Grampanchayat
-
ఇదెక్కడి గోల.. ఈ భారం మోయలేం..
కరీంనగర్: గ్రామపంచాయతీలో సరిపడా నిధులు లేక సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఇవే తలకుమించిన భారమైతే.. సర్పంచ్‌లపై ట్రాక్టర్ల నిర్వహణ భారం కత్తిమీద సాములా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ఇచ్చిన ట్రాక్టర్ల కిస్తీలు కట్టలేక తలలు పట్టుకుంటున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి ఒక్క రూపాయి కూడా రావడంలేదు. దీంతో పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. తలలు పట్టుకుంటున్న సర్పంచ్‌లు జిల్లాలో 16 మండలాల పరిధిలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్త పంచాయతీలు 57 ఉన్నాయి. అయితే.. చాలా పంచాయతీలకు ఆదాయ వనరులు తక్కువ. దీంతో సిబ్బందికి జీతాల చెల్లింపు భారంగా మారిందని సర్పంచ్‌లు చెబుతున్నారు. ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన వివిధ బాధ్యతలు నిర్వహించేందుకు పలువురు సిబ్బంది అవసరం. పంచాయతీ వ్యవహారాలు చూసేందుకు కారోబార్‌తో పాటు పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్, వాటర్ ట్యాంక్‌లు, బోర్ల నిర్వహణ, తాగునీటి సరఫరా పనులు చూసేందుకు వాటర్‌మెన్, వీధిలైట్ల మెయిన్టనెన్స్ కోసం ఎలక్ట్రిషియన్, పారిశుధ్య పనులు, చెత్త సేకరణ సఫాయి కార్మికులు అవసరం ఉంటారు. పంచాయతీ ట్రాక్టర్లు నడిపేందుకు డ్రైవర్లు అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా డ్రైవర్లను నియమించకపోవడంతో పంచాయతీ సిబ్బందిలో నుంచి ఒకరిని డ్రైవర్‌గా నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సర్పంచ్‌లు అనుభవం లేని వారిని డ్రైవర్లను నియమించుకున్నారు. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రస్తుతం పంచాయతీ స్థాయి జనాభాను బట్టి సిబ్బంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి రూ.5 వేల నుంచి రూ.3 వేల వరకు వేతనాలు ఉన్నాయి. జీతాలు వ్యయం తక్కువగానే ఉండడంతో పంచాయతీలు భరిస్తున్నాయి. మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు నెలకు రూ.8,500 చెల్లించాల్సి ఉండడంతో సర్పంచ్‌లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. 500 జనాభాకు ఒకరు.. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇదివరకు ఉన్న గ్రామపంచాయతీలను పునర్ వ్యవస్థీకరించి కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆమ్లెట్ గ్రామాలు, గిరిజన తండాలు కొత్త జీపీలుగా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో వివిధ పనులు నిర్వహించేందుకు గాను గ్రామపంచాయతీలో 500 జనాభాకు ఒకరి చొప్పున మల్టీపర్పస్ వర్కర్లను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతీ పంచాయతీకి కనీసం ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు ఉండాలని సూచించింది. 500 వరకు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 10 ఉన్నాయి. 3 వేలలోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 244 ఉన్నాయి. 3 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 59 ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 1800 నుంచి 2000 మందికిపైగా మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవింగ్, మురికికాలువలు తీయడం, బల్బులు పెట్టడం, వాటర్ సమస్యలను పరిశీలించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. చిన్న పంచాయతీల్లో గందరగోళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 57 గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ట్రాక్టర్ కిస్తీ నెలకు రూ 16,000, పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.17,000, ట్రాక్టర్ మరమ్మ తు ఖర్చులు రూ.2,500, డీజిల్ ఖర్చు రూ.8,000 చొప్పున నెలకు రూ.43,000 ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి చిన్న పంచాయతీలకు వచ్చే నిధులు రూ.85 వేలు మాత్రమే. మిగితా రూ.42 వేల నుండి పారిశుధ్య కార్మికులకు, వీధి లైట్లకు, ఇతరాత్ర వాటికి ఉపయోగించాలి. ప్రభుత్వమే భరించాలి ఇప్పటికే పంచాయతీలకు పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. ఉన్న సిబ్బందికి జీతాలు ఇచ్చుడే కష్టంగా ఉంది. ట్రాక్టర్ నిర్వహణ, మల్టీపర్సస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇతరాత్ర ఖర్చుల కోసం నానా తంటాలు పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేస్తే వాటిని స్థానికంగా అభివృద్ధి పనులకు వినియోగించుకోనే అవకాశం ఉంటుంది. తలకు మించిన భారంగా తయారైన ట్రాక్టర్ నిర్వహణను ప్రభుత్వమే భరించాలి. – ఉప్పుల రాధమ్మ, గోలిరామయ్యపల్లె సర్పంచ్, రామడుగు (చదవండి: రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్ బాధితులు ) -
సార్ తలుచుకుంటే.. అక్రమ నిర్మాణాలకు కొదువా..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో ఆయన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. ఓ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన ‘సార్’.. కార్పొరేట్ కళాశాలలతో పోటీపడే స్థాయి విద్యాసంస్థలకు అధిపతి. ఇంటర్మీడియెట్ నుంచి ఇంజినీరింగ్ కళాశాలల వరకు ఆయన విద్యా వ్యాపారం విస్తరించింది. అంతటి పెద్ద మనిషి ప్రభుత్వ నిబంధనలను కాలరాశారు. కరీంనగర్ శివార్లలోని విలువైన స్థలంలోని విద్యాసంస్థల ఆవరణలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం జరిపిన నిర్మాణానికి గ్రామ పంచాయతీ, లేదా పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి తీసుకోవాలనే చిన్న లాజిక్‌ను ఆయన మరిచారు. ఏకంగా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగంతస్థుల భవనాన్ని నిర్మించారు. కళాశాల పరిధిలోని తన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి.. ఆవరణలో తారు రోడ్లను వేయిస్తున్నారు. ‘నన్ను అడిగే వారెవరు?’ అనే ధోరణిలో ‘సార్’ సాగిస్తున్న నిర్మాణాల గురించి తెలిసినా గ్రామ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి చూసీ చూడనట్టుగానే వదిలేశారు. కరీంనగర్ పట్టణాభివృద్ధి సంస్థ ‘సుడా’ ఇటువైపే చూడలేదు. బొమ్మకల్ చౌరస్తాలో జీ+3 నిర్మాణం... కరీంనగర్ బొమ్మకల్ చౌరస్తాలో బైపాస్‌ను ఆనుకొని ఉన్న భూములను గతంలోనే కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి తన గ్రూప్ విద్యాసంస్థలను నెలకొల్పారు. ఇదే క్రమంలో తెలిసో, తెలియకో అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంత భాగం కూడా ఆయన ఆధీనంలోకి వెళ్లింది. దీనిపై బొమ్మకల్ గ్రామ పంచాయతీకి చెందిన కొందరు వార్డు సభ్యులు, లోక్‌సత్తా వంటి సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ భూమిని సర్వే చేయించారు. కళాశాల స్థలానికి, వ్యవసాయ భూమికి మధ్యన సర్వే నంబర్ 28లో ఉన్న సుమారు ఎకరం 26 గుంటల భూమి ప్రభుత్వానిదని తేల్చారు. ఈ సర్కారు భూమి చుట్టూ గోడ కడతామన్న జిల్లా అధికారులు రాతి ఖనీలు పాతి, ప్రభుత్వ స్థలమనే బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. అదే సమయంలో కళాశాల ప్రాంగణంలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం జరుపుకుంటున్న మూడంతస్థుల భవనం గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నిర్మాణం కూడా పూర్తయిన ఈ భవనంలో అంతర్జాతీయ స్థాయి స్కూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. గ్రామ పంచాయతీ, సుడా అనుమతి లేకుండా... బొమ్మకల్ చౌరస్తాలోని ప్రజాప్రతినిధికి చెందిన విద్యాసంస్థల క్యాంపస్‌లో గత ఏడాది జీ+3 అంతస్థుల్లో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో శరవేగంగా నిర్మాణం పూర్తయింది. సుమారు 20వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో నిర్మాణం పూర్తయిన ఈ భవనానికి బొమ్మకల్ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేదు. భవన నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి దరఖాస్తు కూడా చేసుకోలేదని వార్డు సభ్యుడు తోట కిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై డీపీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.సురేందర్‌ను ప్రశ్నించగా అనుమతి లేని విషయాన్ని ‘సాక్షి’తో ధ్రువీకరించారు. తాను రెండున్నర నెలల క్రితమే బదిలీపై వచ్చానని, అంతకు ముందున్న కార్యదర్శి అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలని నోటీస్ ఇచ్చేందుకు వెళ్లగా, కళాశాల సిబ్బంది అనుమతించలేదని తెలిసిందన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) పరిధిలో ఉన్న ఈ స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలన్నా ఆ సంస్థ అనుమతి తప్పనిసరి. అయినా ఎలాంటి అనుమతి లేకుండానే భవన నిర్మాణం పూర్తవడం విశేషం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ‘సార్’ను అడిగే వారే లేకుండా పోయారు. ప్రభుత్వ ఆధీనంలోని బావి నుంచే పొలాలకు నీరు ప్రజాప్రతినిధి కొనుగోలు చేసిన భూముల్లో కొన్ని ఎకరాల్లో విద్యాసంస్థలు నడుస్తుండగా, మరికొన్ని ఎకరాల్లో వ్యవసాయం చేయిస్తున్నారు. ఈ భూముల కోసం తవ్విన పాత వ్యవసాయ బావిని ఆధునికీకరించారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారుల సర్వేలో ఆ బావి కూడా సర్కారు శిఖం భూమిలో ఉన్నట్లుగా తేలింది. సర్కారు భూమి చుట్టూ ప్రహరీ కట్టాలని భావించినప్పటికీ, ఒత్తిళ్ల మేరకు ఖనీలతో వదిలేశారు. ఇప్పుడు అదే వ్యవసాయ బావి ప్రజాప్రతినిధికి చెందిన వరి పొలాలకు, కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న స్కూల్ భవనం, రోడ్లకు నీటిని సరఫరా చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు మోటార్లు కూడా పని చేస్తున్నాయి. -
మా ఊళ్లో మద్యం వద్దు !
మరికల్ (నారాయణపేట): గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు మండలంలోని మాధ్వార్ గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మంగళవారం గ్రామస్తులు తిర్మానం చేశారు. మద్య నిషేధ సమయంలో గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ.40వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ పుణ్యశీల తిర్మానించారు. మహిళా సర్పంచ్ ముందడుగు.. మరికల్ మండలం మాధ్వార్‌లో 845 కుటుంబాలు ఉండగా 3,568 మంది జనాబా ఉంది. ఇటీవల కాలంలో గ్రామంలో మద్యం సేవించి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్న యువతను మార్చేందుకు మాహిళ సర్పంచ్ పుణ్యశీల ముందుగా నడుం బిగించారు. ఆమె పిలుపు అందుకున్న మిగితా ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు, మహిళలు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిర్మానించారు. ఇందుకు గ్రామస్తులు సైతం ముందుకు వచ్చి తమ సంసారాలు బాగుపడుతాయంటే ఇంతకంటే ఏం కావాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట మద్యం నిషేదిస్తున్నట్లు ప్రతిజ్ఞా చేశారు. ఆగష్టు 15 తర్వాత మాధ్వార్‌లో ఎవరైన మద్యం అమ్మకాలు చేప్పడితే రూ. 40 వేలు జరిమాన విధిస్తామని తిర్మానం చేశారు. అంతలో ఏమైన మద్యం మిగిలివుంటే ఆగస్టు 14 వరకు విక్రయించుకోవాలని వారికి వెసులుబాటు కల్పించి మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. యువత పెడదారి పట్టొద్దనే నిర్ణయం యువత పెడదారి పట్టకుండా ఉండేందుకే గ్రామంలో మద్యం నిషేదించడం జరిగింది. ఇటీవల కాలంలో గ్రామంలో యువకులతో పాటు మహిళలు కూడా మద్యం సేవించి అలర్లకు కారణమవుతున్నారు. మాధ్వార్ గ్రామాన్ని ఒక ప్రశాంతమైన గ్రామంగా తీర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. – పుణ్యశీల, సర్పంచ్, మాధ్వార్ -
తిన్నది ఎవరో తెలవడం లేదు..?
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : మండలంలో టీడీపీ ప్రభుత్వం ప్రచార యావతో నిర్వహించిన జన్మభూమి సభల నిర్వహణ నిధులు ఇటీవలే విడుదలయ్యాయి. కానీ వాటిని ఇప్పటికీ పంచాయతీలకు పంపిణీ చేయలేదు. ఆ నిధుల ఖర్చులో మండల పంచాయతీ అధికారి చేతివాటం చూపినందునే పంపిణీ జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వం 2019 జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి సభలు నిర్వహించింది. అప్పట్లో దీనికోసం నిధులు వెంటనే ఇవ్వలేదు. దాంతో పంచాయతీ కార్యదర్శులే చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో కార్యదర్శుల పైనే ఈ భారం పడింది. ప్రతీ గ్రామంలో సభ కోసం 3 షామియానాలు, 500 కుర్చీలు, బల్లలు, వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, సభ నిర్వహణపై ముందురోజు ఆటోలతో ప్రచారం, వైద్య శిబిరాలు ఉన్న చోట వాటికి ప్రత్యేకంగా షామియానాల ఏర్పాటు.. ఇలా ఒక సభ నిర్వహణకు తడిసిమోపెడు ఖర్చులయ్యాయి. ఇవన్నీ అయ్యాక అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భోజనాలకు అదనంగా మరింత ఖర్చు అయింది. సభకు రూ.20 నుంచి రూ.25వేల వరకు ఖర్చు.. సభల నిర్వహణ కోసం ఒక్కోదానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు అయినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇటీవల పంచాయతీకి రూ.5వేల చొప్పున 22 పంచాయతీలకు రూ.1.10 లక్షలు విడుదల చేసినట్లు పంచాయతీ అధికారి రికార్డుల్లో నమోదు చేసినట్లు ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా మాకు అందలేదని కార్యదర్శులు చెబుతున్నారు. వాటి కోసం ఎంపీడీఓను కార్యదర్శులు అడగ్గా ఆయన ఈఓపీఆర్డీకి చెక్ రాసి ఇచ్చానని, ఆయన్నే ఆడగాలని సూచించారు. ఈఓపీఆర్డీని అడగ్గా పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. ఈఓపీఆర్డీ చేతివాటం చూపినట్లు కార్యదర్శులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఇచ్చారు.. తీసుకున్నారు..!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో గురువారం స్థానిక పోస్టాఫీసు వద్ద ఆసరా పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించారు. ఆ వెంటనే పోస్టాఫీసు పక్కనే గ్రామ పంచాయతీ ఉద్యోగి ఒకరు కూర్చొని గ్రామ పంచాయతీ పన్నులను వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి పన్నులు వసూలు చేయొద్దని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు అందుకు విరుద్ధంగా ఇలా పన్నులు వసూలు చేయడం గమనార్హం. -
పంచాయతీల్లో కో ఆప్షన్ మెంబర్
సాక్షి, మూసాపేట: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీలో కో ఆప్షన్ సభ్యులకు చోటు కల్పించనున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో నూతనంగా కో ఆప్షన్ సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. గ్రామ పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా కో ఆప్షన్ సభ్యులను భాగస్వామ్యం చేయనున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 500 జనాభా కలిగి ఉన్న శివారు గ్రామాలు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాలన వికేంద్రీకరణలో భాగంగా మూసాపేటను నూతనంగా ఏర్పాటు చేయగా అందులో 12 గ్రామ పంచాయతీల నుంచి 15 గ్రామ పంచాయతీలుగా మూసాపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ 15 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీలో ముగ్గురి చొప్పున 45 మందిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వారికి వార్డు సభ్యులతో సమానంగా కో ఆప్షన్ సభ్యులకు కూడా హోదా వస్తుంది. మూడు విభాగాల్లో సభ్యుల ఎన్నిక.. గ్రామ పంచాయతీ పాలక వర్గంలో కో ఆప్షన్ సభ్యులను మూడు విభాగాల్లో ఎన్నుకుంటారు.ఆ గ్రామంలో రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ,గ్రామ పంచాయతీకి ఆర్థికంగా సాయం చేసిన దాతకు కో ఆప్షన్ సభ్యుల కోటాలో అవకాశం కల్పిస్తారు. గ్రామ అభివృద్ధిలో కో ఆప్షన్ సభ్యుల సలహాలు, సూచనలు చేయవచ్చు. గ్రామాల్లో పోటా పోటీ.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. రిజర్వేషన్, సామాజిక వర్గం కలిసి రాక కొందరు, ఖర్చు చేయలేక మరికొందరు పోటీకి దూరంగా ఉన్న వాళ్లు కో ఆప్షన్ పదవులను దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఊహించని వరం ఊరికి నేతృత్వం!
కాకా రుద్రజారాణి సాధారణ విద్యార్థిని. ఎలాంటి రాజకీయ వాసనలు, వారసత్వాలు లేని కుటుంబం. తండ్రి (ఇప్పుడు లేరు), తల్లి, అన్న.. గౌరారంలో ఇదీ ఆమె కుటుంబం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామ పంచాయతీ ఇటీవలే ఎస్టీ స్థానంగా రిజర్వ్ అయింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్లదొక్కటే గిరిజన కుటుంబం. తల్లి అంగన్వాడీ కార్యకర్త కావడంతో ఎస్టీ మహిళ కోటాలో గౌరారం సర్పంచ్ అయ్యే అవకాశం రాణికే వచ్చింది. రుద్రజారాణి పెనుబల్లిలో డిగ్రీ పూర్తి చేసి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. డిగ్రీ పూర్తయ్యాక పిల్లలకు పాఠాలు బోధించాల్సిన రుద్రజారాణికి డిగ్రీ కాకుండానే గ్రామాన్ని ఏలి, అభివృధ్ధి చేసుకునే అదృష్టం ఇలా అనుకోకుండా వరించింది. గ్రామ పంచాయతీలో ఒకే గిరిజన (కోయ తెగకు) కుటుంబం ఉండటంతో పోటీ అనేది లేకుండా పోయింది. ఏకగ్రీవం కావడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ గ్రామానికి పది లక్షల నజరానా దక్కనుంది. గ్రామస్థాయిలో అత్యున్నత పదవి అయిన సర్పంచ్ పీఠం ఆమెకు అనుకోని బహుమతిలా లభించినందుకు తల్లి కాకా సుజాత, సోదరుడు రాణా ప్రతాప్ సంతోషపడుతుండగా, గ్రామస్తులు కూడా ఆమె అదృష్టాన్ని చూసి హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు. విడిపోవడం వరమైంది గతంలో గౌరారం గ్రామ పంచాయతీలో పార్థసారథిపురం, ఉప్పల చెలక గ్రామాలు ఉండేది. అయితే ఇటీవల గ్రామ పంచాయతీల పెంపులో భాగంగా ప్రభుత్వం రెండింటిని విడదీసి రెండు గ్రామ పంచాయతీలుగా చేసింది. గతంలో గిరిజన కుటుంబాల వారే ఈ పంచాయతీని ఏలేవారు. ప్రస్తుతం గౌరారం విడిపోయి 997 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీగా అవతరించింది. నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ఈ పంచాయతీ పరిధిలో ఉప్పలచలక, వావిలపాడు గ్రామాలున్నాయి. ఇక్కడ 270 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ కాకా సుజాతకు చెందిన గిరిజన కుటుంబమే ఉంది. ఫలితంగా ఆ కుటుంబానికి చెందిన రుద్రజారాణికే సర్పంచ్ పదవి దక్కింది. ఫలించిన తండ్రి కల రుద్రజారాణి తండ్రి కాకా వెంకటేశ్వర్లు పెనుబల్లి మండలం లింగగూడెం వీఆర్వోగా పనిచేసేవారు. అనారోగ్యం కారణంగా గత ఏడాది మృతి చెందారు. దీంతో ఆ ఉద్యోగంకుమారుడు రాణాప్రతాప్‌కు వచ్చింది. అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న తన భార్యను ఎలాగైనా గ్రామ పంచాయతీ సర్పంచ్ చేయాలని భర్త వెంకటేశ్వర్లు బతికున్న రోజుల్లో ఎన్నో కలలు కన్నాడు. ఆ కల ఇప్పుడు తన కూతురి రూపంలో నిజమైంది. ఎలాంటి పోటీ లేకుండానే సర్పంచ్ పీఠం కూతురికి దక్కింది. – ఎం.ఏ.సమీర్, సాక్షి నాన్న కోరిక నేను నెరవేరుస్తా అమ్మను సర్పంచ్ చేయాలని నాన్న ఎప్పుడూ అనేవారు. కానీ అప్పట్లో నాన్న కోరిక నెరవేరలేదు. నేను నాన్న కల నిజం చేస్తున్నాను. బీఈడీ అభ్యసిస్తూనే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. గ్రామ అభివృద్ధికి పాటు బడతా. నాకు రాజకీయాలు తెలియవు. అయినా ఏ సమస్యలు ఉన్నా పరిష్కారానికి నావంతు కృషి చేస్తా. – రుద్రజారాణి -
గిరి రాజులు
సాక్షి, కొత్తగూడెం: స్థానిక పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్విభజన చేసింది. దీంతో జిల్లాలో ఉన్న 205 గ్రామ పంచాయతీల సంఖ్య ఏకంగా 479కి పెరిగింది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ పరిధిలో ఉన్న భద్రాద్రి జిల్లాలో అత్యధిక ప్రాంతం ఏజెన్సీ పరిధిలోకే వస్తుంది. నిబంధనల మేరకు ఈ ప్రాంతాల్లో ప్రతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం గిరిజనులకే కేటాయించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం 479లో 454 గ్రామపంచాయతీలు ఎస్టీలకు కేటాయించారు. అశ్వాపురం, అశ్వారావుపేట, బూర్గంపాడు, దమ్మపేట, సుజాతనగర్ మండలాల్లోని 25 గ్రామపంచాయతీలు మాత్రం నాన్–ఏజెన్సీ పరిధిలోకి వస్తున్నాయి. గతంలో జిల్లాలో 205 పంచాయతీలు ఉండగా వాటిలో 190 ఏజెన్సీ, 15 నాన్ ఏజెన్సీ పంచాయతీలుగా ఉండేవి. పంచాయతీరాజ్ చట్ట సవరణ అనంతరం చేపట్టిన పునర్విభజన ప్రకారం గతంలో ఉన్న 205 పంచాయతీలు 479కి పెరిగాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో 10 నాన్ షెడ్యూల్డ్ గా ఉన్నాయి. దీంతో గతంలో 15గా ఉన్న ఆ పంచాయతీల సంఖ్య ప్రస్తుతం 25కు చేరుకున్నాయి. అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం, నెల్లిపాక, ఆనందపురం, మల్లెలమడుగు, మొండికుంట, అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు, అశ్వారావుపేట, కేసప్పగూడెం, పాతఅల్లిగూడెం, ఊట్లపల్లి, పేరాయిగూడెం, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, బూర్గంపాడు, టేకులచెరువు, దమ్మపేట మండలంలోని జమేదార్బంజర, దమ్మపేట, కొమ్ముగూడెం, లింగాలపల్లి, సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, కోమట్లపల్లి, మంగపేట, నిమ్మలగూడెం, సుజాతనగర్, నర్సింహసాగర్ పంచాయతీలు నాన్ షెడ్యూల్డ్ పరిధిలోకి వస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక గిరిజన పంచాయతీలు భద్రాద్రి జిల్లాలోనే ఉండడంతో ఇక్కడ స్థానిక పాలన ఎస్టీల చేతుల్లో ఉండనుంది. జిల్లాలో 4,232 వార్డులు... పునర్విభజన తర్వాత జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో 12 పంచాయతీలు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో 10, అశ్వాపురంలో 24, అశ్వారావుపేటలో 30, బూర్గంపాడులో 17, చంద్రుగొండలో 14, చర్ల మండలంలో 26, చుంచుపల్లి మండలంలో 18, దమ్మపేటలో 31, దుమ్ముగూడెంలో 37, గుండాల మండలంలో 11, జూలూరుపాడులో 24, కరకగూడెం మండలంలో 16, లక్ష్మీదేవిపల్లిలో 31, మణుగూరులో 14, ములకలపల్లిలో 20, పాల్వంచలో 36, పినపాకలో 23, సుజాతనగర్ మండలంలో 20, టేకులపల్లిలో 36, ఇల్లెందు మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 479 గ్రామ పంచాయతీల్లో కలిపి 4,232 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, కొత్తగూడెం, భద్రాచలం మినహా మిగిలిన 21 మండలాల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలాల్లోని 479 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 7,68,805 మంది జనాభా ఉన్నారు. ఇందులో పురుషులు 3,83,693 మంది, మహిళలు 3,85,112 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 3,57,207 కాగా ఇందులో పురుషులు 1,77,501, మహిళలు 1,79,706 మంది ఉన్నారు. ఎస్సీ జనాభా 92,551 కాగా ఇందులో పురుషులు 46,424 మంది, మహిళలు 46,127 మంది ఉన్నారు. ఎస్టీ, ఎస్సీ యేతరులు 3,19,047 ఉండగా ఇందులో పురుషులు 1,59,768 మంది, మహిళలు 1,59,279 మంది ఉన్నారు. ఇక ఈ 479 పంచాయతీల్లో 25 పంచాయతీలు నాన్–షెడ్యూల్డ్ పరిధిలో ఉన్నాయి. వీటిలో మొత్తం 67,014 మంది ఉండగా, పురుషులు 33,298 మంది, మహిళలు 33,716 మంది ఉన్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీల పరిధిలో మొత్తం 8,42,096 మంది జనాభా ఉండగా ఇందులో బూర్గంపాడు మండ లంలోని సారపాక, భద్రాచలంను గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో సత్యనారాయణపురం, 24 ఏరియాల(సింగరేణి కాలనీ)ను విలీనం చేశారు. దీంతో ఈ రెండు గ్రామాల్లోని 3,035 మంది జనాభా, మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ అయిన భద్రాచలంలోని 50,087 మంది, సారపాకలోని 20,169 మంది జనాభాను మినహాయించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో 7,68,805 మంది జనాభా ఉన్నట్లు తేల్చారు. -
గ్రామీణాభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాం!
సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచ్ల అధికారాలు, బాధ్యతలతోపాటు పంచాయతీలకు నిధులు పెంచుతూ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం ద్వారా గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. శాసనసభలో శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ పద్దులపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. శాసనసభ్యుల గృహాలు సిద్ధం: తుమ్మల రాష్ట్ర శాసనసభ్యుల కోసం నిర్మించిన 120 గృహాల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల కోసం 44 నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం కొత్తగూడెం 720 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించే ప్రతిపాదనలు ఉన్నా యని విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. తొమ్మిది శాఖల పద్దులకు ఆమోదం శాసనసభ శుక్రవారం ఆర్అండ్బీ, నీటిపారు దల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, పురపాలక, రెవెన్యూ, రవాణా, ఎౖMð్సజ్ శాఖల బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపింది. -
ఏళ్లుగా వెట్టి చాకిరీ..!
గుడిహత్నూర్ : గ్రామ పంచాయతీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగు కన్పించడం లేదు. ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా పని చేస్తూ.. నేడో.. రేపో తమను గుర్తించక పోతారా..? అనే ఆశతో కడుపు నింపని జీతాలతో దయనీయ స్థితిలో ఉన్నారు. ఇటు పని భారాన్ని.. అటు కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఈ పని వదిలి బయటకు వెళ్లలేక, మరో పని చేయలేక సతమతమవుతున్నారు. అధ్వానంగా కార్మికుల బతుకులు పంచాయతీల్లో పని చేసే కారోబార్లు, దినసరి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, వివిధ పనుల కోసం నియమించిన కామాటీల పరిస్థితి దారుణంగా ఉంది. వీరంతా గ్రామాల్లో కాలువల నిర్వహణ, చెత్త సేకరించి తరలించడం, సమయానికి తాగునీరు అందించడం, పన్నులు వసూలు చేయడం, పశు కళేబరాలను తరలించడంతో పాటు గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎంతో ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నారు. కనీస వేతనాలు కరువు... పంచాయతీల్లో కారోబార్లు 33ఏళ్ల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నా వీరికి నెలకు కేవలం రూ.5వేల దాటలేదు. మరి కొందరికి రూ. 2వేలు మాత్రమే ఇస్తున్నారు. గతంలో తమ సమస్యల పరిష్కారానికై ఉమ్మడి జిల్లాలోని 866 పంచాయతీల్లోని 2700 మంది పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేశారు. చర్చలు జరిపిన ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేటికీ కార్యరూపం దాల్చుకోలేదు. సాధారణ ఉపాధి కూలీ సైతం ఒక పూట పని చేసి రోజుకు రూ.200 సంపాదిస్తున్నాడు. కానీ పంచాయతీ కార్మికుల పంప్ ఆపరేటర్ల వేతనం నెలకు రూ.2500 దాటడం లేదు. ఇకనైనా పంచాయతీలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రతో పాటు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వెయ్యితో ముగియనుంది 1978 మార్చి 1 నుంచి పంచాయతీ కారోబార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ప్రస్తుతం రూ. వెయ్యి జీతం ఇస్తున్నారు. దీన్ని బట్టి నా గత జీతం ఎంతో అర్థమయ్యే ఉంటుంది. ఏనాటికైనా ప్రభుత్వం గుర్తించకుండా పోతుందా? అనే నమ్మకంతో ఉన్నా. 40 సంవత్సరాలు కావొస్తోంది. నా కల..కల్లగానే మిగిలేలా ఉంది. – ధనూరే మారుతిరావు, కొల్హారీ కారోబార్ సర్వీసు 33 ఏళ్లు.. జీతం రూ.5వేలే 33 ఏళ్లుగా మేజర్ పంచాయతీ కారోబారుగా పని చేస్తున్నా. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ నుంచి పంచాయతీ రికార్డులు, పన్నుల వసూలు, ఆదాయ వ్యయాల నిర్వహణతో పాటు రోజూ కార్యాలయంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నం. వేతనం రూ.5వేలు దాటలేదు. వయస్సు మీదపడింది. – అమీల్ అలీ, కారోబార్, గుడిహత్నూర్ బతకడం భారంగా ఉంది మురికి తీయడం, రోడ్లు ఊడ్చడం చెత్తను తరలించడం ఇలా దినమూ, రాత్రీ అనకుండా పని చేయాల్సి ఉంటుంది. అంతా చేస్తే నెలకు రూ.4వేలు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదు. ఇప్పుడున్న జీతం తిండికీ మందులకే సరిపోతలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ కార్మికులను పట్టించుకోవాలి. – సుద్దాల లింగన్న, పారిశుధ్య కార్మికుడు -
తండాలకు మహర్దశ!
ఊర్కొండ : రాష్ట్ర ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చేందుకు ఆదేశా లు జారీచేయడంతో మండల స్థాయిలో తండాలపై కసరత్తు జరుగుతుంది. ఈ విషయంపై ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పం చాయతీ కార్యదర్శులు, ఆయా తండా ల్లో పర్యటించి గిరిజనుల అభిప్రాయా లు తెలుసుకున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మండలంలో ప్ర స్తుతం 12 గ్రామ పంచాయతీల ద్వారా మరో 5 కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. అన్ని పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. మండల అధికారులు, 5 గ్రా మ పంచాయతీల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గ్రామ పంచా యతీ ఏర్పడటానికి జనా భా, రెవెన్యూ, గ్రామాల మధ్య దూరం, సమానంగా గ్రామ నక్షను అధికారులు అందించారు. ఇవే 5 కొత్త గ్రామాలు.. మండలంలోని ఠాగూర్తండా, బాల్యలోక్తండా, తిమ్మన్నపల్లి, నర్స ంపల్లి, గుణగుంట్లపల్లి గ్రామాలను కొత్త గా ఏర్పడే పంచాయతీలకు ప్రతిపాదన లు పంపారు. ఇది వరకు ఊర్కొండపేట పంచాయతీలో ఉన్న గుణగుంట్లపల్లి, జంగాలకాలనీ, రెడ్యాతండాలను కలిపి గుణగుంటపల్లి పం చాయతీగా ఏర్పాటు కానుంది. నర్సంపల్లి ప్రత్యేక పంచాయతీ, రేవల్లి గ్రామ ంలో ఉన్న తిమ్మన్నపల్లిని ప్రత్యేక పం చాయతీ కానుంది. ఠాగూర్తండా, బూర్వానికుంట, మఠంతండా, అమ్మపల్లి తండాలను కలుపుతూ ఒక పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. బాల్యలోక్తండా, బావాజీతండాలను కలుపుతూ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు మండల స్థాయి అధికారులు ప్రతిపాదనలు అందించారు. రోడ్డెక్కిన గిరిజనులు.. ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మండలంలోని ఊర్కొండపేట పం చాయతీ పరిధిలోని నాలుగు తం డాలు అమ్మపల్లితండా, బూర్వా నికుంట తండా, మఠంతండా, ఠాగూర్తండాలను కలుపుతూ పంచాయ తీగా ఏర్పాటు చేయాలని అధికారు లు ప్రతిపాదనలు పంపించారు. అయితే అమ్మపల్లితండా, ఠాగూర్తండా వాసులు తమ తండాలను ఒ క పంచాయతీగా చేయాలని కోరు తూ రోడ్డెక్కారు. రెండు తండాలవాసులు మంత్రులు, జిల్లా అధికారులను సైతం కలిసినట్లు సమాచారం. సమస్యలు తీరుతాయి.. ఎన్నో ఏళ్లుగా గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం సంతోషం. తండావాసులు గ్రామాలకు వెళ్లాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు నూతన పంచాయతీలతో సమస్యలు తొలగుతాయి. పాలన సక్రమంగా అందుతుంది. – రమేష్‌నాయక్, రెడ్యాతండా అభివృద్ధి చెందుతుంది.. గత కొన్నేళ్లుగా మా తండా వేరే పంచాయతీలో ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మా గ్రామంపై చిన్నచూపు చూసేవారు. ఇప్పుడు నూతన పంచాయతీ ఏర్పాటు కావడం వల్ల గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. – రాధాకృష్ణ, తిమ్మన్నపల్లి -
సర్పంచ్ల చెక్ పవర్ కట్..!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లను ప్రభుత్వం మరోసారి అవమానించింది. పారదర్శకత పేరిట చెక్కులపై సర్పంచ్‌లు సంతకం చేసే అధికారానికి షరతులు పెట్టింది. సర్పంచ్ ఒక్కరే కాకుండా పంచాయతీ కార్యదర్శి కూడా చెక్కుపై సంతకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి.. కొత్తగా 21 వేల పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి సోమవారం వరకు కూడా ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులు చెక్కులపై సంతకాలు చేస్తూ వచ్చారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ పథకాల నిధుల వ్యయానికి సంబంధించి ఇచ్చే చెక్కులపై సర్పంచ్‌తోపాటు, గ్రామ కార్యదర్శి విధిగా సంతకం చేయాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు. కాగా, సర్పంచ్‌లు ఒక్కరికే చెక్ పవర్ కల్పించకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా అవకాశం కల్పించడాన్ని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించడమేనని మండిపడ్డారు. -
సర్పంచ్ల చెక్ పవర్ కట్..!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లను ప్రభుత్వం మరోసారి అవమానించింది. పారదర్శకత పేరిట చెక్కులపై సర్పంచ్‌లు సంతకం చేసే అధికారానికి షరతులు పెట్టింది. సర్పంచ్ ఒక్కరే కాకుండా పంచాయతీ కార్యదర్శి కూడా చెక్కుపై సంతకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి.. కొత్తగా 21 వేల పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి సోమవారం వరకు కూడా ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులు చెక్కులపై సంతకాలు చేస్తూ వచ్చారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ పథకాల నిధుల వ్యయానికి సంబంధించి ఇచ్చే చెక్కులపై సర్పంచ్‌తోపాటు, గ్రామ కార్యదర్శి విధిగా సంతకం చేయాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు. కాగా, సర్పంచ్‌లు ఒక్కరికే చెక్ పవర్ కల్పించకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా అవకాశం కల్పించడాన్ని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించడమేనని మండిపడ్డారు.