హవ్వ.. ఇదేం పని? | Making employees to other works | Sakshi
Sakshi News home page

హవ్వ.. ఇదేం పని?

Published Tue, Aug 11 2015 11:32 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

హవ్వ..  ఇదేం పని? - Sakshi

హవ్వ.. ఇదేం పని?

పై చిత్రం చూశారా.. ఏదో ఫ్యాక్టరీ ఎదుట గడ్డిని తొలగిస్తున్న కూలీలు అనుకుంటున్నారా? అయితే, చెరకుతోటలో కాలేసినట్టే.. ఇది నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ . అందులో యంత్రాలను నడపాల్సిన కార్మికులు గడ్డి తొల గిస్తున్నారు. పనిలేదనే సాకుతో యాజమాన్యం ఇలా పనిచేయిస్తోంది. పైగా వారికి నెలనెలా జీతాలూ చెల్లించడంలేదు. మరోపక్క ఈ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు రూ.11 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది.
 
యంత్రాలను నడపాల్సిన చేతులు గడ్డి పీకుతున్నాయి
- ఎన్డీఎస్‌ఎల్ నిర్వాకం.. కార్మికులకు ప్రాణసంకటం
- క్రషింగ్ ఊసెత్తని వైనం
- జీతాలు చెల్లించలేని దుస్థితి
మెదక్ రూరల్:
నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్‌ఎల్) నిర్వాకం చూస్తుంటే కంపెనీ భవిష్యత్తు సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది.. చెరకు క్రషింగ్ మూడు నెలల్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తకపోగా.. కార్మికుల చేత ఏ పని అంటే ఆ పని చేయిస్తోంది.. యంత్రాలను నడపాల్సిన కార్మికులు పనిలేక ఫ్యాక్టరీ ఆవరణలో గడ్డిని తొలగిస్తున్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి శివారులో పాతికేళ్ల క్రితం ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్డీఎస్‌ఎల్‌ను నెలకొల్పారు. 12 మండలాలకు చెందిన చెరకు రైతులకు ఇదెంతో ఉపయోగపడింది.

ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో బోరుబావులే వ్యవసాయాధారం. బోర్లు తవ్వితే వచ్చే కొద్దిపాటి నీరుతో చెరకు తోటలను సాగు చేస్తుంటారు. ఫ్యాక్టరి ప్రారంభంలో 5 లక్షల టన్నుల చెరకును గానుగాడించిన సందర్భాలున్నాయి. అప్పట్లో దాదాపు 600 మంది కార్మికులు ఫ్యాక్టరీలో పనులు చేసేవారు. తదనంతరం చంద్రబాబునాయుడు హయాంలో ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్న సాకుతో 51 శాతం కంపెనీ వాటాను డక్కన్‌పేపర్ మిల్లు యజమానికి కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా ఫ్యాక్టరీలో కార్మికుల సంఖ్య 150కి పడిపోయింది. కాగా, గతేడాది 95 వేల టన్నుల చెరకు మాత్రమే గానుగ ఆడి ంది. ప్రైవేట్‌పరమైన నాటి నుంచి ఇటు చెరకు  రైతులు.. అటు కార్మికులు ఇక్కట్లకు గురవుతూనే ఉన్నారు.

రెండు నెలలకోసారి కూడా వేతనాలు ఇవ్వటంలేదని, ఇప్పటివరకు మూడు సార్లు వేతన సవరణ ఎగ్గొట్టినట్లు కార్మికులు వాపోతున్నారు. రైతులు ఫ్యాక్టరీకి చెరుకు పంపి 6 నెలలవుతున్నా నేటికీ బిల్లులకు దిక్కులేదు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నుంచి రైతులకు రూ.11 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. అంతే కాకుండా సాగుచేసిన చెరుకును ఇప్పటికీ అగ్రిమెంట్ చేయలేదు. ఏటా అక్టోబర్‌లో క్రషింగ్ ప్రారంభమవుతుంది. అంటే క్రషింగ్‌కు మారో మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. నేటికీ యంత్రాలను సిద్ధం చేయలేదు. ఏటా క్రషింగ్ పూర్తికాగానే మిషన్లను సర్వీసింగ్ చేయాలి. అందులో ఏవైనా చెడిపోతే వాటిని తొలగించి కొత్తవి అమర్చాలి.. కానీ, అలాంటివేవీ జరగడం లేదు. దీంతో ఫ్యాక్టరీ నడుస్తుందా? లేదా అనే సందిగ్ధంలో రైతులు, కార్మికులు ఉన్నారు. కార్మికులకు పనిలేకపోవడంతో ఫ్యాక్టరీ ఆవరణలోని గడ్డిని తొలగింపజేస్తున్నారు.
 
ప్రైవేట్‌పరమైన నాటి నుంచి తిప్పలే..
ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరమైన నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి వేతన సవరణ చేయాలి. అలాంటిది ఇప్పటికి 3 సార్లు వేతన సవరణ ఎగ్గొట్టారు.
- ప్రభాకర్, ఫ్యాక్టరీ తెలంగాణ మజ్దూర్‌సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్
 
సమయానికి వేతనాలు రాక ఇబ్బందులు
వేతనాలు సమయానికి ఇవ్వకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కార్మికులను యాజమాన్యం అనేక రకాలుగా నష్టపరిచింది. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి.
 - ముక్తార్, ఫ్యాక్టరీ తెలంగాణ
మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ

కూతురు పెళ్లికి సైతం డబ్బులు ఇవ్వలేదుసారూ...
ఆరు మాసాల క్రితం ఫ్యాక్టరీకి 52 టన్నుల చెరకును తరలించాను. రూ.1,35,200 రావాల్సి ఉండగా రూ. 90 వేలు ఇచ్చారు.  నా కూతురు పెళ్లి ఉంది.. డబ్బులు కావాలన్నా ఇవ్వలేదు. వడ్డీకి అప్పులు తెచ్చి పెళ్లిచేశాను. ప్రస్తుతం 3 ఎకరాలలో చెరకుతోట సాగు చేసిన. కాని అగ్రిమెంట్ చేయలేదు.   - మూడావత్ శంకర్, చెరకు రైతు,  హవేళిఘణపూర్ తండా
 
ఆరునెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు..
చెరకును ఫ్యాక్టరీకి తరలించి ఆరు నెలలవుతున్నా బిల్లులు ఇవ్వటంలేదు. 50 టన్నుల చెరకును తరలించాను. రూ. 1,30,000 రావల్సి ఉండగా రూ. 30 వేలే ఇచ్చారు. మిగతా సొమ్ము కోసం అడిగినా పట్టించుకోవటంలేదు.   - గుగ్లోత్ దూప్‌సింగ్, చెరకు రైతు, తొగిట పంచాయతీ సుల్తాన్పూర్ తండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement