కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో సంచలనం కలిగించిన డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో నేరస్తులను పట్టుకునేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకోసం జిల్లాలోని సమర్థులైన పలువురు సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆమెను హత్య చేయటం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? అంత పెద్ద పేరు గల ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవటానికి గల కారణాలు? నిజంగానే గుర్తు తెలియని దుండగులా? లేక సమీప బంధువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణాల్లో పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
పాత నేరస్తులపై నిఘా..
జిల్లాలో జరిగిన పలు హత్య కేసుల్లో హంతకులుగా ఉన్న పలువురు పాత నేరస్తులపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఆస్పత్రికి సంబంధించిన సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. అయితే జరిగిన హత్యకు సమీప బంధువులకు సంబంధం ఉండి ఉంటుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, చాలా వరకు హత్యకేసుకు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు సమాచారం.
అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు..
డాక్టర్ మాచర్ల రాధా (59) హత్యకేసులో పోలీసులను అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రోగులతో నిత్యం రద్దీగా ఉంటే ఆస్పత్రి ఆవరణలో మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయటం పోలీసులకు ప్రధాన అనుమానంగా మారింది. అలాగే రద్దీగా ఉంటే ఆస్పత్రి ముందు నుంచే నేరస్తులు మూడో ఫ్లోర్‌లో ఉన్న రాధా ఇంటిలోకి వెళ్లాలి. అలా కాని పక్షంలో సమీప బంధువులు మాత్రమే వేరే మార్గం గుండా పై ఫ్లోర్‌లోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ మార్గం గుండా హంతకులు ఏ విధంగా పై ఫ్లోర్‌లోకి వెళ్లి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
మృతురాలి భర్త డాక్టర్ ఉమామహేశ్వరరావు సాయంత్రం 6.00 గంటలకు క్లినిక్‌లోకి వెళ్లగా రాత్రి 8.15 సమయంలో మృతురాలు రాధా హైదరాబాద్‌లోని తన కూతరుతో ఆఖరిగా సారిగా ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో డాక్టర్ రాధా హత్య 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తుల ఆచూకీ కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.అలాగే గురువారం డాగ్‌స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment