
కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గురువారం ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం చెందింది. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా రేపల్లె పద్మసాలివారి వీధికి చెందిన చిలుమూరు శిరీష(38), శ్రీనివాసకిరణ్ భార్యాభర్తలు. శిరీష పుట్టినిల్లు తాడిగడప. గురువారం ద్విచక్రవాహనంపై వారు తాడిగడప వస్తుండగా పెదపులి పాకలోని చెరువు వద్ద ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసకిరణ్, శిరీష ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. శిరీష తలపై బస్సు చక్రాలు ఎక్కాయి. దీంతో ఆమె తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసకిరణ్ అవనిగడ్డలో విద్యుత్ శాఖలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.