చేదెక్కిన చక్కెర పరిశ్రమ | sugar industry | Sakshi
Sakshi News home page

చేదెక్కిన చక్కెర పరిశ్రమ

Published Sun, Jul 19 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

చేదెక్కిన చక్కెర పరిశ్రమ

చేదెక్కిన చక్కెర పరిశ్రమ

ఎఫ్‌ఆర్‌పీని రూ.10కి పరిమితం చేసిన కేంద్రం
రాష్ట్ర సూచనలు పాటించలేమన్న ఫ్యాక్టరీ యాజమాన్యాలు
గణనీయంగా పడిపోతున్న  చెరుకు సాగు విస్తీర్ణం

 
హైదరాబాద్: క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) భవితవ్యంపై స్పష్టత కొరవడింది. మరోవైపు మద్దతు ధర (ఎస్‌ఏపీ)పై చక్కెర కర్మాగారాలు నాన్చుతున్నాయి. కనీస ధర (ఎఫ్‌ఆర్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం ఏటా క్వింటాలుకు రూ.10 మాత్రమే పెంచుతోంది. దీంతో చెరుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. చెరుకు మద్దతు ధరను నిర్ణయించడంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే సీఏసీపీ సూచన మేరకు ఏటా కేంద్రం చెరుకు ఎఫ్‌ఆర్‌పీని ప్రకటిస్తుంది. 2013-14లో క్వింటాలు చెరుకు ఎఫ్‌ఆర్‌పీ రూ.210 వుండగా, 2014-15లో రూ.220గా నిర్ణయించారు. దీంతో చెరుకు రైతులకు గత క్రషింగ్ సీజన్‌లో మెట్రిక్ టన్నుకు రూ.2,200 లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎస్‌ఎపీ (స్టేట్ అడ్వైజబుల్ ప్రైస్) రూ.340, అమ్మకం పన్ను రూ.60 కలుపుకొని మెట్రిక్ టన్నుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు చక్కెర ఫ్యాక్టరీలు అంగీకరించాయి. 2014-15లో ఎన్‌డీఎస్‌ఎల్, ప్రైవేటు చక్కెర కర్మాగారాలు రాష్ట్రంలో రూ.798.53 కోట్ల విలువ చేసే చెరుకును రైతుల నుంచి కొనుగోలు చేశాయి. అయితే బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. ఒక్క ఎన్‌డీఎస్‌ఎల్ పరిధిలోనే రూ.28 కోట్ల బకాయిలు చెరుకు రైతులకు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
 
 ఈ ఏడాది అంతే..
 సీఏసీపీ సూచన మేరకు 2015-16కు సంబంధించి క్వింటాలు చెరుకు ఎఫ్‌ఆర్‌పీని రూ.230గా కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన మెట్రిక్ టన్ను చెరుకు ధర రూ.2,300 మాత్రమే పలకనుంది. సాగుకయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని మెట్రిక్ టన్నుకు రూ.3,600 చొప్పున రైతులు డిమాండు చేస్తున్నారు. గత ఏడాది చెల్లించిన రూ.2,600 ఎస్‌ఏపీ చెల్లించడం కష్టమేనని ప్రైవేటు ఫ్యాక్టరీలు సంకేతాలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు సంయుక్త భాగస్వామ్య సంస్థ ఎన్‌డీఎస్‌ఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్‌డీఎస్‌ఎల్‌కు ఇప్పటికే రూ.11 కోట్ల మేర సాయం అందించిన ప్రభుత్వం.. మరో రూ.27 కోట్లు విడుదల చేస్తే తప్ప రైతుల బకాయిలు తీరేలా లేవు. మరోవైపు సంస్థను తిరిగి ప్రభుత్వ పరం చేస్తే తప్ప 2015-16 సీజన్‌లో ఎన్‌డీఎస్‌ఎల్ క్రషింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది చెరుకు సాగు విస్తీర్ణం సగానికి పడిపోతుందని చక్కెర శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement