కోనేరుసెంటర్(మచిలీపట్నం): డాక్టర్ రాధ హత్యకేసులో అయిన వాళ్లే హంతకులా..? పథకం ప్రకారమే ఆమెను హత్య చేశారా..? ఆరు పదుల వయసు ఉన్న ఆమెను అంత క్రూరంగా కొట్టి చంపింది అతి దగ్గరి వారేనా..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఆమెది పథకం ప్రకారం జరిగిన హత్యేనని రుజువు చేస్తున్నాయని సమాచారం. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో హంతకులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టేందుకుందుకు శ్రమిస్తున్నారు.
సంచలనం రేపిన హత్య
మచిలీపట్నంలో గత నెల 25వ తేదీన జరిగిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య సంచలనం రేపింది. ఆ రోజు రాత్రి 8.15 గంటల సమయంలో హైదరాబాద్‌లోని కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడిన రాధ 10.15 గంటల సమయంలో దారుణ హత్యకు గురైంది. భర్త డాక్టర్ మాచర్ల మహేశ్వరరావు కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌లో రోగులను పరీక్షిస్తుండగానే ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రతిభ కలిగిన సీఐ స్థాయి అధికారులను ఎస్పీ జాషువా రంగంలోకి దింపి దర్యాప్తును ముమ్మరం చేయించారు. హత్య జరిగిన రోజు మృతురాలి చేతిలో ఉన్న వెంట్రుకలను హంతకుల ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
చిక్కిన కీలక ఆధారాలు!
రాధ హత్య కేసులో పోలీసులకు పలు కీలక ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది. ఆ ఆధారాలతో రాధ కుటుంబా నికి అత్యంత సన్నిహితుడిగా ఉండే వ్యక్తితో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని అనుమానితులుగా గుర్తించారు. విచారణ నిమిత్తం వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. రాధను హత్య చేసేందుకు పూనుకున్న వ్యక్తికి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి ఎందుకు సహకరించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.
రాధను పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో దాదాపు తేలిందని సమాచారం. పైపులపే బిగించే భారీ రెంచీతో ఆమె తలపై బలంగా కొట్టి అత్యంత క్రూరంగా హతమార్చినట్లు పోలీసులు తెలుసుకున్నారని సమాచారం. అయితే ఆమె హత్య ఎందుకు జరిగిందనేది ఇంకా వెల్లడికాలేదని తెలుస్తోంది. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులూ తమపై పోలీ సులకు అనుమానం రాకుండా ఉండేందుకు సినిమా ఫక్కీలో డాక్టర్ రాధ వంటిపై ఉన్న బంగారు వస్తువులను తొలగించి సీలింగ్‌లో దాచిపెట్టారని దర్యాప్తులో తేలింది. హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment