కృష్ణా: మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గత గురువారం సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులు ఐదుగురిని కూచిపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు వారు హత్యకు వినియోగించిన ఆయుధాలతో సహా 72 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ సందర్భంగా మొవ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...
బోయపాటి ధనలక్ష్మి తన సొంత బాబాయి కొడుకులు గణేష్, లోకేష్, భువనేష్, పిన్ని స్వర్ణ పంచాయతీ ఆఫీస్ వద్ద తన తండ్రిని, గ్రామంలోని కృష్ణ వీధి మొదట్లో తన తల్లిని నరికి చంపారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణాజిల్లా ఎస్పీ పి.జాషువా ఆదేశాల మేరకు గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకట నారాయణ ఆదేశాల మేరకు కూచిపూడి ఎస్‌ఐ డి.సందీప్, సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆదివారం నిందితులను పమిడిముక్కల మండలం వీరమాచినేనిపాలెంలో అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు కారణాలు
మృతులకు(వీరంకి వీర కృష్ణ, వరలక్ష్మి), నిందితులకు మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో 3 ఎకరాల భూమి గురించి గత కొన్నేళ్లుగా వివాదాలు ఉన్నాయి. వీరంకి కృష్ణ 1.50 ఎకరాలు, నిందితులు 1.50 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మృతుడికి చెందిన 1.50 ఎకరాలను కూడా నిందితులు ఆక్రమించాలని ప్రయత్నిస్తూ మూడుసార్లు పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేయగా, మూడుసార్లు రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తిరిగా తాజాగా నాలుగోసారి దరఖాస్తు చేశారు. తహసీల్దార్ సదరు పొలం పొజిషన్లో ఎవరు ఉన్నారని విచారణ చేయాలని ఆర్‌ఐ, వీఆర్‌వోలను ఆదేశించగా, ఈనెల 21న ఇరు వర్గాలను అయ్యంకి పంచాయతీ కార్యాలయానికి రావాలని పిలిపించారు.
ఈ నేపథ్యంలో వీరంకి వీర కృష్ణ బతికి ఉండగా తమకు పాస్ పుస్తకాలు రానివ్వరని, అయ్యంకి గ్రామానికి కూడా వెళ్లలేమనే ఉద్దేశంతో నిందితులు పథకం ప్రకారం వీర కృష్ణతో గొడవ పెట్టుకుని తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో సుమారు ఒంటి గంట సమయంలో పంచాయతీ కార్యాలయం వద్ద కత్తులతో నరికి చంపారు. అనంతరం వీరంకి కృష్ణ భార్య వరలక్ష్మిని కూడా గ్రామంలో కృష్ణ వీధి మొదట్లో నరికి చంపారు.
ఈ కేసులో ఏ1గా వీరంకి గణేష్(23), ఏ2గా వీరంకి నాగ లోకేష్(22), ఏ3గా వీరంకి భువనేశ్వర్(20), ఏ4గా వీరంకి స్వర్ణ(42), ఏ5గా భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామానికి చెందిన సమీప బంధువు శొంఠి జానేష్ కుమార్(22)లపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో డీఎస్పీతో పాటు పామర్రు సీఐ ఎన్.వెంకట నారాయణ, కూచిపూడి ఎస్‌ఐ డి.సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment