భూములను సర్వే చేసే డ్రోన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న భూముల సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు కచ్చితంగా అందాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే) పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
తొలివిడత గ్రామాల్లో జనవరికి పత్రాలు
‘రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం. వందేళ్ల తర్వాత మళ్లీ సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత మంది సర్వేయర్లు, సిబ్బంది మన వద్ద అందుబాటులో ఉన్నందున వేగంగా చేయగలుగుతున్నాం. తొలివిడత సర్వే పూర్తైన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జనవరి నాటికి పూర్తి కావాలి’ అని సీఎం సూచించారు.
మరో 2 వేల గ్రామాల్లో..
సర్వే పూర్తైన రెండు వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యుటేషన్లు, 92 వేల ఫస్ట్ టైం ఎంట్రీస్ జరిగాయని, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని అధికారులు తెలిపారు. 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి కాగా 19 వేల భూ వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేర డబ్బు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను అధికారులు సీఎంకు తెలియచేశారు. 2023 ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేసి అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని చెప్పారు.
గ్రామ సచివాలయం యూనిట్‌గా..
సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు. గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో తగినంత సిబ్బందిని సమకూర్చుకుని ఖాళీలున్న చోట వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు.
సమస్యలు పరిష్కారమైన లబ్ధిదారులకు వ్యక్తిగత లేఖలు..
‘ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ‘22 ఏ’ భూములు, ఇతర సమస్యలను పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలి. వారికి జరిగిన మేలును వివరిస్తూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత లేఖలు పంపాలి. సర్వే రాళ్ల ఉత్పత్తి వేగాన్ని పెంచాలి. రాళ్ల తయారీ వేగం పెరిగేలా భూగర్భ గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండరాదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయగా మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పట్టణ ప్రాంతాల్లో సర్వేపై..
అర్బన్ ప్రాంతాల్లోనూ భూముల సర్వేను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4,119 వార్డు సచివాలయాల్లో సర్వే బృందాల ఏర్పాటు, శిక్షణ ఇప్పటికే పూర్తైందని అధికారులు తెలిపారు. హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు.
ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్ పార్సిల్స్‌కు సంబంధించి 3,37,702 ఎకరాలను గుర్తించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. 2023 జూలై నాటికి పట్టణ ప్రాంతాల్లో సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment