
జగ్గయ్యపేట మండలంలో వివాహిత దారుణ హత్య
రోకలి బండతో తలపై మోది చంపిన ప్రియుడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.
ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు.
ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.