వీణవంక (హుజూరాబాద్): తనను ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎంపిక చేస్తామని మొదట ప్రకటించి.. తీరా మరొకరిని బరిలో దింపారంటూ మనస్తాపంతో కరీంనగర్ జిల్లా వీణవంక మం డలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన అంగిడి రాధ అనే మహిళ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు.. హిమ్మత్‌నగర్ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పంచాయతీకి మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన అంగిడి రాధను బరిలో నిలపాలని టీఆర్‌ఎస్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు సూచించారు. కూలీ పనులు చేసుకునే రాధ ఇందుకు ఒప్పుకుంది.
రాధను ఏకగ్రీవం చేయాలని పార్టీ కార్యకర్తలతోపాటు కులసంఘాలు తీర్మానించారు. నామినేషన్ సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన మరో మహిళతో నామినేషన్ వేయించారు. తనను ఏకగ్రీవం చేస్తామని చెప్పి మరో అభ్యర్థిని బరిలో నిలపడంతో విషయాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ.. పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు రాధకు బదులు మరో అభ్యర్థికి ప్రచారం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. ఇది గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment