Crushing season
-
తెరిపించాలి
♦ నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలి ♦ వేతన బకాయిలు చెల్లించాలి ♦ లేకపోతే ఉద్యమం ఉధృతం ♦ కార్మిక కుటుంబాల ఆందోళన బాట ♦ నేడు రోడ్డు దిగ్బంధం ఎన్డీఎస్ఎల్ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చాలన్న ప్రధాన డిమాండ్లతో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. తొమ్మిది నెలల క్రితం తెలంగాణ ప్రజాఫ్రంట్, తొమ్మిది వామపక్ష పార్టీలు కలిసి నిజాంషుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, టీడీపీలు మద్దతు పలికాయి. ఫ్యాక్టరీ రక్షణ కోసం కొన్ని నెలల నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అఖిల పక్షం అధ్వర్యంలో శనివారం బోధన్ మండలం సాలూర వద్ద అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేయనున్నారు. బోధన్ : 2015-16 క్రషింగ్ సీజన్‌ను నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభించాల్సి ఉండగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం చేతులెత్తేసింది, ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు వెనుకంజ వేసింది. బోధన్‌లోని శక్కర్‌నగర్, ముత్యంపేట (కరీంనగర్) ముంజోజిపల్లి (మెదక్) ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు మళించారు. ముడిసరుకు కొరత సాకు చూపి ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం 2015 డిసెంబర్ 23న లేఆఫ్ నోటీసు జారీ చేసి ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేసింది. దీంతో మూడు యూనిట్ల పరిధిలోని కార్మికులు ఉపాధి కోల్పో యి రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి కార్మికులు ఆందోళన బాటపట్టారు. కార్మికుల ఆందోళనకు నిజాంషుగర్స్ రక్షణ కమిటీ అండగా నిలిచింది. నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాలు ఐక్యతతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్డీఎస్ఎల్ లేఆఫ్ ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలో జాప్యం చేస్తోంది. దీంతో కార్మికులు, రైతుల్లో ప్రభుత్వం పై అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. ఫ్యాక్టరీ భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి కావస్తున్నా నిజాంషుగర్స్ స్వాధీనం పై ప్రభుత్వం విధాన పరమైన సానుకూల నిర్ణయం తీసుకోకుండా కమిటీల అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తోందని అఖిల పక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. 129 రోజులుగా రిలే నిరహార దీక్షలు నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ప్రధాన డిమాండ్‌తో ఏర్పడిన నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ఒక వైపు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తునే, మరో వైపు రిలే నిరహార దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తోంది. 2015 నవంబర్ 18 పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరహార దీక్షను ప్రారంభించా రు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు వంతుల వారీగా రిలే నిరహార దీక్షలో కూర్చుంటున్నారు. శుక్రవారం నాటికి రిలే నిరహార దీక్షలు 129 రోజులు పూర్తికాగా.. కార్మికుల కుటుంబాలు పిల్లాపాపలతో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని రక్షణ కమిటీ సంకల్పంతో ముందుకెళ్తోంది. సాలూర వద్ద అంతర్రాష్ట్ర రోడ్డు దిగ్బంధం కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని నిజాంషుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు కోరారు. -
చేదెక్కిన చక్కెర పరిశ్రమ
ఎఫ్ఆర్పీని రూ.10కి పరిమితం చేసిన కేంద్రం రాష్ట్ర సూచనలు పాటించలేమన్న ఫ్యాక్టరీ యాజమాన్యాలు గణనీయంగా పడిపోతున్న చెరుకు సాగు విస్తీర్ణం హైదరాబాద్: క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) భవితవ్యంపై స్పష్టత కొరవడింది. మరోవైపు మద్దతు ధర (ఎస్ఏపీ)పై చక్కెర కర్మాగారాలు నాన్చుతున్నాయి. కనీస ధర (ఎఫ్ఆర్పీ)ను కేంద్ర ప్రభుత్వం ఏటా క్వింటాలుకు రూ.10 మాత్రమే పెంచుతోంది. దీంతో చెరుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. చెరుకు మద్దతు ధరను నిర్ణయించడంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే సీఏసీపీ సూచన మేరకు ఏటా కేంద్రం చెరుకు ఎఫ్ఆర్పీని ప్రకటిస్తుంది. 2013-14లో క్వింటాలు చెరుకు ఎఫ్ఆర్పీ రూ.210 వుండగా, 2014-15లో రూ.220గా నిర్ణయించారు. దీంతో చెరుకు రైతులకు గత క్రషింగ్ సీజన్లో మెట్రిక్ టన్నుకు రూ.2,200 లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎస్ఎపీ (స్టేట్ అడ్వైజబుల్ ప్రైస్) రూ.340, అమ్మకం పన్ను రూ.60 కలుపుకొని మెట్రిక్ టన్నుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు చక్కెర ఫ్యాక్టరీలు అంగీకరించాయి. 2014-15లో ఎన్డీఎస్ఎల్, ప్రైవేటు చక్కెర కర్మాగారాలు రాష్ట్రంలో రూ.798.53 కోట్ల విలువ చేసే చెరుకును రైతుల నుంచి కొనుగోలు చేశాయి. అయితే బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. ఒక్క ఎన్డీఎస్ఎల్ పరిధిలోనే రూ.28 కోట్ల బకాయిలు చెరుకు రైతులకు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అంతే.. సీఏసీపీ సూచన మేరకు 2015-16కు సంబంధించి క్వింటాలు చెరుకు ఎఫ్ఆర్పీని రూ.230గా కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన మెట్రిక్ టన్ను చెరుకు ధర రూ.2,300 మాత్రమే పలకనుంది. సాగుకయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని మెట్రిక్ టన్నుకు రూ.3,600 చొప్పున రైతులు డిమాండు చేస్తున్నారు. గత ఏడాది చెల్లించిన రూ.2,600 ఎస్ఏపీ చెల్లించడం కష్టమేనని ప్రైవేటు ఫ్యాక్టరీలు సంకేతాలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు సంయుక్త భాగస్వామ్య సంస్థ ఎన్డీఎస్ఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్డీఎస్ఎల్కు ఇప్పటికే రూ.11 కోట్ల మేర సాయం అందించిన ప్రభుత్వం.. మరో రూ.27 కోట్లు విడుదల చేస్తే తప్ప రైతుల బకాయిలు తీరేలా లేవు. మరోవైపు సంస్థను తిరిగి ప్రభుత్వ పరం చేస్తే తప్ప 2015-16 సీజన్లో ఎన్డీఎస్ఎల్ క్రషింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది చెరుకు సాగు విస్తీర్ణం సగానికి పడిపోతుందని చక్కెర శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
కేసీపీలో క్రషింగ్ ప్రారంభం
ఉయ్యూరు : కేసీపీ చక్కెర కర్మాగారంలో 2014-15 సీజన్ క్రషింగ్ ప్రారంభమైంది. సంస్థ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి శుక్రవారం అర్ధరాత్రి 12.01 గంటలకు స్విచ్ ఆన్‌చేసి క్రషింగ్ ప్రారంభించారు. అంతకుముందు చెరుకు లోడుతో ఉన్న ట్రక్కుకు కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు పూజ నిర్వహించి తొలి పర్మిట్‌ను చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావుకు అందజేశారు. ఎండీ ఇర్మ్‌గార్డ్ మాట్లాడుతూ రైతు, కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. దేశంలో ఏ కర్మాగారమూ చెల్లించని విధంగా తమ కర్మాగారానికి చెరుకు రవాణా చేసిన 14 రోజుల్లో రైతుకు నగదు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మరాజు, కేసీపీ సంస్థ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) ఫ్లోరెన్స్, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), సీకే వసంతరావు (ఫైనాన్స్), హరిబాబు (ప్రాసెస్), అడ్వైజర్ కృష్ణ, హెచ్ఆర్ మేనేజర్ దాస్, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఎన్డీఎస్ఎల్లో సమ్మెకు సిద్ధం
బోధన్ : కార్మికుల వేతన సవరణ మూడేళ్లకొకసారి జరుగుతోంది. ఎన్డీఎస్ఎల్లో 2010లో వేతన సవరణ జరుగగా, 2013 సెప్టెంబర్ 30తో ముగిసింది. 2013 అక్టోబర్1 నుంచి కొత్త వేతన సవరణ జరుగాల్సి ఉండగా, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభంలో కార్మిక సంఘాలు 2013 నవంబర్18న ఫ్యాక్టరీ అధికారులకు వేతన సవరణ చేపట్టాలని సమ్మె నోటీసు ఇచ్చాయి. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించక పోవడంతో అప్పట్లో చర్చలు సఫలం కాలేదు. సమ్మె వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు కోరగా కార్మిక సంఘాలు వెనక్కు తగ్గాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం క్రషింగ్ సీజన్ ముగియగానే వేతన సవరణ పై చర్చలు జరుపుతామని, వేతన సవరణకు చర్యలు తీసుకుంటామని రాత పూర్వకంగా హామీ ఇచ్చిందని కార్మిక సంఘాల ప్రతినిధులు అంటున్నారు. కాగా ఆ తర్వాత వేతన సవరణ అంశం మూలపడింది. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. కార్మిక సంఘాలు కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎన్డీఎస్ఎల్లో 125 మంది వరకు పర్మినెంట్ కార్మికులు, సీజనల్ పర్మినెంట్ కార్మికులు 60 మంది వరకు ఉంటారు. పర్మినెంట్ కార్మికులకు నెలకు రూ. 15 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం ఉంటుంది. దీనిపై 50 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి డిమాండ్‌ను ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించే స్థితిలో లేదు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణకు సానుకూలతతో లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె నోటీసు ఇచ్చామంటున్నారు. వేతన సవరణతో పాటు 15 శాతం హెచ్ఆర్ఏ పెంచాలని, ఇంక్రిమెంట్‌ను కనీసం రూ. 500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన సవరణ ఒప్పందం ముగిసి ఏడాది పైగా కావస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. 2014-15 క్రషింగ్ ప్రారంభానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంలో యాజమాన్యంపై ఒత్తిడి పెంచి వేతన సవరణ సాధించుకోవాలని కార్మిక సంఘాలు సమ్మె యోచనలో ఉన్నాయి. ఈ మేరకు ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాలు శుక్రవారం యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించాయి. వేతన సవరణతో పాటు మరో 40 డిమాండ్ల పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఎన్డీఎస్ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ),ఎన్డీఎస్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్(బీఎంఎస్) సుగర్‌ఫ్యాక్టరీ మజ్దూర్ సభ ప్రతినిధులు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్‌కు సమ్మె నోటీసు అందించారు. డిసెంబర్ 5 లోపు వేతన సవరణతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించక పోతే సమ్మె చేపడుతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కార్మికుల బతుకులు దయనీయం ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 51 శాతం ప్రైవేట్, 49 శాతం ప్రభుత్వ వాటాలతో ప్రైవేటీకరించారు. రూ. 350 కోట్ల నిజాంషుగర్స్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థ గుప్పెట్లోకి వెళ్లిన తర్వాత వీఆర్ఎస్ పేరుతో వందలాది మంది కార్మికులు తొలగించబడ్డారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. ఇటు కార్మికులు,అటు రైతులు ఇబ్బందుల పాలైయ్యారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సానుకూలంగా స్పందించాలి ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణ, ఇతర డిమాండల పై సానుకూలంగా స్పందించాలని సీఐటీయూ అనుబంధ ఎన్డీఎస్ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుమార్ స్వామి డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం యాజమాన్యం బాధ్యతని అన్నారు. యాజమాన్యం దిగిరాకపోతే సమ్మెకు చేపడుతామని తెలిపారు. మీడియాను అనుమతించని ఫ్యాక్టరీ అధికారులు. కార్మిక సంఘాల ప్రతినిధులు సమ్మెనోటీసు ఇచ్చేందుకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లగా, ఈవిషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. ఫ్యాక్టరీ లోపలికి మీడియాను అనుమతించ లేదు. -
చెరకు రైతు ఉద్యమబాట
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బకాయిల చెల్లింపులో ప్రభుత్వ దాటవేత వైఖరి.. సీజన్ ప్రారంభమైనా సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్‌కు అనుమతించకపోవడానికి నిరసనగా చెరకు రైతులు ఉద్యమబాట పట్టారు. రైతు సంఘాలు, చెరకు రైతులు సంయుక్తంగా సోమవారం నుంచి వరుస ఆందోళనలకు సిద్ధమయ్యారు. జిల్లాలో వేరుశెనగ తర్వాత చెరకు ప్రధానమైన వాణిజ్య పంట. 40 మండలాల పరిధిలో 54 వేల హెక్టార్లలో చెరకు పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఈ చెరకు పంటపై ఆధారపడి శ్రీ వేంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం(ఎస్వీ షుగర్స్), చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ(చిత్తూరు షుగర్స్), మరో మూడు ప్రైవేటు చక్కెర పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పారు. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లలో టన్ను చెరకుకు రూ.2,100ను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. సహకార చక్కెర పరిశ్రమలకు చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు ప్రభుత్వం రూ.300లు.. పరిశ్రమలు రూ.1,800 చెల్లించేలా అప్పట్లో సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో 2012-13లో ఎస్వీ షుగర్స్‌లో 1.46 టన్నులు, చిత్తూరు షుగర్స్‌లో 1.05 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్లో ఎస్వీ షుగర్స్‌లో 1.20 లక్షలు, చిత్తూరు షుగర్స్‌లో 48 వేల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. కానీ.. ప్రభుత్వం తరఫున టన్నుకు రూ.300 చొప్పున చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటిదాకా చెల్లించలేదు. ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.50 కోట్ల మేర బకాయిపడింది. రెండేళ్లుగా బకాయిల చెల్లింపు కోసం రైతులు చేస్తోన్న విన్నపాలను ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. ఈలోగా 2014-15 క్రషింగ్ సీజన్ రానే వచ్చింది. జిల్లాలో ప్రైవేటు చక్కెర పరిశ్రమలు అప్పుడే క్రషింగ్ ప్రారంభించాయి. కానీ.. సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించడం లేదు. అటు బకాయిలు చెల్లించకపోవడం.. ఇటు క్రషింగ్ ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస కరవుతో చిక్కి శల్యమై.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు తక్షణమే బకాయిలు చెల్లించాలని చెరకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్‌కు అనుమతించకపోవడం ద్వారా ఆ పరిశ్రమలను మరింత నష్టాల్లో కూరుకుపోయేలా సర్కారు కుట్రలు చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు చక్కెర పరిశ్రమలకు లబ్ధి చేకూర్చడం కోసమే సహకార పరిశ్రమల్లో క్రషింగ్‌కు అనుమతించడం లేదని స్పష్టీకరిస్తున్నారు. బకాయిలను తక్షణమే చెల్లించాలి.. క్రషింగ్‌ను వెంటనే ప్రారంభించాలి అనే డిమాండ్లతో చెరకు రైతులు ఉద్యమబాట పట్టారు. రైతు సంఘాలు వారికి బాసటగా నిలిచాయి. సోమవారం ఎస్వీ షుగర్స్ ఎదుట రైతు సంఘాల సమాఖ్య నేతృత్వంలో భారీ ఉద్యమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు షుగర్స్ ఎదుట చెరకు రైతులు కదంతొక్కడానికి సమాయత్తమవుతున్నారు. వరుస ఉద్యమాలకు చెరకు రైతులు సన్నద్ధమవుతుండటం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
చెరకు రైతు.. బతుకు బరువు
సాక్షి, సంగారెడ్డి: చెరకు రైతుకు మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా క్రషింగ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులు మద్దతు ధర కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మూడు చెరకు ఫ్యాక్టరీలు పది రోజుల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మద్దతు ధరపై మరోమారు మెతుకుసీమ చెరకు రైతులు పోరుబాటకు సిద్ధపడుతున్నారు. కరెంటు కోతలు, వర్షాభావం పరిస్థితులను అధిగమించి పంట సాగు చేసిన తమకు టన్నుకు రూ.3,500 చెల్లించాల్సిందిగా రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలోని గణపతి షుగర్స్, ట్రైడెంట్ షుగర్స్, నిజాం దక్కన్ షుగర్స్ పరిశ్రమలు మాత్రం రైతులు అడిగినంతగా ధర చెల్లించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని గణపతి షుగర్స్ యాజమాన్యంతో మద్దతు ధరపై చెరకు రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మిగతా రెండు పరిశ్రమల పరిధిలోని రైతులు సైతం రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. మద్దతు ధర ఖరారు కానప్పటికీ గణపతి షుగర్స్ ఈనెల 13న, ట్రైడెంట్ షుగర్స్ ఈనెల మూడోవారంలో, నిజాం దక్కన్ షుగర్స్ వచ్చేనెల క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు, రైతు సంఘాలు, చెరకు రైతులతో సోమ లేదా మంగళవారాల్లో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మద్దతు ధరపైనే ఆశలు జిల్లాలో సుమారు 22 వేల మంది చెరకు రైతులు 18 వేల హెక్టార్లలో చెరకు పంటలను సాగు చేశారు. ఫసల్వాదిలోని గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 7,200 హెక్టార్లు, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 9, 000 హెక్టార్లు, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 2,280 హెక్టార్లలో రైతులు చెరకుపంట వేశారు. జహీరాబాద్, న్యాల్కల్, పుల్కల్, పాపన్నపేట, ఝరాసంగం, అందోలు ప్రాంతాల్లో చెరకు సాగు అధికంగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా చెరకు సాగు వ్యయం పెరిగింది. దీనికితోడు ఖరీఫ్‌లో వర్షాభావం, కరెంటు కోతల కారణంగా చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు ఈసారి లద్దెపురుగు పంటను దెబ్బతీసింది. ఈ కారణాలతో చెరకు దిగుబడి ఈ దఫా 20 శాతానికిపైగా తగ్గనున్నట్లు అంచనా. ఇదిలావుంటే చెరకు కోతల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చెరకు రైతులు టన్ను రూ.3,500 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు. చక్కెర ధర తగ్గడం వల్లే? టన్నుకు చెరకు రూ.3,500 ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మాత్రం రూ.2,600 నుంచి రూ.2,800 వరకు చెల్లిస్తామంటున్నాయి. మార్కెట్లో చక్కెర ధర ఆశించిన స్థాయిలో లేకపోవటం, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ చక్కెరపై ఐదు శాతం వ్యాట్ విధించటం, రాష్ట్ర విభజన నేపథ్యంలో మొలాసిస్ సరఫరాపై టన్నుకు రూ.2,500 పన్ను విధించటం తదితర కారణాలతో మద్దతు ధర చెల్లింపు విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే చర్చల్లో సమస్యలను విన్నవించి తమకు, రైతులకు నష్టం వాటిల్లకుండా మద్దతు ధర నిర్ణయించాలని పరిశ్రమల యాజమాన్యాలు భావిస్తున్నట్లు సమాచారం. -
ఆందోళనలో చెరకు రైతులు
జహీరాబాద్: ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగార యాజమాన్యం ఈ సారి కూడా చెరకు రైతుకు చేదును మిగిల్చింది. సామర్థ్యం పెంచి కర్మాగారం పరిధిలో సాగైన పంటనంతా కొనాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, 2014-15 క్రషింగ్ సీజన్ సామర్థ్యం పెంచే యోచనను యాజమాన్యం దాదాపుగా విరమించుకుంది. రైతుల కోరిక మేరకు తొలుత సామర్థ్యం పెంచాలనుకున్న యాజమాన్యం ఆ తర్వాత పలు కారణాలతో సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500 టన్నుల మేర కలిగి ఉంది. దాన్ని సీజన్‌కు గాను 3,300 టన్నులకు పెంచాలని యోచించింది. నవంబర్ రెండో వారంలో క్రషింగ్ ఉన్నందున ఇప్పటికిప్పుడు విస్తరణ పనులు ప్రారంభిస్తే సీజన్ ఆరంభానికల్లా పూర్తి చేయలేని పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో అయితే ఆఖరు నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో రైతులు తమ చెరకును వ్యయప్రయాసల కోర్చి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. వచ్చే సీజన్‌కు సామర్థ్యం పెంచేలా చర్యలు ప్రస్తుతం కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500ల టన్నులుగా ఉంది. దీన్ని ప్రస్తుతం రోజుకు 3,800 టన్నులకు పెంచాలని, ఆ తర్వాత 2015-16 క్రషింగ్ సీజన్‌కు 4,200 టన్నుల మేరకు చేర్చాలని యాజమాన్యం పరిశీలించినట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం కర్మాగారం ఎం.డి రాజశ్రీ జహీరాబాద్ వచ్చిన సందర్భంగా రైతులు సామర్థ్యం పెంచే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆమె సుముఖత కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌కు కాకుండా 2015-16 క్రషింగ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్మాగారం సామర్థ్యాన్ని మొక్కుబడిగా పెంచితే ఏ మాత్రం ప్రయోజనం ఉండబోదని, 6 వేల టన్నులకు పెంచే విషయాన్ని యాజమాన్యం సీరియస్‌గా పరిశీలించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. సాగు పెరిగినా...పెరగని క్రషింగ్ 1973 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్-3 కర్మాగారాన్ని జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో నిర్మించి ప్రారంభించింది. అప్పట్లో రోజుకు 1,250 టన్నుల సామర్థ్యం మేర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. పలు దశల్లో కర్మాగారం క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ప్రతి ఏటా జోన్ పరిధిలో చెరకు పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతుండడంతో కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ వస్తున్నారు. సంగారెడ్డిలోని గణపతి, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట కర్మాగారాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాలకు కూడా రైతులు చెరకును తరలించుకుంటున్నారు. కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు చెరకును విక్రయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్మాగారం సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అయినా యాజమాన్యం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో ప్రస్తుతం అధికారికంగా 24వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. అనధికారికంగా ఇది 28 వేల ఎకరాల్లో ఉంటుందని అంచనా. పూర్తిస్థాయిలో జరగని క్రషింగ్ ప్రస్తుతం జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరకు పంటను ట్రైడెంట్ కర్మాగారం పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయడం లేదు . గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి నెలకొంటూ వస్తోంది. జోన్ పరిధిలో సుమారు 9 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇందులో ట్రైడెంట్ కర్మాగారం సుమారు 4.75 లక్షల టన్నుల చెరకును మాత్రమే క్రషింగ్ చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం 4.65 లక్షల టన్నుల మేర చెరకును క్రషింగ్ చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు చెరకును ఇతర కర్మాగారాలకు తరలించుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం వర్షాభావం కూడా ఏర్పడడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత మేర ఇతర కర్మాగారాలకు చెరకు పంటను తరలించుకునేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆలస్యం చేస్తే కూలీ, రవాణా చార్జీల రేట్లు భారీగా పెరిగి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి వస్తుందంటున్నారు. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ కర్మాగారం సామర్థ్యాన్ని రోజుకు 6 వేల టన్నుల మేర పెంచినట్లయితేనే ప్రయోజనం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో యాజమాన్యం ఏ మేరకు శ్రద్ధ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
నేడు ‘తాండవ’ మహాజనసభ
పాయకరావుపేట : తాండవ చక్కెర కర్మాగారం 2014-15 క్రషింగ్ సీజన్ నవంబర్ మూడో వారంలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఫ్యాక్టరీ మహాజన సభ జరగనుంది. ఈ కర్మాగారం 2013-14 సీజన్లో 1,78,361 టన్నులు చెరకు క్రషింగ్ చేసి 1,74,985 బస్తాల పంచదార దిగుబడి సాధించింది. 9.9 రికవరీతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో 2 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెరకు సాగు ప్రోత్సహించేందుకు 5,870 మందిై రెతులకు రూ.1.73 కోట్ల విలువ చేసే చెరకు విత్తనం, రూ.1.70 కోట్ల యూరియా, 2,500 టన్నుల సూఫర్ ఫాస్పేట్, పొటాష్లను వడ్డీ లేని అప్పు కింద సరఫరా చేశారు. 2,415 ఎకరాల్లో ఉడుపు,7478 ఎకరాల్లో కార్శితోటల్లో 2.4 లక్షల టన్నుల చెరకు సరఫరా చేసేందుకు రైతులతో ఫ్యాక్టరీ అధికారులు అగ్రిమెంట్లు తీసుకుంటున్నారు. మూడు నెలల క్రితం చేపట్టిన ఓవర్ హాలింగ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. గత సీజనులో క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడిన మిల్లులో లోపాలు సరిచేశారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో 90 వేల బస్తాల పంచదార నిల్వలు ఉన్నాయి. చెరకుకు ధర లభించక తాండవ సుగర్స్ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులకనుగుణంగా గిట్టుబాటు ధర లేకపోతే భవిష్యత్తులో చెరకు సాగు సాధ్యం కాదని అంటున్నారు. గత ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.1870లు ఇవ్వగా ప్రభుత్వం రూ.160లు ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో టన్నుకు రూ.2030 గిట్టుబాటు కల్పించారు. రైతులకు రూ.7.90 కోట్లు చెల్లింపులు చేశారు. జిల్లాలో ఏటికొప్పాక, చోడవరం ఫ్యాక్టరీల్లో టన్నుకు రూ.2200 నుంచి 2400 వరకూ మధ్దతు ధర చెల్లిస్తున్నారు. ‘తాండవ’ యాజమాన్యం కూడా అదే ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రెండేళ్ల తరువాత మహాజన సభ.. ఏటా క్రషింగ్ ప్రారంభానికి రెండు నెలల ముందు మహాజనసభ నిర్వహించడం ఆనవాయితీ. ఫ్యాక్టరీకి పాలకవర్గం లేక రెండేళ్లుగా రైతు మహాజన సభ నిర్వహించలేదు. కొత్త పాలకవర్గం పగ్గాలు చేపట్టడంతో ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు రైతు మహాజన సభ జరగనుంది. ఇందులో టన్నుకు ఎంత ధర ప్రకటిస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. -
బకాయిలు వచ్చేదెన్నడో?
జహీరాబాద్: స్థానిక ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం యాజమాన్యం.. చైరకు బకాయిలను చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా రెతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సాగు పెట్టుబడుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రుణమాఫీ అమలైతే తిరిగి రుణాలు పొందవచ్చనే ఆశ నీరుకారడంతో.. ట్రైడెంట్ యాజమాన్యమైనా బకాయిలు చెల్లిస్తే పెట్టుబడుల కోసం కొంత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలవుతుందని ఆశించిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయినా.. రుణమాఫీ అమలు కాక పోవడంతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టక తప్పడం లేదు. మరో పక్షం రోజులు గడిస్తే రబీ పంటల సాగు కోసం కూడా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండడంతో చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం యాజమాన్యం చెరకు బకాయిలనైనా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు అంటున్నారు. తిరిగి క్రషింగ్ సీజన్ ప్రారంభించేందుకు సమయం దగ్గర పడుతున్నా బకాయిలను చెల్లించే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2013-14 సీజన్‌కు గాను ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 4.65 లక్షల టన్నుల మేర చెరకు పంటను గానుగాడించింది. క్రషింగ్ ప్రారంభం నుంచి యాజమాన్యం పూర్తి బిల్లులను చెల్లించలేదు. క్రషింగ్ సీజన్‌కు గాను యాజమాన్యం టన్నుకు రూ.2,600 ధరను నిర్ణయించింది. క్రషింగ్ సీజన్ ఆరంభం నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు టన్నుకు రూ.2,400 బిల్లులను చెల్లిస్తూ వచ్చింది. అయితే మిగతా 200 రూపాయలను క్రషింగ్ ముగిసిన అనంతరం చెల్లించడం జరుగుతుందని యాజమాన్యం క్రషింగ్ ఆరంభంలో ప్రకటించింది. క్రషింగ్ ముగిసి ఆరు నెలలు కావస్తున్నా బిల్లుల బకాయిలను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. బకాయిలను ఇంత వరకు రైతులకు చెల్లించలేదు. ఈ బిల్లుల కింద యాజమాన్యం రైతులకు రూ.9.30 కోట్లు బకాయి పడింది. వీటిని చెల్లించే విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా యాజమాన్యం బకాయి పడిన చెరకు బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని బకాయిలు తక్షణమే చెల్లించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. -
కార్మికులకు పర్మినెంట్ హామీ అమలయ్యేనా ?
బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : విడతల వారీగా కార్మికులను పర్మినెంట్ చేస్తామనే హామీని నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కర్మాగారం ప్రభుత్వ పరం నుంచి 2002లో ప్రైైవే ట్ పరమైంది. కర్మాగారంలో సీజనల్ కార్మికులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 102 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ, మజ్దూర్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల వారు ఉద్యమించారు. వారి పోరాటానికి దిగివచ్చిన యాజమాన్యం, ఏడాదికి 25 మంది కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఏటా క్రషింగ్ సీజన్ అనంతరం 25 మంది కార్మికుల చొప్పున పర్మినెంట్ చేస్తామని 30 డిసెంబర్ 2011న హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలులో మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వ హిస్తోంది. పర్మినెంటు ఆర్డర్లు ఏవీ.. 2012లో చెరకు క్రషింగ్ అనంతరం 25 మంది కార్మికులను సీజనల్ నుంచి పర్మినెంట్ చేస్తున్నట్లుగా యాజమాన్యం కాపీని జారీచేసి వారిని వివిధ భాగాల్లో విధులు నిర్వహించుకుంటోంది. దీంతో పాటు 2013లో చెరుకు క్రషింగ్ ముగిసిన ఆరు నెలలకు మరో 25 మంది సీజనల్ కార్మికులను ఒప్పందం ప్రకారం పర్మినెంట్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. యాజమాన్యం కార్మికులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేసిందే తప్ప, వారికి ఇప్పటివరకు వ్యక్తిగతంగా పర్మినెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. అంతేకాకుండా వారి విభాగంలో కాకుండా ఇతర పనులను పురమాయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. 50 మంది పర్మినెంట్ అయిన కార్మికుల్లో తనకు ఇవ్వాల్సిన విభాగంలో కాకుండా మరో విభాగంలో పర్మినెంట్ చేస్తున్నారని ఓ కార్మికుడు ఒప్పుకోలేదు. మరో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ నలుగురితో పాటు మరో 50 మంది కార్మికులు పర్మినెంట్ అవుతామనే ఆశల్లో తేలియాడుతున్నారు. 2014 చెరుకు క్రషింగ్‌కు మందు కార్మికులు ఒప్పందం ప్రకారం 25 మందిని పర్మినెంట్ చేయాలని యాజమాన్యాన్ని కొరగా, సీజన్ ముగిసిన అనంతరం చూద్దామని దాటవేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఫ్యాక్టరీ ప్రైవేట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేసింది. దీంతో తమకు రావాల్సిన పెట్టుబడి మొత్తం ఇవ్వాలని యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.తెలంగాణ వస్తే ఫ్యాక్టరీ ప్రభుత్వపరం అవుతుందని అలోచనలో పడ్డ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, మరో 25 మంది కార్మికులను పర్మినెంట్ చేయడానికి దాటవేత దోరణిని అవలంభిస్తోంది. దీంతో కార్మికులు ఉద్యమాల బాట పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏటా 25 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు పర్మినెంట్ చేయకపోతే తాము ఎప్పటికి కాలేమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాజవల్ కార్మికుల పరిస్థితి... ? ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారంలో సుమారు 200 మంది కార్మికులు క్యాజవల్ లేబర్స్‌గా పనిచేస్తున్నారు. వీరిలో నుంచి సైతం ఏటా 25 మందిని ఎఫ్‌టీసీ కార్మికులుగా యాజమాన్యం గుర్తించాల్సి ఉంది. హక్కుల కాలరాస్తూ యాజమాన్యం కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కుతోంది.