సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: చెరుకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ చక్కెర కర్మాగారాల యాజమాన్యాలకు సూచించారు. చెరుకు మద్దతు ధర నిర్ణయించేందుకు కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లాలోని చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. చక్కెర ధర తక్కువగా ఉండడం వల్ల ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న ఆయా కంపెనీల ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. గత ఏడాది నిర్ణయించినట్లుగానే ఈ సారి కూడా క్వింటాలు చెరుకుకు రూ. 2,600 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
దీంతో ఆగ్రహించిన రైతు సంఘాల నాయకులు కంపెనీలకు ఏ రోజు కూడా నష్టం రాలేదన్నారు. చెరకు క్రషింగ్ తర్వాత చక్కెర ధర పెరిగినప్పటికీ ఏ కంపెనీ యాజమమాన్యం కూడా రైతులకు అదనంగా ధర ఇవ్వలేదన్నారు. అలాంటప్పు డు ఇపుడు చక్కెర ధర తక్కువగా ఉందని చెరకుపంటకు తక్కువ ధర ఇవ్వడం సమంజ సంగా లేదన్నారు. ఇరు వర్గాల ప్రతిపాదనలు విన్న కలెక్టర్ స్పందిస్తూ, ఈ ఏడాది రైతులకు కూలీ, రవాణా, ముడిసరుకుల ధర అధికంగా పెరిగాయని వాటిని దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయించాలన్నారు. కనీస మద్దతు ధరగా రూ.2,720 పెంచుతూ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీ ప్రతినిధులు వారి యాజమాన్యాలతో చర్చించి సోమవారమ ఉదయం వరకు సంబంధిత నివేదికను అందజేయాలన్నారు. లేని పక్షంలో కమిటీ వేసి ధరను తామే నిర్ణయించాల్సి వస్తుందన్నారు. ఆ కమిటీ నిర్ణయించిన ధరను ఫ్యాక్టరీ యాజమాన్యాలు, రైతులు స్వాగతించాల న్నారు. సమావేశంలో జేసీ శరత్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట రవి, మాగి సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్విరాజ్, రైతు సంఘం నాయకులు నర్సింహరామ శర్మ, రవీందర్, జయరాజ్, యాదిగిరిరెడ్డిలతో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు ప్రయోజనాల మేరకే ‘మద్దతు’ నిర్ణయించాలి
Published Sun, Nov 24 2013 7:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement