Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్‌ | Andhra Pradesh Govt solution to Many land problems with land survey | Sakshi
Sakshi News home page

Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్‌

Published Sun, Jun 25 2023 4:30 AM | Last Updated on Sun, Jun 25 2023 10:26 AM

Andhra Pradesh Govt solution to Many land problems with land survey - Sakshi

రీ సర్వే తర్వాత గుంటూరు జిల్లా కుర్నూతల గ్రామంలో భూ కమతాలు

22(ఏ) చెర నుంచి విముక్తి  
గుంటూరు జిల్లా కుర్నూతల గ్రామంలోని జాస్తి వీరయ్య, ఆయన ఇద్దరు సోదరులు, చెల్లెళ్లకు కలిపి సర్వే నంబర్‌ 159లో 6.60 ఎకరాల భూమి ఉంది. ఆయన సోదరి.. తన కుమార్తె పెళ్లికి కొంత భూమిని పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రయత్నిస్తే కాలేదు. 2016 నుంచి దానిపై వారు పోరాడుతూనే ఉన్నారు. ఈ పొలం రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో ఆ కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రీ సర్వే మొదలైంది. సర్వే నంబర్‌ 159లోని మొత్తం 25.69 ఎకరాలు 19 మంది రైతుల పేరు మీద ఉంది. అందులో ముగ్గురు రైతులకు చెందిన 3.25 ఎకరాలను 2016లో దేవదాయ శాఖ తన భూమిగా పేర్కొంది. దీంతో ఆ సర్వే నంబర్‌ మొత్తాన్ని 22 (ఏ)1 (సి)లో నమోదు చేయడంతో మిగిలిన 16 మంది రైతుల భూమి కూడా వివాదంగా మారింది. ఇప్పుడు రీ సర్వే­లో సబ్‌ డివిజన్‌ ద్వారా 16 మంది రైతులకు, దేవదాయ శాఖగా చెప్పిన భూమికి ప్రత్యేకంగా ఎల్‌పీఎం నంబర్లు రావడంతో సమస్య పరిష్కారమైంది.
 

ప్రతి గ్రామంలో నిత్యం భూ తగాదాలు.. ఏ కోర్టుకు వెళ్లినా దాదాపు సగం కేసులు భూ సమస్యలే. భూ పంపకాలు చేసుకోవాలన్నా, పిల్లల పెళ్లిళ్లు.. చదువుల కోసం విక్రయించాలన్నా, తుదకు దానమివ్వాలన్నా కూడా సమస్యే. ఈ సమస్యలన్నింటికీ ఒకే సమాధానం భూముల రీ సర్వే. ఎప్పుడో బ్రిటీష్‌ కాలంలో జరిగింది. ఆ తర్వాత దేశంలోనే ఎవరూ అంత ధైర్యం చేయలేదు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో దూర దృష్టితో ఆలోచించి ఈ సాహసానికి పూనుకున్నారు. ఒక్క కలం పోటుతో రీ సర్వేకు ఆదేశించారు. వెరసి లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరిస్తూ వారి రాతలు తిరగరాస్తున్నారు. 

బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేతో లక్షల సంఖ్యలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, మ్యుటేషన్లు, సబ్‌ డివిజన్లు, నిషేధిత ఆస్తులు, వారసత్వ అంశాలు వంటి ఎన్నో చిక్కు ముడులను విప్పుతూ రీ సర్వే సమాధానం చూపుతోంది. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని వందలాది పనులను రీ సర్వే బృందాలు ప్రతి గ్రామంలో కొలిక్కి తెస్తున్నాయి.

రీ సర్వే జరిగిన తీరు, రైతులకు కలిగిన ప్రయోజనాలను ‘సాక్షి’ బృందం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల, గారపాడు, యామర్రు, అనంతవరప్పాడు గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించింది. ప్రతిచోటా భూ వివాదాలు, సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమైంది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పేరుతో జరుగుతున్న రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో పూర్తయింది. ఆ గ్రామాల్లో తాజా వివరాలతో డిజిటల్‌ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి.

ప్రతి భూ కమతాన్ని కొలిచి అక్షాంశ, రేఖాంశాలతో హద్దులు నిర్ణయించారు. ఆ హద్దుల్లో ప్రభుత్వ ఖర్చులతోనే సర్వే రాళ్లు పాతారు. ప్రతి రైతుకు భూ హక్కు పత్రం ఇచ్చారు. వారి భూ కమతానికి సంబంధించి ఆధార్‌ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య (యునిక్‌ కోడ్‌) కేటాయించారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలోనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. దాన్ని స్కాన్‌ చేసి భూమి వివరాలను ఎప్పుడైనా చూసుకునే అవకాశం కల్పించారు. ఇవన్నీ చేయడానికి ముందే రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేశారు.  

సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ప్రయోజనాలు  
► 2 వేల గ్రామాల తుది ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌)లు సిద్ధం 
► 7.8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు జారీ  
► హద్దుల్లో 25.8 లక్షల సర్వే రాళ్లు పాతారు 
► 2 లక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సర్వే సబ్‌ డివిజన్లు చేయడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం 
► 1.08 లక్షల మంది రైతుల పేర్లు తొలిసారి రికార్డుల్లోకి ఎక్కాయి 
► 2 వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి 
► 4 లక్షలకుపైగా సరిహద్దు వివాదాలు పరిష్కారం 
► 18.3 లక్షల ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్స్‌ (ఎల్‌పీఎం) జారీ.. (సర్వే నంబర్లు)  

ల్యాండ్‌ కన్వర్షన్‌ సమస్యకు పరిష్కారం 
కుర్నూతల గ్రామానికి చెందిన దూపాటి శివనాగేంద్రం దంపతులకు సర్వే నంబర్‌ 151, 152లో 4 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ భూమిగా ఉన్న వారి భూమిని వ్యవసాయేతర భూమిగా (గజాల్లో) నమోదు చేయడంతో ఆ భూమి విలువ ఉన్న దాని కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అదే సర్వే నంబర్‌లో ఉన్న మరో రైతు తన అవసరాల కోసం తన వాటా భూమిని వ్యవసాయేతర భూమిగా (ల్యాండ్‌ కన్వర్షన్‌) మార్చుకున్నారు.

సబ్‌ డివిజన్‌ జరక్కపోవడంతో మొత్తం ఆ సర్వే నంబర్‌లోని భూమి అంతా వ్యవసాయేతర భూమిగా నమోదైంది. దీంతో మిగిలిన రైతులు తమ భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్‌ చేయాలంటే దాని విలువ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారింది. రీ సర్వేలో సబ్‌ డివిజన్‌ జరిగి ప్రతి భూ కమతానికి ప్రత్యేకంగా ఎల్‌పీఎం నంబర్‌ ఇవ్వడంతో శివనాగేంద్రం కుటుంబంతోపాటు చాలా మంది రైతులకు మేలు జరిగింది.  
 
కాలువ పోరంబోకుగా నమోదైన భూమికి విముక్తి 
వట్టిచెరుకూరు మండలం గారపాడుకు చెందిన బొడ్డపాటి నర్సారెడ్డికి ఉన్న 3.3 ఎకరాలను కాలువ పోరంబోకు భూమిగా చూపుతూ నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు. సర్వే నంబర్‌ 115లో నర్సారెడ్డి భూమితోపాటు కాలువ పోరంబోకు భూమి కూడా ఉంది. కాలువ భూమి ప్రభుత్వ పోరంబోకు కావడం, ఆ సర్వే నంబర్‌లోని భూములు సబ్‌ డివిజన్‌ కాకపోవడంతో నర్సారెడ్డి భూమి 22 (ఏ)1 (బీ)లో నమోదైంది. రీ సర్వేలో ప్రతి భూమికి సబ్‌ డివిజన్‌ జరిగి నర్సారెడ్డి భూమికి ప్రత్యేకంగా ఎల్‌పీఎం నంబర్‌ను ఇచ్చి వెబ్‌ల్యాండ్‌–2లో నమోదు చేశారు. దీంతో నిషేధిత జాబితా నుంచి విముక్తి లభించింది. 

50 ఏళ్ల సమస్యకు పరిష్కారం 
వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన రాయపాటి ఇస్సాకుకు 0.37 సెంట్ల భూమి ఉంది. తన తండ్రి 50 ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో స్టాంప్‌ పేపర్‌ మీద ఈ భూమి కొన్నట్లు రాయించుకున్నారు. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే ఆ భూమి ఉన్నా, రిజిస్టర్‌ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అనేక సంవత్సరాలుగా అలాగే వదిలేశారు. రీ సర్వేలో సాదాబైనామా కేసుల పరిష్కారంలో భాగంగా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఇస్సాకు పేరును అడంగల్‌లో నమోదు చేశారు. పట్టాదార్‌ పాస్‌బుక్‌ కూడా జారీ అయింది.  
 
వారసత్వంగా వచ్చిన ఆస్తికి మ్యుటేషన్‌ 
వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామానికి చెందిన యామర్తి వెంకట నాగదుర్గా శ్రీలక్ష్మికి వారసత్వంగా 75 సెంట్ల భూమి వచ్చింది. 50 ఏళ్ల నుంచి ఆమె కుటుంబం చేతిలోనే ఆ భూమి ఉంది. ఆమె తాత నరసింహారావు, ఆ తర్వాత ఆయన కొడుకు సీతారామాంజనేయుల నుంచి ఆమెకు భూమి వచ్చింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు.

పాత రెవెన్యూ రికార్డుల్లో నరసింహారావు పేరు తప్ప ఇతర వివరాలు లేవు. అనారోగ్య కారణాలతో ఆ భూమిని అమ్ముకుందామని శ్రీలక్ష్మి తండ్రి ప్రయత్నిస్తే ఆన్‌లైన్‌లో ఎక్కలేదు కాబట్టి కుదరదన్నారు. రీ సర్వేలో విచారించి ఎవరి నుంచి అభ్యంతరాలు లేకపోవడం, భూమి వారి ఆ«దీనంలో ఉండడంతో ఇటీవలే ఆమె పేరుతో మ్యుటేషన్‌ చేశారు.  

ఏపీ రీ సర్వే దేశానికి రోల్‌ మోడల్‌  
దేశంలో వందేళ్ల తర్వాత ఏపీలో మాత్రమే జరుగుతున్న రీ సర్వే కార్యక్రమం విజయవంతమైంది. మన రీ సర్వేను ఇతర రాష్ట్రాలు మోడల్‌గా తీసుకుంటున్నాయి. ఈ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాం. రాష్ట్రంలోని మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికిగాను డ్రోన్లు, విమానాలతో ఇప్పటికి 1.06 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సర్వే చేశాం. త్వరలో డ్రోన్, ఏరియల్‌ సర్వే పూర్తవుతుంది.

2 వేల గ్రామాల్లో అన్ని దశల రీ సర్వే పూర్తయి ఆ గ్రామాల ఆర్‌ఓఆర్‌లు సిద్ధమయ్యాయి. రీ సర్వే ప్రతి దశలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన లక్షలాది భూ సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతున్నాయి. ఇప్పటి వరకు 23 వేలకుపైగా వివాదాలను మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు పరిష్కరించాయి.

మ్యుటేషన్లు, సబ్‌ డివిజన్లు, కొత్త ఎంట్రీలు.. వంటివి లక్షల్లో జరుగుతున్నాయి. భావితరాలకు సైతం తమ భూముల గురించి తెలిసేలా డిజిటల్‌ రికార్డులు రూపొందుతున్నాయి. రీసర్వేలో వాటికి భద్రత ఏర్పడుతుంది. టాంపరింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ స్థాయిలోనే భూముల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. 
    – సిద్ధార్ధ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement