సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్‌టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్‌టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.
తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎల్‌టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్‌కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది.
గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్‌టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్‌టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది.
గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్
రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్‌టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్‌వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఎల్‌టీఆర్ ఆర్డర్ అమలు ఇలా
♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్‌టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు.
♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి.
♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు.
♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment