ఆలమూరు : తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో వివాదాస్పద భూమిని ఆక్రమించిన సంఘటనలో శుక్రవారం 70 మంది అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు, దళితకూలీలు అరెస్టయ్యారు. నర్శిపూడి-బడుగువానిలంకల మధ్య 30 ఎకరాల భూమి కోసం రెండు గ్రామాల దళితుల నడుమ మూడు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. గత ఏడాది జూన్‌లో ఇరువర్గాల మధ్య కొట్లాట జరగ్గా బడుగువానిలంకకు చెందిన ఇద్దరు దళితులు మరణించారు. అప్పటి నుంచీ ప్రభుత్వాధీనంలోనున్న ఈ భూమిని గురువారం బడుగువానిలంకకు చెందిన దళితులు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించారు.
ఆలమూరు తహసీల్దారు టి.ఆర్.రాజేశ్వరరావు, మండపేట సీఐ వి.పుల్లారావు నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని భారీస్థాయిలో మోహరించి వివాదస్పద భూమి నుంచి ఖాళీ చేయించేందుకు జరిపిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భూమిని ఖాళీ చేసి చర్చలకు రావాలన్న అధికారుల ఆదేశాలను సంఘం ప్రతినిధులు లక్ష్యపెట్టకపోవడంతో శుక్రవారం 70 మందిని అరెస్ట్ చేసి ఆలమూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్సై ఎం.శేఖర్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు.
భూ ఆక్రమణ కేసులో 70 మంది అరెస్టు
Published Fri, Sep 18 2015 7:58 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM
Advertisement