Andhra Pradesh: భూమికి భరోసా | CM Jagan says comprehensive land re-survey was biggest reform program | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: భూమికి భరోసా

Published Wed, Jan 19 2022 3:14 AM | Last Updated on Wed, Jan 19 2022 3:34 AM

CM Jagan says comprehensive land re-survey was biggest reform program - Sakshi

లబ్ధిదారుడికి భూ యాజమాన్య హక్కు పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ప్రతి గ్రామంలోనూ భూముల సమగ్ర సర్వే చేపట్టి భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా పరిష్కరిస్తాం. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో మాత్రమే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అనేది కాకుండా.. ఏకంగా మీ గ్రామంలోనే, మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఆస్తుల లావాదేవీలు కళ్లెదుటే మీకు కనిపించే విధంగా రిజిస్టర్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ఎవరో, ఎక్కడో మీకు తెలియకుండా మీ ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకునే పరిస్థితులకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాం. ఇదొక పెద్ద సంస్కరణ.  – సీఎం వైఎస్‌ జగన్‌

కష్టార్జితం వివాదాల్లో చిక్కుకుంటే..
రూపాయి రూపాయి దాచుకుని.. రాత్రనకా పగలనకా కష్టపడి కొనుక్కున్న ఒక ప్లాటో, ఇల్లో భూ వివాదాల్లోకి వెళ్లిపోతే ఎంత బాధగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ పరిస్థితులను నివారించి ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే తపనతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాలకు విస్తరిస్తాం.    
 – ముఖ్యమంత్రి జగన్‌ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే అతిపెద్ద సంస్కరణ కార్యక్రమమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 37 గ్రామాల్లో తొలిదశగా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని చెప్పారు. సర్వే పూర్తి అయ్యాక దశలవారీగా అన్ని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించారు. సమగ్ర భూముల సర్వే కింద మొదటి దశలో 51 గ్రామాలలో రీ సర్వే, అభ్యంతరాల పరిష్కారం, భూ రికార్డులు ప్రజలకు అంకితం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ..

స్వతంత్ర భారతంలో తొలిసారిగా..
దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన తొలిదశ సమగ్ర భూసర్వేని 51 గ్రామాలలో పూర్తి చేశాం. 37 గ్రామ సచివాలయాల్లో ఇవాళ్టి నుంచే భూములు, స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియచేసేలా ఈ రోజు మొట్టమొదటి అడుగు వేస్తున్నాం.  

వందే?ళ్ల తర్వాత సమగ్ర సర్వే..
దేశంలో సుమారు 100 ఏళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సమగ్ర సర్వే జరిగింది. 1983 వరకు జమాబందీ విధానంలోనే భూములకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించారు. ఆ తర్వాత కరణాల వ్యవస్ధ రద్దు కావడం, సరైన ప్రత్యామ్నాయం లేక జమాబందీ కార్యక్రమాలు ఆగిపోయాయి. మన భూమిని మన కళ్లెదుటే ఇతరుల పేరిట రాసుకుంటున్నారు. ట్యాంపరింగ్‌ జరుగుతోందని తెలుస్తున్నా అడ్డుకోలేని నిస్సహాయ స్థితి నెలకొంది. నా పాదయాత్ర సమయంలో 13 జిల్లాలోనూ ప్రజలు ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య వ్యత్యాసాలు సివిల్‌ వివాదాలకు దారి తీస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ జరిగిన భూమి విస్తీర్ణాన్ని కొలత వేస్తే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటోంది, మరికొన్నిసార్లు తక్కువగా చూపిస్తోంది.
శాశ్వత భూహక్కు–భూరక్ష రిజిస్టేషన్లను ప్రారంభించి అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సబ్‌ డివిజన్‌ కావట్లేదు..
భూ వివాదాలాన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఓ సర్వే నంబర్‌లో అమ్మకాలు జరిగిపోతాయి కానీ సబ్‌ డివిజన్‌ మాత్రం ఉండదు. పట్టాదారు పాస్‌ పుస్తకాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. నిర్దిష్ట హద్దులు, శాశ్వత హక్కులు లేకపోవడం వల్ల రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారు అయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

సింహభాగం సివిల్‌ వివాదాలే..
సివిల్‌ వివాదాల్లో దాదాపు 80 – 90 శాతం కేసులు భూమి తగాదాలకు సంబంధించినవే కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సరైన వ్యవస్థ లేకపోవడం, ట్యాంపరింగ్, ఇతరత్రా లోపాల వల్ల కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద చేజారిపోయే పరిస్థితి రావడం ఎవరికైనా బాధాకరమే.

ప్రతి కమతానికి ఐడెంటిఫికేషన్‌ నంబర్‌
సివిల్‌ వివాదాలకు ముగింపు పలికేలా భూములన్నీ కొలత వేసి అక్షాంశాలు, రేఖాంశాలు (లాటిట్యూడ్‌ అండ్‌ లాంగిట్యూడ్‌) ఆధారంగా మార్కింగ్‌ చేయడమే కాకుండా ప్రతి కమతానికి నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ కేటాయిస్తున్నాం. ప్రతి కమతాన్ని డిజిటల్‌గా నిర్ణయించి క్యూఆర్‌ కోడ్‌తో ల్యాండ్‌ మ్యాప్‌ ఇస్తున్నాం. సరిహద్దు రాళ్లు పాతి మరీ ఇస్తున్నాం. దీనివల్ల భూ వివాదాలు ఉండవు. ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుంది. డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లు, లంచాలకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇది సాకారం కావాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు –భూరక్ష పథకాన్ని దాదాపు 13 నెలల క్రితం ప్రారంభించాం.

2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్కరి భూమిని 2023 కల్లా ఆధునిక పద్ధతుల్లో సమగ్రంగా రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రీసర్వే చేయడమే కాకుండా యూనిక్‌ ఐడీ క్రియేట్‌ చేయడం, డేటా మొత్తం సబ్‌డివిజన్లతో పూర్తిగా అప్‌డేట్‌ చేస్తున్నాం. ఆ తర్వాత పక్కాగా పట్టా డాక్యుమెంట్స్‌ భూ యజమానుల చేతుల్లో పెడతాం. 

రూ.1,000 కోట్ల వ్యయంతో
2020 డిసెంబరు 21న భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టాం. కార్స్, డ్రోన్స్‌ టెక్నాలజీ లాంటి 50 అంశాలపై 10,158 మందికి సర్వే కోసం శిక్షణ ఇచ్చాం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4,500 సర్వే బృందాలను నియమించాం. 2 వేల రోవర్లు, 75 కార్స్‌ బేస్‌ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాం.

తొలిదశలో...
సమగ్ర సర్వే తొలిదశ 51 గ్రామాలలో 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలకు సంబంధించి 29,563 ఎకరాల రీసర్వే పూర్తైంది. 3,304 అభ్యంతరాలు, సివిల్‌ వివాదాలను పరిష్కరించాం. హద్దులు మార్పు చేసి మ్యాపులు, యూనిక్‌ ఐడీ క్రియేట్‌ చేయడం, క్యూఆర్‌ కోడ్‌లో భద్రపరచడంతో పాటు భూముల రికార్డులన్నీ పర్మినెంట్‌ టైటిల్స్‌తో భూ యజమానుల చేతుల్లో పెడుతున్నాం.  

అందరి సమక్షంలో..
భూముల సమగ్ర సర్వే వల్ల నకిలీ పత్రాలకు తావుండదు. భూ యజమానికి తెలియకుండా రికార్డులను మార్చే అవకాశం ఉండదు. ఆస్తులు అమ్ముకున్నా సబ్‌డివిజన్‌ చేసిన తర్వాతే ఆ లావాదేవీల ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. ఇతరుల ఆస్తిని కాజేసేందుకు ఆస్కారం ఉండదు. సర్వే చేసేటప్పుడు ప్రతి అడుగులోనూ భూయజమానులను భాగస్వాములుగా చేస్తున్నాం. వారి సమక్షంలోనే మంచి చేస్తున్నాం. అభ్యంతరాలను మండల స్ధాయిలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాల ద్వారా అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం.  
 
గ్రామ కంఠాలకు కూడా..
తొలిసారిగా గ్రామకంఠాల్లోని ఇళ్లు, స్ధిరాస్తులను కూడా సర్వే చేసి యాజమాన్య ధృవీకరణ పత్రాలు అందచేస్తున్నాం. అవసరమైతే అమ్ముకునే స్వేచ్ఛ కూడా అన్ని రకాలుగా కల్పిస్తున్నాం. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్‌ లైన్‌ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్‌డివిజన్‌ దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించాం. సబ్‌డివిజన్‌ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేయాలని ఇదే వేదిక నుంచి అధికారులను ఆదేశిస్తున్నాం.

సింగిల్‌ విండో విధానంలో...
సింగిల్‌ విండో విధానంలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. మనం ఏర్పాటు చేస్తున్న ఈ  వ్యవస్ధ ద్వారా ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా భూ సమాచారాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.లక్ష్మి,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ(సర్వే, సెటిల్‌మెంట్స్‌) కమిషనర్‌ సిద్ధార్ధ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ డైరక్టర్‌ ఎంఎం నాయక్, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ఐజీ వి.రామకృష్ణ, ఏపీఎండీసీ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement