ప్రభుత్వాధీనంలోనున్న ఈ భూమిని గురువారం బడుగువానిలంకకు చెందిన దళితులు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించారు. ఆలమూరు తహసీల్దారు టి.ఆర్.రాజేశ్వరరావు, మండపేట సీఐ వి.పుల్లారావు నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని భారీస్థాయిలో మోహరించి వివాదస్పద భూమి నుంచి ఖాళీ చేయించేందుకు జరిపిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భూమిని ఖాళీ చేసి చర్చలకు రావాలన్న అధికారుల ఆదేశాలను సంఘం ప్రతినిధులు లక్ష్యపెట్టకపోవడంతో శుక్రవారం 70 మందిని అరెస్ట్ చేసి ఆలమూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్సై ఎం.శేఖర్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా విద్యాధికారిని బదిలీ వ్యవహారం పీటముడిగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో డీఈఓను రిలీవ్ చేసే ప్రసక్తే లేదని తేల్చేసిన కలెక్టర్ స్మితా సబర్వాల్ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు లేఖలు కూడా రాశారు. ప్రస్తుతం ఉన్న డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ , ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా డీఈఓ రాజేశ్వర్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగ ప్రవేశం చేశారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా అట్టడుగు స్థానంలో ఉందనీ, ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆరు నెలలుగా ప్రణాళిక వేసుకొని, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నామంటున్నారు. ఈ పరిస్థితుల్లో అర్ధాంతరంగా డీఈఓను బదిలీ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని కలెక్టర్ చెప్తున్నారు. పైగా డీఈఓను రాబోయే సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం మ్యాన్‌పవర్ మేనేజ్మెంటు నోడల్ అధికారిగా నియమించామనీ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని ఎన్నికల కమిషన్‌కు తెలియకుండా ఎలా బదిలీ చేస్తారని కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈమేరకు ఆమె ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ప్రాథమికోన్నత విద్యాశాఖ కమిషనర్‌కు నివేదించారు. అంతకుముందే కలెక్టర్ స్మితా సబర్వాల్ డీఈఓను మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా నియమించిన సర్టిఫికెట్ కాపీని ఈసీకి పంపినట్టు తెలిసింది. అయితే ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాతే కలెక్టర్ లేవనెత్తిన బదిలీ అంశం ఈసీ నిబంధనల కిందకు వస్తుందని సదరు ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. మరోవైపు ప్రకాశం జిల్లా నుంచి బదిలీ అయిన రాజేశ్వర్‌రావు తన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అక్కడ నుంచి రిలీవ్ కాలేక, ఇక్కడ జాయిన్ కాలేక ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.