పారిశుధ్య పనుల్లో పంచాయతీ కార్మికులు
గుడిహత్నూర్ : గ్రామ పంచాయతీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగు కన్పించడం లేదు. ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా పని చేస్తూ.. నేడో.. రేపో తమను గుర్తించక పోతారా..? అనే ఆశతో కడుపు నింపని జీతాలతో దయనీయ స్థితిలో ఉన్నారు. ఇటు పని భారాన్ని.. అటు కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఈ పని వదిలి బయటకు వెళ్లలేక, మరో పని చేయలేక సతమతమవుతున్నారు.
అధ్వానంగా కార్మికుల బతుకులు
పంచాయతీల్లో పని చేసే కారోబార్లు, దినసరి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, వివిధ పనుల కోసం నియమించిన కామాటీల పరిస్థితి దారుణంగా ఉంది. వీరంతా గ్రామాల్లో కాలువల నిర్వహణ, చెత్త సేకరించి తరలించడం, సమయానికి తాగునీరు అందించడం, పన్నులు వసూలు చేయడం, పశు కళేబరాలను తరలించడంతో పాటు గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎంతో ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నారు.
కనీస వేతనాలు కరువు...
పంచాయతీల్లో కారోబార్లు 33ఏళ్ల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నా వీరికి నెలకు కేవలం రూ.5వేల దాటలేదు. మరి కొందరికి రూ. 2వేలు మాత్రమే ఇస్తున్నారు. గతంలో తమ సమస్యల పరిష్కారానికై ఉమ్మడి జిల్లాలోని 866 పంచాయతీల్లోని 2700 మంది పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేశారు. చర్చలు జరిపిన ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేటికీ కార్యరూపం దాల్చుకోలేదు. సాధారణ ఉపాధి కూలీ సైతం ఒక పూట పని చేసి రోజుకు రూ.200 సంపాదిస్తున్నాడు. కానీ పంచాయతీ కార్మికుల పంప్ ఆపరేటర్ల వేతనం నెలకు రూ.2500 దాటడం లేదు. ఇకనైనా పంచాయతీలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రతో పాటు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
వెయ్యితో ముగియనుంది
1978 మార్చి 1 నుంచి పంచాయతీ కారోబార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ప్రస్తుతం రూ. వెయ్యి జీతం ఇస్తున్నారు. దీన్ని బట్టి నా గత జీతం ఎంతో అర్థమయ్యే ఉంటుంది. ఏనాటికైనా ప్రభుత్వం గుర్తించకుండా పోతుందా? అనే నమ్మకంతో ఉన్నా. 40 సంవత్సరాలు కావొస్తోంది. నా కల..కల్లగానే మిగిలేలా ఉంది.
– ధనూరే మారుతిరావు, కొల్హారీ కారోబార్
సర్వీసు 33 ఏళ్లు.. జీతం రూ.5వేలే
33 ఏళ్లుగా మేజర్ పంచాయతీ కారోబారుగా పని చేస్తున్నా. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ నుంచి పంచాయతీ రికార్డులు, పన్నుల వసూలు, ఆదాయ వ్యయాల నిర్వహణతో పాటు రోజూ కార్యాలయంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నం. వేతనం రూ.5వేలు దాటలేదు. వయస్సు మీదపడింది.
– అమీల్ అలీ, కారోబార్, గుడిహత్నూర్
బతకడం భారంగా ఉంది
మురికి తీయడం, రోడ్లు ఊడ్చడం చెత్తను తరలించడం ఇలా దినమూ, రాత్రీ అనకుండా పని చేయాల్సి ఉంటుంది. అంతా చేస్తే నెలకు రూ.4వేలు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదు. ఇప్పుడున్న జీతం తిండికీ మందులకే సరిపోతలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ కార్మికులను పట్టించుకోవాలి.
– సుద్దాల లింగన్న, పారిశుధ్య కార్మికుడు
Comments
Please login to add a commentAdd a comment