ఊహించని వరం  ఊరికి నేతృత్వం! | Womans quota is a chance to become a sarpanch | Sakshi
Sakshi News home page

ఊహించని వరం  ఊరికి నేతృత్వం!

Jan 18 2019 1:25 AM | Updated on Jan 18 2019 1:26 AM

Womans quota is a chance to become a sarpanch - Sakshi

కాకా రుద్రజారాణి సాధారణ విద్యార్థిని. ఎలాంటి రాజకీయ వాసనలు, వారసత్వాలు లేని కుటుంబం. తండ్రి (ఇప్పుడు లేరు), తల్లి, అన్న..  గౌరారంలో ఇదీ ఆమె కుటుంబం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామ పంచాయతీ ఇటీవలే ఎస్‌టీ స్థానంగా రిజర్వ్‌ అయింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్లదొక్కటే గిరిజన కుటుంబం. తల్లి అంగన్‌వాడీ కార్యకర్త కావడంతో ఎస్టీ మహిళ కోటాలో గౌరారం సర్పంచ్‌ అయ్యే అవకాశం రాణికే వచ్చింది. రుద్రజారాణి  పెనుబల్లిలో డిగ్రీ పూర్తి చేసి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

డిగ్రీ పూర్తయ్యాక పిల్లలకు పాఠాలు బోధించాల్సిన రుద్రజారాణికి డిగ్రీ కాకుండానే గ్రామాన్ని ఏలి, అభివృధ్ధి చేసుకునే అదృష్టం ఇలా అనుకోకుండా వరించింది. గ్రామ పంచాయతీలో ఒకే గిరిజన (కోయ తెగకు) కుటుంబం ఉండటంతో  పోటీ అనేది  లేకుండా పోయింది. ఏకగ్రీవం కావడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ గ్రామానికి పది లక్షల నజరానా దక్కనుంది. గ్రామస్థాయిలో అత్యున్నత పదవి అయిన సర్పంచ్‌ పీఠం ఆమెకు అనుకోని బహుమతిలా లభించినందుకు తల్లి కాకా సుజాత, సోదరుడు రాణా ప్రతాప్‌ సంతోషపడుతుండగా, గ్రామస్తులు కూడా ఆమె అదృష్టాన్ని చూసి హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు. 

విడిపోవడం వరమైంది
గతంలో  గౌరారం గ్రామ పంచాయతీలో  పార్థసారథిపురం, ఉప్పల చెలక గ్రామాలు  ఉండేది. అయితే ఇటీవల గ్రామ పంచాయతీల పెంపులో భాగంగా ప్రభుత్వం రెండింటిని విడదీసి  రెండు గ్రామ పంచాయతీలుగా చేసింది. గతంలో గిరిజన కుటుంబాల వారే ఈ పంచాయతీని ఏలేవారు. ప్రస్తుతం గౌరారం విడిపోయి 997 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీగా అవతరించింది. నేషనల్‌ హైవేకు ఆనుకొని ఉన్న  ఈ పంచాయతీ పరిధిలో  ఉప్పలచలక, వావిలపాడు గ్రామాలున్నాయి. ఇక్కడ   270  కుటుంబాలు ఉన్నాయి.  ఇక్కడ కాకా సుజాతకు చెందిన గిరిజన కుటుంబమే ఉంది. ఫలితంగా ఆ కుటుంబానికి చెందిన రుద్రజారాణికే సర్పంచ్‌ పదవి దక్కింది.   

ఫలించిన తండ్రి కల
రుద్రజారాణి తండ్రి  కాకా వెంకటేశ్వర్లు పెనుబల్లి మండలం లింగగూడెం వీఆర్వోగా పనిచేసేవారు. అనారోగ్యం కారణంగా గత ఏడాది మృతి చెందారు. దీంతో ఆ ఉద్యోగంకుమారుడు రాణాప్రతాప్‌కు వచ్చింది.  అంగన్‌ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న  తన భార్యను ఎలాగైనా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ చేయాలని భర్త వెంకటేశ్వర్లు  బతికున్న రోజుల్లో ఎన్నో కలలు కన్నాడు. ఆ కల ఇప్పుడు  తన కూతురి రూపంలో  నిజమైంది. ఎలాంటి పోటీ లేకుండానే సర్పంచ్‌ పీఠం కూతురికి దక్కింది. 

– ఎం.ఏ.సమీర్, సాక్షి

నాన్న కోరిక నేను నెరవేరుస్తా  
అమ్మను సర్పంచ్‌ చేయాలని నాన్న ఎప్పుడూ అనేవారు. కానీ అప్పట్లో  నాన్న కోరిక నెరవేరలేదు. నేను  నాన్న కల  నిజం చేస్తున్నాను. బీఈడీ అభ్యసిస్తూనే  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. గ్రామ అభివృద్ధికి పాటు బడతా. నాకు రాజకీయాలు తెలియవు. అయినా ఏ సమస్యలు ఉన్నా పరిష్కారానికి నావంతు కృషి చేస్తా.   
– రుద్రజారాణి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement