CM YS Jagan Comments On Lands Resurvey In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యలకు చెక్‌

Published Thu, Nov 24 2022 3:19 AM | Last Updated on Thu, Nov 24 2022 1:35 PM

CM YS Jagan Comments On Lands re survey In Andhra Pradesh - Sakshi

భూ రికార్డులు సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూస్తున్నాం. 80–90 శాతం సివిల్‌ కేసులన్నీ కేవలం భూ వివాదాలవే.  మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మన పిల్లలకు ఇవ్వాలనుకుంటాం. తీరా మన పిల్లలకు ఇచ్చే సమయానికి గద్దల్లా వేరెవరో తస్కరిస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చేందుకే సమగ్ర భూ సర్వే దిశగా వేగంగా అడుగులు వేశాం. తద్వారా ఎలాంటి సివిల్‌ వివాదాలకు, లంచాలకు, కబ్జాలకు తావు లేకుండా చేస్తాం. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతుల భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలుపెరగకుండా, ఖర్చుకు వెనకాడకుండా, అత్యంత సాంకేతికంగా, శాస్త్రీయ పద్ధతిలో భూముల రీసర్వే చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూముల రీ సర్వేను 2023 డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని, సర్వే పూర్తయితే తమ భూముల విషయంలో రైతులు ధైర్యంగా ఉండవచ్చని, అక్రమాలకు అవకాశమే ఉండదని స్పష్టం చేశారు.

సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పని చేస్తుందని, గత మూడున్నరేళ్ల కాలంలో విప్లవాత్మక మార్పులు ఎన్నో తీసుకొచ్చామని చెప్పారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపట్టారు. అక్కడే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం భూముల సమగ్ర రీ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైందన్నారు. రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే.. అందులో తొలి దశలో 2 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయడమే కాకుండా 7,92,238 మంది రైతుల భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి, భూ హక్కు పత్రాలను అందజేసే భారీ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరో 15 రోజుల్లో మొదటి దశలోని 2 వేల గ్రామాల రైతులందరికీ భూ హక్కు పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
నరసన్నపేట బహిరంగ సభకు హాజరైన జనసందోహంలోని ఓ భాగం 

దశల వారీగా భూ హక్కు పత్రాలు
► 2023 ఫిబ్రవరి నాటికి రెండో దశ పూర్తి చేస్తాం. అంటే మరో నాలుగు నెలల్లో ఇంకో నాలుగు వేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ వాళ్ల భూ హక్కు పత్రాలు వాళ్ల చేతుల్లో పెడతాం. ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో మూడో దశలో ఆరు వేల గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే పూర్తి చేసి, భూ యజమానులకు 2023 మే నాటికి భూ హక్కు పత్రాలు అందజేస్తాం. 

► 2023 ఆగస్టు నాటికి మరో 9 వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి సర్వే పూర్తి చేస్తాం. ఐదో దశలో మిగతా గ్రామాలు, పట్టణాలతో కలిపి మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లో, పట్టణాల్లో భూములన్నింటినీ సమగ్ర సర్వే చేసి, రికార్డులను ప్రక్షాళన చేసి.. 2023 డిసెంబర్‌ నాటికి భూ హక్కు పత్రాలను అందజేస్తాం.

ప్రతి కమతానికి యూనిక్‌ నంబర్‌
► ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నింటినీ పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడుందో.. లాటిట్యూడ్‌ అండ్‌ లాంగిట్యూడ్‌ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్‌ చేయడమే కాకుండా ప్రతి ఒక కమతానికి ఒక నిర్దిష్టమైన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ను ఈ సర్వే ద్వారా ఇస్తారు. ప్రతి కమతానికి డిజిటల్‌గా, ఫిజికల్‌గా దాన్ని నిర్ణయించి, క్యూ ఆర్‌ కోడ్‌తో ల్యాండ్‌ మ్యాపింగ్‌ చేస్తాం. 

► ఆ భూమికి సరిహద్దు రాళ్లు కూడా పెడుతున్నాం. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వ పరంగా సర్వ హక్కులతో కూడిన భూ హక్కు పత్రాలను ప్రక్షాళన చేసి వారి చేతికి ఇవ్వబోతున్నాం. దీంతో తమ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం పూర్తిగా తొలగిపోతుంది. డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు అవకాశం లేకుండా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఇదంతా మహా యజ్ఞంలా సాగుతోంది.
► భూ కమతం ఒక సర్వే నంబర్‌ కింద ఉండి, కాలక్రమంలో విభజన జరిగినా.. మారినా కూడా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలన్నింటికి పూర్తిగా చెక్‌ పెట్టినట్లు అవుతుంది. 

జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా..
► జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా సర్వే చేయిస్తున్నాం. 10,185 మంది గ్రామ సర్వేయర్లు (గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి 13,849 మంది), 3,664 వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు, రూ.1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, 80 డ్రోన్లు, 2 వేల గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్స్‌ అంటే జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లను వినియోగిస్తున్నాం. వీటితో పాటు ప్రత్యేకంగా 75 కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌ బేస్‌లు అంటే కోర్స్‌ బేస్‌లు ఏర్పాటు చేశాం.

► రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులు, 2.47 కోట్ల సర్వే నంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే జరుగుతుంది. మరో 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కూడా సర్వే జరుగుతుంది.

► సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించిన సబ్‌ డివిజన్లు, మ్యుటేషన్లు, ఇతర సమస్యల పరిష్కారం, యాజమాన్య పత్రాల జారీ వంటి కార్యక్రమాలన్నీ గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగని విధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా మార్పులు తీసుకొస్తున్నాం.

► ఇక మీదట సరిహద్దులు మార్కింగ్‌ చేసి, ఫీల్డ్‌ లైన్‌ దరఖాస్తులన్నీ 15 రోజుల టైమ్‌ ఇచ్చి కచ్చితంగా పూర్తి చేయాలి. పట్టా సబ్‌డివిజన్, మ్యుటేషన్‌ దరఖాస్తులన్నీ 30 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఎల్‌ఓపీలు తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరూ లంచాలడిగే పరిస్థితి ఉండదు. మ్యుటేషన్‌ సేవలను ఉచితంగా అందిస్తాం. 

ఇప్పటిదాకా సర్వే జరిగిందిలా..
► 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో 17వేలకు పై చిలుకు రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో 47,276 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే డ్రోన్‌ ఫ్లయింగ్‌ పూర్తయ్యింది. ఈ రోజు (బుధవారం) వరకు 2 వేల గ్రామాల్లో సమగ్ర రీసర్వేతో పాటు భూ పట్టాల ప్రక్షాళన, మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మేరకు రైతులకు 7,92,238 భూ హక్కు పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు ఈ 2 వేల గ్రామాల్లో వీటి పంపిణీ జరుగుతుంది.

► రీ సర్వే వల్ల ఈ 9 నెలల్లోనే 4 వేల గ్రామాల్లో 4.3 లక్షల సబ్‌ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. గతంలో సంవత్సరానికి 35 వేల సబ్‌ డివిజన్ల దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. కేవలం 21 వేలు మాత్రమే సబ్‌ డివిజన్‌ జరిగేవి. ఈ లెక్కన ఏటా 21 వేలు మాత్రమే సబ్‌ డివిజన్‌లు జరిగే పరిస్థితి నుంచి.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం 9 నెలల్లోనే 4.3 లక్షల సబ్‌ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లు పూర్తి చేసుకున్న మెరుగైన స్థితికి వచ్చాం. ఈ ప్రక్రియలో రూ.30 కోట్ల విలువైన సేవలను వారి చేతిలో ఉచితంగా పెట్టినట్టు అవుతోంది. ఈ మార్పులను ప్రజలు ఒక్కసారి గమనించాలి. 

మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు
► అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ చొప్పున 2 లక్షల 60 వేల మందిని నియమించాం. వలంటీర్లు ప్రతి ఒక్కరినీ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు.

► 13 నుంచి 26 జిల్లాలు చేశాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో రాజధాని ఉండటం వల్ల జరిగే మంచికన్నా.. మూడు ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తున్నాం.  

► రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా మరో 17 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. 

► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, పాఠశాలల్లో, హాస్టళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ లైబ్రరీలు, మహిళలకు భద్రత కల్పించేలా ‘దిశ’ యాప్, దిశ పోలీస్‌స్టేషన్లు ఇలా ఎన్నో అమలు చేస్తున్నాం.

► ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రజలు మన కళ్లెదుటే కన్పించేవారు. పాలకులు, వారితో పాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టరూ వచ్చేవారు. ఐదేళ్లు పరిపాలన చేశారు. అయినా ఇచ్ఛాపురం, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు వారికి గుర్తుకు రాలేదు. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంతాల్లో రూ.765 కోట్లతో సర్ఫేస్‌ వాటర్‌ తీసుకొచ్చి, కిడ్నీ సమస్యలకు పూర్తి పరిష్కారం చూపించేలా అడుగులు వేశాడు. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.50 కోట్లతో రీసెర్చ్‌ ఆస్పత్రిని కడుతున్నాం. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కిడ్నీ పేషెంట్లకు రూ.10 వేల వరకు పింఛన్‌ ఇస్తున్నాం.  

► ఇంతకుముందు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కేవలం 295 మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుగా మార్చే ప్రక్రియకు మన ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ శాఖ పరంగా గ్రేడ్‌–3 విలేజ్‌ సర్వేయర్లను గ్రేడ్‌–2గా రీ డిజిగ్నేట్‌ చేయనున్నాం.

► ఈ కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తదితరులు పాల్గొన్నారు.  

వైఎస్‌ కుటుంబంతోనే సిక్కోలు ప్రగతి 
శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసింది వైఎస్‌ కుటుంబమే. అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. వందేళ్ల నుంచి ఉన్న భూ సంబంధిత సమస్యలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత 23 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కటి కూడా శ్రీకాకుళంలో పెట్టలేదు. సీఎం జగన్‌ వంశధార రిజర్వాయర్‌కు రూ.700 కోట్ల నిధులిచ్చి, ఉద్దానం ప్రాంతంలో తాగునీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రోగులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్‌ జగన్‌.. ఒడిశా వెళ్లి అక్కడి సీఎంను కలిశారు. గత 15 ఏళ్లలో ఈ పని ఎవరూ చేయలేదు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు విశాఖ పాలన రాజధాని కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఇక్కడకు వచ్చి అదే మాట చెబితే ప్రజలే తగిన సమాధానమిస్తారు.  
– ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి  

ఆనందంగా ఉంది 
మా గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయ్యింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ హక్కు పత్రాలు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎప్పుడూ మేం ఇలాంటివి చూడలేదు. ఈ సర్వేతో భూ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి.  
– రౌతు పోలయ్య, సంతలక్ష్మీపురం, పోలాకి మండలం 

నా చేతికి హక్కు పత్రం  
నాకు కరగాం పంచాయతీలో 40 సెంట్ల భూమి ఉంది. నోషనల్‌ ఖాతాలో ఉండిపోవడంతో ఇన్నాళ్లూ పాస్‌ బుక్‌ రాలేదు. ఎలాంటి హక్కులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు గ్రామంలో రీ సర్వే పూర్తయింది. నోషనల్‌ ఖాతాల్లో ఉన్న భూమిని నా పేరున మార్చి భూ హక్కు పత్రం ఇచ్చారు. ఇది ఈ రోజు సీఎం చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది. 
– పాగోటి దమయంతి, కంబకాయ, నరసన్నపేట మండలం 

వేగంగా రిజిస్ట్రేషన్‌ 
నా ఇంటి స్థలాన్ని కరగాం సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించాను. ఇతరుల వద్ద కొనుగోలు చేసిన ఈ స్థలం రిజిస్ట్రేషన్‌ నరసన్నపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చేయించేందుకు ప్రయత్నించాను. అయితే గ్రామ సచివాలయంలో కూడా చేస్తారని తెలియడంతో అక్కడికే వెళ్లి చేయించుకున్నాను. వివరాలన్నీ తెలుసుకుని శ్రమ లేకుండా, అదనపు ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ పత్రాలు సీఎం చేతుల మీదుగా ఈ రోజు తీసుకున్నాను. ఆనందంగా ఉంది. 
– వెలమల శ్రీదేవి, నారాయణవలస, నరసన్నపేట మండలం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement