సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో ఆయన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. ఓ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన ‘సార్’.. కార్పొరేట్ కళాశాలలతో పోటీపడే స్థాయి విద్యాసంస్థలకు అధిపతి. ఇంటర్మీడియెట్ నుంచి ఇంజినీరింగ్ కళాశాలల వరకు ఆయన విద్యా వ్యాపారం విస్తరించింది. అంతటి పెద్ద మనిషి ప్రభుత్వ నిబంధనలను కాలరాశారు. కరీంనగర్ శివార్లలోని విలువైన స్థలంలోని విద్యాసంస్థల ఆవరణలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం జరిపిన నిర్మాణానికి గ్రామ పంచాయతీ, లేదా పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి తీసుకోవాలనే చిన్న లాజిక్‌ను ఆయన మరిచారు. ఏకంగా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగంతస్థుల భవనాన్ని నిర్మించారు. కళాశాల పరిధిలోని తన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి.. ఆవరణలో తారు రోడ్లను వేయిస్తున్నారు. ‘నన్ను అడిగే వారెవరు?’ అనే ధోరణిలో ‘సార్’ సాగిస్తున్న నిర్మాణాల గురించి తెలిసినా గ్రామ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి చూసీ చూడనట్టుగానే వదిలేశారు. కరీంనగర్ పట్టణాభివృద్ధి సంస్థ ‘సుడా’ ఇటువైపే చూడలేదు.
బొమ్మకల్ చౌరస్తాలో జీ+3 నిర్మాణం...
కరీంనగర్ బొమ్మకల్ చౌరస్తాలో బైపాస్‌ను ఆనుకొని ఉన్న భూములను గతంలోనే కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి తన గ్రూప్ విద్యాసంస్థలను నెలకొల్పారు. ఇదే క్రమంలో తెలిసో, తెలియకో అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంత భాగం కూడా ఆయన ఆధీనంలోకి వెళ్లింది. దీనిపై బొమ్మకల్ గ్రామ పంచాయతీకి చెందిన కొందరు వార్డు సభ్యులు, లోక్‌సత్తా వంటి సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ భూమిని సర్వే చేయించారు. కళాశాల స్థలానికి, వ్యవసాయ భూమికి మధ్యన సర్వే నంబర్ 28లో ఉన్న సుమారు ఎకరం 26 గుంటల భూమి ప్రభుత్వానిదని తేల్చారు. ఈ సర్కారు భూమి చుట్టూ గోడ కడతామన్న జిల్లా అధికారులు రాతి ఖనీలు పాతి, ప్రభుత్వ స్థలమనే బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. అదే సమయంలో కళాశాల ప్రాంగణంలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం జరుపుకుంటున్న మూడంతస్థుల భవనం గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నిర్మాణం కూడా పూర్తయిన ఈ భవనంలో అంతర్జాతీయ స్థాయి స్కూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
గ్రామ పంచాయతీ, సుడా అనుమతి లేకుండా...
బొమ్మకల్ చౌరస్తాలోని ప్రజాప్రతినిధికి చెందిన విద్యాసంస్థల క్యాంపస్‌లో గత ఏడాది జీ+3 అంతస్థుల్లో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో శరవేగంగా నిర్మాణం పూర్తయింది. సుమారు 20వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో నిర్మాణం పూర్తయిన ఈ భవనానికి బొమ్మకల్ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేదు. భవన నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి దరఖాస్తు కూడా చేసుకోలేదని వార్డు సభ్యుడు తోట కిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై డీపీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.సురేందర్‌ను ప్రశ్నించగా అనుమతి లేని విషయాన్ని ‘సాక్షి’తో ధ్రువీకరించారు. తాను రెండున్నర నెలల క్రితమే బదిలీపై వచ్చానని, అంతకు ముందున్న కార్యదర్శి అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలని నోటీస్ ఇచ్చేందుకు వెళ్లగా, కళాశాల సిబ్బంది అనుమతించలేదని తెలిసిందన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) పరిధిలో ఉన్న ఈ స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలన్నా ఆ సంస్థ అనుమతి తప్పనిసరి. అయినా ఎలాంటి అనుమతి లేకుండానే భవన నిర్మాణం పూర్తవడం విశేషం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ‘సార్’ను అడిగే వారే లేకుండా పోయారు.
ప్రభుత్వ ఆధీనంలోని బావి నుంచే పొలాలకు నీరు
ప్రజాప్రతినిధి కొనుగోలు చేసిన భూముల్లో కొన్ని ఎకరాల్లో విద్యాసంస్థలు నడుస్తుండగా, మరికొన్ని ఎకరాల్లో వ్యవసాయం చేయిస్తున్నారు. ఈ భూముల కోసం తవ్విన పాత వ్యవసాయ బావిని ఆధునికీకరించారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారుల సర్వేలో ఆ బావి కూడా సర్కారు శిఖం భూమిలో ఉన్నట్లుగా తేలింది. సర్కారు భూమి చుట్టూ ప్రహరీ కట్టాలని భావించినప్పటికీ, ఒత్తిళ్ల మేరకు ఖనీలతో వదిలేశారు. ఇప్పుడు అదే వ్యవసాయ బావి ప్రజాప్రతినిధికి చెందిన వరి పొలాలకు, కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న స్కూల్ భవనం, రోడ్లకు నీటిని సరఫరా చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు మోటార్లు కూడా పని చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment