
ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపి, వారి అంగీకారంతో గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు (మోడల్ ప్రైమరీ స్కూల్స్) ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యా శాఖ అధికారులు, ఆర్డీవోలతో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించి పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం మేరకు అనువైన చోట ఆదర్శ ప్రాథమిక పాఠశాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి మండలానికి కనీసం 3, 4 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
తల్లిదండ్రులకు వివరించండి..
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి చదువుకుంటున్న విద్యార్థుల ఇంటింటికి వెళ్లి వారి తల్లిదండ్రులతో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రాముఖ్యతను వివరించాలని కలెక్టర్ చెప్పారు. 1, 2 తరగతులు ఎలాంటి మార్పు జరగకుండా అదే ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతాయని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే విద్యార్థులు చక్కగా చదువుకుంటారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి మంచి జరిగేలా చొరవ చూపాలన్నారు. ఇదో మంచి తరుణయని, ఈరోజు మనం తీసుకునే నిర్ణయంపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. సమావేశంలో డీఆర్వో కె. చంద్రశేఖరరావు, డీఈవో పి.వి.సి.రామారావు, మచిలీపట్నం, ఉయ్యూరు ఆర్డీవోలు స్వాతి, బి.ఎస్.హేలాషారోన్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్‌బాబు, మెప్మా పీడీ సాయిబాబు, ఉప విద్యాధికారులు, పలువురు మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ