సాక్షి, ఆదిలాబాద్ : గళ్లపెట్టే నిండా డబ్బులున్నా.. ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉమ్మడి జిల్లా పరిషత్‌ది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు విడుదల చేసి మూడు నెలలైనా ఇంత వరకు మాజీ సభ్యుల చేతికందలేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు జూన్‌లో విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో విడత కూడా విడుదల చేసి జెడ్పీ ఖాతాలో జమ చేసింది. కాని ఆ డబ్బులను సభ్యులకు పంచే అధికారం మాత్రం ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. తాజా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు గత కొన్ని నెలలుగా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
వచ్చిన వేతనాలు పంపిణీ చేసేందుకు సర్కారు అధికారులకు అధికారం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం గత మూడు నెలల క్రితం తాజా మాజీ జెడ్పీ సభ్యులకు గౌరవ వేతనాలు విడుదల చేసింది. కాని స్థానిక సంస్థల ఎన్నికలు ముగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డబ్బులను డ్రా చేసే చెక్‌పవర్ ఏ అధికారికి ఇవ్వకపోవడంతో వేతన నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మాజీ సభ్యులకు గౌరవ వేతనాలు ఎప్పుడిస్తారని ప్రతిరోజూ ఎవరో ఒకరు పరిషత్ అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
చెక్‌పవర్ లేక నిలిచిన చెల్లింపులు
జెడ్పీ మాజీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపు చెక్‌పవర్ లేకపోవడంతో నిలిచిపోయాయి. సభ్యులకు చెల్లించాల్సిన రూ.4.64 కోట్ల గౌరవ వేతనాలు ఉమ్మడి జెడ్పీ ఖాతాలో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి విడుదలైన ఈ నిధులు మాజీ సభ్యులకు పంచాల్సి ఉండగా, గత మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యుడికి నెలకు రూ.10వేలు, ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి నెలకు రూ.5 వేల చొప్పున అందరికీ 11 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలు రావాల్సి ఉంది.
ఈ లెక్కన ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీకి రూ.1.10 లక్షలు, ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి రూ.55 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 52 మంది జెడ్పీటీసీలు, 52మంది ఎంపీపీలు, 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 740 మంది మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించి న గౌరవ వేతనాల కింద పాత జెడ్పీకి రూ.4.64 కోట్లు అందాయి. వీటితోపాటు జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్‌కు చెల్లించాల్సిన 11 నెలల వేతనం కూడా వచ్చినట్లు సమాచారం. వీటిని ఆయా మాజీ సభ్యులకు పంచాల్సి ఉండగా పరిషత్‌లో అధికారికి చెక్‌పవర్ లేకపోవడంతో యంత్రాంగం ఏమి చేయలేని పరిస్థితి. కాని జెడ్పీ ఖాతా నుంచి డబ్బులు తీసేందుకు డ్రా యింగ్ పవర్ లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
‘మాజీ’లపై కనికరమేది.?
2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2016లో జెడ్పీసభ్యుల గౌరవ వేతనాలు పెంచింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ వేతనాలు అందుకున్న çసభ్యులు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకే రెట్టింపు గౌరవాన్ని పొందారు. పెంచిన వేతనాలను సమయానుకూలంగా అందజేయకపోవడంతో అప్పట్లో సభ్యులు ఇబ్బందులు పడ్డారు. నెలనెలా కాకుండా ఏడాది, ఏడాదిన్నరకోసారి వేతనాలు విడుదల చేస్తూ వచ్చింది. తాము అధికారంలో ఉన్నామనే దీమాతో ప్రభుత్వం ఎప్పుడిచ్చిన వేతనాలు తీసుకున్నామని, ఇప్పుడు మాజీలుగా మారిన ప్రభుత్వం కనికరం చూపడం లేదని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వేతనాలు విడుదల చేసేందుకు అధికారులకు చెక్‌పవర్ ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment