చెరకు రైతు.. బతుకు బరువు
సాక్షి, సంగారెడ్డి: చెరకు రైతుకు మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా క్రషింగ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులు మద్దతు ధర కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మూడు చెరకు ఫ్యాక్టరీలు పది రోజుల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మద్దతు ధరపై మరోమారు మెతుకుసీమ చెరకు రైతులు పోరుబాటకు సిద్ధపడుతున్నారు.
కరెంటు కోతలు, వర్షాభావం పరిస్థితులను అధిగమించి పంట సాగు చేసిన తమకు టన్నుకు రూ.3,500 చెల్లించాల్సిందిగా రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలోని గణపతి షుగర్స్, ట్రైడెంట్ షుగర్స్, నిజాం దక్కన్ షుగర్స్ పరిశ్రమలు మాత్రం రైతులు అడిగినంతగా ధర చెల్లించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సంగారెడ్డి మండలం ఫసల్‌వాది సమీపంలోని గణపతి షుగర్స్ యాజమాన్యంతో మద్దతు ధరపై చెరకు రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
మిగతా రెండు పరిశ్రమల పరిధిలోని రైతులు సైతం రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. మద్దతు ధర ఖరారు కానప్పటికీ గణపతి షుగర్స్ ఈనెల 13న, ట్రైడెంట్ షుగర్స్ ఈనెల మూడోవారంలో, నిజాం దక్కన్ షుగర్స్ వచ్చేనెల క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు, రైతు సంఘాలు, చెరకు రైతులతో సోమ లేదా మంగళవారాల్లో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
మద్దతు ధరపైనే ఆశలు
జిల్లాలో సుమారు 22 వేల మంది చెరకు రైతులు 18 వేల హెక్టార్లలో చెరకు పంటలను సాగు చేశారు. ఫసల్‌వాదిలోని గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 7,200 హెక్టార్లు, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 9, 000 హెక్టార్లు, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 2,280 హెక్టార్లలో రైతులు చెరకుపంట వేశారు. జహీరాబాద్, న్యాల్‌కల్, పుల్కల్, పాపన్నపేట, ఝరాసంగం, అందోలు ప్రాంతాల్లో చెరకు సాగు అధికంగా ఉంది.
అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా చెరకు సాగు వ్యయం పెరిగింది. దీనికితోడు ఖరీఫ్‌లో వర్షాభావం, కరెంటు కోతల కారణంగా చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు ఈసారి లద్దెపురుగు పంటను దెబ్బతీసింది. ఈ కారణాలతో చెరకు దిగుబడి ఈ దఫా 20 శాతానికిపైగా తగ్గనున్నట్లు అంచనా. ఇదిలావుంటే చెరకు కోతల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చెరకు రైతులు టన్ను రూ.3,500 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు.
చక్కెర ధర తగ్గడం వల్లే?
టన్నుకు చెరకు రూ.3,500 ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మాత్రం రూ.2,600 నుంచి రూ.2,800 వరకు చెల్లిస్తామంటున్నాయి. మార్కెట్‌లో చక్కెర ధర ఆశించిన స్థాయిలో లేకపోవటం, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ చక్కెరపై ఐదు శాతం వ్యాట్ విధించటం, రాష్ట్ర విభజన నేపథ్యంలో మొలాసిస్ సరఫరాపై టన్నుకు రూ.2,500 పన్ను విధించటం తదితర కారణాలతో మద్దతు ధర చెల్లింపు విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే చర్చల్లో సమస్యలను విన్నవించి తమకు, రైతులకు నష్టం వాటిల్లకుండా మద్దతు ధర నిర్ణయించాలని పరిశ్రమల యాజమాన్యాలు భావిస్తున్నట్లు సమాచారం.