illigal constructions
-
అక్కడ టీడీపీ, జనసేన లేవు.. సజావుగా అక్రమ కట్టడాల కూలివేత!
కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్‌ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్‌ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు. దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది. కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు. దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా? చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు. అధికారం పోయాక ఎల్లో వాయిస్‌లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు. నొయిడాలో ట్విన్ టవర్స్‌ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి. -
నోయిడా ట్విన్ టవర్స్ ఎఫెక్ట్.. ఐటీ విప్రో, ఎకోస్పేస్ భవనాలు కూల్చివేత!
బనశంకరి: బెంగళూరులో వరద బాధిత ప్రాంతాల్లో బీబీఎంపీ, రెవెన్యూ శాఖలు చేపట్టిన కబ్జా కట్టడాల తొలగింపు మంగళవారం రెండవరోజుకు చేరుకుంది. రాజకాలువలు ఆక్రమించుకుని నిర్మించిన భవనాలు, ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో రియల్ వ్యాపారులు, కట్టడ యజమానుల్లో కలవరం మొదలైంది. జాబితాలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులు - మహదేవపుర వలయంలో వివిధ బిల్డర్లు, ఐటీ పార్కులవారు ఆక్రమణలకు పాల్పడిన స్థలాల జాబితాను బీబీఎంపీ విడుదల చేసింది. - బాగమనె టెక్ పార్కు, రెయిన్బో డ్రైవ్ లేఔట్, విప్రో, ఎకో స్పేస్, బెళ్లందూరు, హుడి, సొణ్ణెహళ్లి గోపాలన్, దియా పాఠశాల, కొలంబియా ఏషియా ఆసుపత్రి, న్యూ హొరైజన్ కాలేజీ, ఆదర్శ రిట్రీట్, ఏషియన్ దివ్యశ్రీ, ప్రెస్టేజ్, సాలార్పురియా, నలపాడ్ డెవలపర్స్‌తో పాటు మహమ్మద్ నలపాడ్ కు చెందిన ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. అడ్డుగా 700 కట్టడాలు సుమారు 700 కు పైగా అక్రమ కట్టడాలు నగరవ్యాప్తంగా వర్షం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని , కంపెనీలు కబ్జాకు పాల్పడిన స్థలాలను తొలగిస్తామని బీబీఎంపీ అధికారులు తెలిపారు. 2.5 నుంచి 5 మీటర్ల ప్రభుత్వ స్థలం రాజకాలువకు వదిలిపెట్టాలి. ఇందులో ప్రముఖులు ఆక్రమణకు పాల్పడిన స్థలాలు ఉన్నాయని, వీటిని తొలగించి రక్షణ గోడను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మహదేవపుర వలయంలో శాంతినికేతన్ లేఔట్, స్పైసి గార్డెన్, పాపయ్యరెడ్డి లేఔట్, చల్లఘట్ట రాజకాలువ ఆక్రమణల ఏరివేత చేపట్టారు. 30 జేసీబీలతో కూల్చివేతలు రెండోరోజు 30కి పైగా జేసీబీలతో మహదేవపుర, యలహంక వలయాల పరిధిలో కట్టడాలను కూల్చారు. శాంతినికేతన్ లేఔట్లో భారీ భవంతులను బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. మున్నకోళాల సరిహద్దుల్లో 7 ఆక్రమణలను తొలగించారు. తొలగించాలని అనేక ఇళ్లు, దుకాణాలు ముందు రెవెన్యూ అధికారులు మార్కింగ్ వేశారు. భారీ పోలీస్ భద్రత మధ్య రెండు కిలోమీటర్ల పొడవు గల రాజకాలువపై నెలకొన్న ఆక్రమణలను పడగొట్టారు. యలహంక వలయంలో జక్కూరు, అల్లాలసంద్ర, కోగిలు, అట్టూరు, సింగాపుర, దొడ్డబొమ్మసంద్ర, హెబ్బాళ, నవనగర, రాచేనహళ్లితో పాటు సుమారు 30 చెరువులు కబ్జాకు గురయ్యాయి. రియల్టర్లు, నేతలు కుమ్మక్కై చెరువులు మింగేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఆక్రమణదారులు పలుకుబడి కలిగినవారు కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. నలపాడ్ అకాడమి తొలగింపు నిలిపివేత మరోవైపు ఆక్రమణల తొలగింపు వద్ద ఎమ్మెల్యే హ్యారిస్ తనయుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ పడవ వేసుకుని ధర్నా చేసి హల్చల్ చేశారు. ఆక్రమణల జాబితాలో నలపాడ్ ఆస్తులు కూడా ఉన్నాయి. మహమ్మద్ నలపాడ్ అకాడమి తొలగింపును అధికారులు నిలిపివేశారు. పనులు చేస్తున్న సిబ్బందిని హ్యారిస్ పీఏ నిలిపివేయాలని ఒత్తిడి చేశాడు. గేటు వద్ద అడ్డుకున్నాడు. దీంతో కూల్చివేతను నిలిపివేశారు. శివాజీనగర: బెంగళూరులో అక్రమ భవనాల తొలగింపు పై మంగళవారం విధాన సౌధలో రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మాట్లాడుతూ... వీటి వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమించుకొని అనేక అతిపెద్ద భవనాలు నిర్మించుకున్నారని, అలాంటి భవనాలను ఎలా తొలగిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఎంతటివారైనా సరే తొలగిస్తామని, నోయిడా తరహాలో అక్రమ భవనాలకు పేలుడుతో సమాధానం చెబుతామన్నారు. ఆక్రమణదారులకు ఘాటైన హెచ్చరిక చేశారు. గత ప్రభుత్వాలవి నాటకాలు ఆక్రమణల విషయంలో గత ప్రభుత్వాలు నాటకీయంగా వ్యవహరించాయని, అయితే తమ అధికారంలో అలా జరగదని, ఐటీకి చెందిన 30 కంపెనీలు ఆక్రమణలకు పాల్పడ్డాయని, తమ శాఖ జాబితా సిద్ధం చేసి బీబీఎంపీకి ఇచ్చామన్నారు. మినహాయింపు లేదు ఐటీ–బీటీ కంపెనీలకు ఎలాంటి మినహాయింపు లేదని, పెద్దవారు, చిన్నవారు అనేది లేదని, రెవెన్యూ శాఖ, బీబీఎంపీ, బీడీఏ సంయుక్త కార్యచరణ చేపడుతాయి. వరదలు తమకు గుణపాఠం చెప్పింది. బాగమనె పార్కుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పెద్దవారు చిన్నవారు అంటూ చూడమని మంత్రి తెలిపారు. విల్లాలు, విద్యాసంస్థలనూ వదలం రాజకాలువ ఆక్రమించుకొన్న భవనాలపై బీబీఎంపీ జాబితా సిద్ధం చేయగా, 600 అక్రమ భవనాల తొలగింపునకు ఆదేశించాం, రాజకాలువ తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని, మహదేవపుర భాగంలో బీబీఎంపీ రాజకాలువ అక్రమణలు తొలగిస్తోందని, విల్లాలు, విద్యా సంస్థ, ఇళ్లు నేలమట్టమవుతాయి. రైన్బో డ్రైవ్ లేఔట్లో జిల్లా యంత్రాంగం సర్వే జరుపగా, కాలువను ఆక్రమించుకొని విల్లాలను నిర్మించినట్లు తెలిసింది. ప్రస్తుతం విల్లాలను తొలగించాలని యజమానులకు నోటీస్ ఇచ్చామన్నారు. JCB’s in action today in Mahadevapura demolishing alleged encroachments on rajakaluves. #BBMP pic.twitter.com/lvEjU9yHyM — Anil Budur Lulla (@anil_lulla) September 12, 2022 -
ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్.. నోటీసులు జారీ
మహారాష్ట్రలో శివసేన, మాజీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతుల మధ్య పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం ఎంపీ నవనీత్ రాణా, మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాకు నోటీసులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఖార్ ప్రాంతంలో నవనీత్ రాణా దంపతులు తమ ఇంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ గుర్తించారు. ఈ క్రమంలో వారి ఫ్లాట్ వద్ద అక్రమ నిర్మాణాన్ని ఏడు రోజుల్లో తొలగించాలని బీఎంసీలు అధికారులు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో బీఎంసీ చర్యలు తీసుకొని కూల్చివేస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే MMC చట్టంలోని సెక్షన్ 475-A ప్రకారం ఫ్లాట్ యజమానికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరుచగా.. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్‌ను ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఇది కూడా చదవండి: ఒమిక్రాన్ కలవరం.. తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు -
జైలుకు పంపించాలా?.. బీడీఏ, బీబీఎంపీపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరులో పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాల గురించి సర్వే నివేదిక అందజేయకపోవడంపై బీడీఏ, బీబీఎంపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిద్దరిని జైలుకు పంపిస్తేగాని పరిస్థితి మారదని హెచ్చరించింది. న్యాయసేవల సమితి వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తి.. కోర్టు ఆదేశాలను సంస్థలు పట్టించుకోవడం లేదని అన్నారు. బీబీఎంపీ కమిషనర్‌ను జైలుకు పంపిస్తామన్నారు. పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాలను సహించేదిలేదు, పెద్దవాళ్లపై చర్యలు తీసుకోవడానికి మీరు వెనుకాడవచ్చు కానీ మేము భయపడబోం. తక్షణం చర్యలు తీసుకోకపోతే అదికారులకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సర్వే నివేదిక అందజేయడానికి మరో వారం గడువు ఇవ్వాలని బీబీఎంపీ వకీలు కోరారు. సుప్రీంలో పాలికె ఎన్నికల కేసు బీబీఎంపీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీబీఎంపీ ఎన్నికలు జరపాలని మాజీ కార్పొరేటర్లు శివరాజు, అబ్దుల్ వాజిద్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో రెండునెలల్లోగా ఎన్నికలు జరపాలని హైకోర్టు అదేశించగా, ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించలేమని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను ఒక నెలలోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
సార్ తలుచుకుంటే.. అక్రమ నిర్మాణాలకు కొదువా..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో ఆయన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. ఓ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన ‘సార్’.. కార్పొరేట్ కళాశాలలతో పోటీపడే స్థాయి విద్యాసంస్థలకు అధిపతి. ఇంటర్మీడియెట్ నుంచి ఇంజినీరింగ్ కళాశాలల వరకు ఆయన విద్యా వ్యాపారం విస్తరించింది. అంతటి పెద్ద మనిషి ప్రభుత్వ నిబంధనలను కాలరాశారు. కరీంనగర్ శివార్లలోని విలువైన స్థలంలోని విద్యాసంస్థల ఆవరణలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం జరిపిన నిర్మాణానికి గ్రామ పంచాయతీ, లేదా పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి తీసుకోవాలనే చిన్న లాజిక్‌ను ఆయన మరిచారు. ఏకంగా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగంతస్థుల భవనాన్ని నిర్మించారు. కళాశాల పరిధిలోని తన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి.. ఆవరణలో తారు రోడ్లను వేయిస్తున్నారు. ‘నన్ను అడిగే వారెవరు?’ అనే ధోరణిలో ‘సార్’ సాగిస్తున్న నిర్మాణాల గురించి తెలిసినా గ్రామ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి చూసీ చూడనట్టుగానే వదిలేశారు. కరీంనగర్ పట్టణాభివృద్ధి సంస్థ ‘సుడా’ ఇటువైపే చూడలేదు. బొమ్మకల్ చౌరస్తాలో జీ+3 నిర్మాణం... కరీంనగర్ బొమ్మకల్ చౌరస్తాలో బైపాస్‌ను ఆనుకొని ఉన్న భూములను గతంలోనే కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి తన గ్రూప్ విద్యాసంస్థలను నెలకొల్పారు. ఇదే క్రమంలో తెలిసో, తెలియకో అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంత భాగం కూడా ఆయన ఆధీనంలోకి వెళ్లింది. దీనిపై బొమ్మకల్ గ్రామ పంచాయతీకి చెందిన కొందరు వార్డు సభ్యులు, లోక్‌సత్తా వంటి సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ భూమిని సర్వే చేయించారు. కళాశాల స్థలానికి, వ్యవసాయ భూమికి మధ్యన సర్వే నంబర్ 28లో ఉన్న సుమారు ఎకరం 26 గుంటల భూమి ప్రభుత్వానిదని తేల్చారు. ఈ సర్కారు భూమి చుట్టూ గోడ కడతామన్న జిల్లా అధికారులు రాతి ఖనీలు పాతి, ప్రభుత్వ స్థలమనే బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. అదే సమయంలో కళాశాల ప్రాంగణంలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం జరుపుకుంటున్న మూడంతస్థుల భవనం గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నిర్మాణం కూడా పూర్తయిన ఈ భవనంలో అంతర్జాతీయ స్థాయి స్కూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. గ్రామ పంచాయతీ, సుడా అనుమతి లేకుండా... బొమ్మకల్ చౌరస్తాలోని ప్రజాప్రతినిధికి చెందిన విద్యాసంస్థల క్యాంపస్‌లో గత ఏడాది జీ+3 అంతస్థుల్లో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో శరవేగంగా నిర్మాణం పూర్తయింది. సుమారు 20వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో నిర్మాణం పూర్తయిన ఈ భవనానికి బొమ్మకల్ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేదు. భవన నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి దరఖాస్తు కూడా చేసుకోలేదని వార్డు సభ్యుడు తోట కిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై డీపీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.సురేందర్‌ను ప్రశ్నించగా అనుమతి లేని విషయాన్ని ‘సాక్షి’తో ధ్రువీకరించారు. తాను రెండున్నర నెలల క్రితమే బదిలీపై వచ్చానని, అంతకు ముందున్న కార్యదర్శి అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలని నోటీస్ ఇచ్చేందుకు వెళ్లగా, కళాశాల సిబ్బంది అనుమతించలేదని తెలిసిందన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) పరిధిలో ఉన్న ఈ స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలన్నా ఆ సంస్థ అనుమతి తప్పనిసరి. అయినా ఎలాంటి అనుమతి లేకుండానే భవన నిర్మాణం పూర్తవడం విశేషం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ‘సార్’ను అడిగే వారే లేకుండా పోయారు. ప్రభుత్వ ఆధీనంలోని బావి నుంచే పొలాలకు నీరు ప్రజాప్రతినిధి కొనుగోలు చేసిన భూముల్లో కొన్ని ఎకరాల్లో విద్యాసంస్థలు నడుస్తుండగా, మరికొన్ని ఎకరాల్లో వ్యవసాయం చేయిస్తున్నారు. ఈ భూముల కోసం తవ్విన పాత వ్యవసాయ బావిని ఆధునికీకరించారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారుల సర్వేలో ఆ బావి కూడా సర్కారు శిఖం భూమిలో ఉన్నట్లుగా తేలింది. సర్కారు భూమి చుట్టూ ప్రహరీ కట్టాలని భావించినప్పటికీ, ఒత్తిళ్ల మేరకు ఖనీలతో వదిలేశారు. ఇప్పుడు అదే వ్యవసాయ బావి ప్రజాప్రతినిధికి చెందిన వరి పొలాలకు, కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న స్కూల్ భవనం, రోడ్లకు నీటిని సరఫరా చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు మోటార్లు కూడా పని చేస్తున్నాయి. -
అక్రమంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం
సాక్షి, మంగళగిరి (గుంటూరు) : మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట సర్వే నంబర్ 392లో 3 ఎకరాల 65 సెంట్ల భూమిని టీడీపీ కార్యాలయానికి 99 సంవత్సరాలపాటు ప్రభుత్వం లీజుకు కేటాయించింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి రూపాయల లీజుకి కేటాయిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.అప్పటికే అదే భూమిని ప్రభుత్వం 1974లో గ్రామానికి చెందిన బొమ్ము రామిరెడ్డికి 65 సెంట్లు, కొల్లా రఘురాఘవరావుకు 1 ఎకరం 75 సెంట్లు, కొల్లా భాస్కరరావుకు 1 ఎకరం 75 సెంట్లు పట్టాలు మంజూరు చేసింది. రైతులు వ్యవసాయం చేసుకుంటుండగా అధికారం అండతో వారి భూమిని బలవంతంగా లాక్కుని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ విషయమై రైతులు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. కోర్టు స్టేటస్ కో ఉందని అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. భవన నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల 65 సెంట్లను కేటాయించగా దాంతోపాటు పక్కనే ఉన్న బొమ్ము రామిరెడ్డికి చెందిన 65 సెంట్లతోపాటు మరో పక్కన ఉన్న వాగును పూర్తిగా పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. రెండు బేస్మెంట్లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్మెంట్లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తుండడం గమనార్హం. వందల కోట్లతో... అత్యాధునిక సాంకేతికతో టీడీపీ కార్యాలయం రూ.వందల కోట్లతో నిర్మిస్తున్నారు. భూమి లోపలకు 3 అంతస్తులు భూమిపైన మరో నాలుగు అంతస్తులతో మొత్తం ఏడు అంతస్తుల నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ భవన నిర్మాణంలో వాహనాల పార్కింగ్‌కు ఒక ఫ్లోర్, 5 వేల మందికి సమావేశ మందిరం, భోజనశాల, వంట గది, చంద్రబాబుకు ప్రత్యేక నివాసం, పార్టీ కార్యాలయం ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కో విధంగా తీర్చిదిద్దుతున్నారు. లోపల నిర్మాణం కోసం వాడుతున్న ఉడ్, ఫర్నిచర్, ఇంటిరీయల్ డిజైన్ మొత్తం సింగపూర్, మలేషియానుంచి దిగుమతి చేసుకుంటున్నారు. భవన నిర్మాణాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికోసారి పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేసి చంద్రబాబు మకాం ఇక్కడకు మార్చాలని ఆలోచిస్తున్నారు. నోటీసులు జారీ చేస్తాం టీడీపీ కార్యాలయానికి కేటాయించిన భూమితోపాటు పక్కన ఉన్న కాలువ పోరంబోకును పూడ్చి నిర్మిస్తున్న విషయం మా పరిశీలనలో తేలింది. ఎంత మేర పూడ్చి ఎంత భూమిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారో మరోసారి పరిశీలించి నిర్మాణదారులకు నోటీసులు జారీ చేస్తాం. –తహసీల్దార్ రామ్‌ప్రసాద్ -
కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడం కూల్చివేత
సాక్షి, గుంటూరు, కృష్ణా : తాడేపల్లి మండల పరిధిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నదీ తీరప్రాంతంలో కరకట్ట లోపల నీటి ప్రవాహానికి అడ్డంగా ఏర్పాటుచేసిన ఓ కట్టడాన్ని సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 29 అక్రమ కట్టడాలను గుర్తించి అనేకసార్లు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో పాతూరు కోటేశ్వరరావు కృష్ణానది లోపలికి చొచ్చుకెళ్లేలా నిర్మించిన కట్టడాన్ని అధికారులు తొలగించారు. -
అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న రెవెన్యూ అధికారులు
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలోని చక్రాయపేట మండలం ఉప్పల వాండ్ల పల్లే గ్రామం ఉప్పల కుంట చెరువులో టీడీపీకి చెందిన వ్యక్తి అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. చెరువులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనల మేరకే ఇంటిని కూల్చేశామని అధికారులు స్పష్టం చేశారు. -
అక్రమ నిర్మాణమే అని అంగీకరించిన ఆంధ్రజ్యోతి
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా, పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో తాము నిర్మించిన భవనం అక్రమ నిర్మాణమేనని ఆంధ్రజ్యోతి యాజమాన్యం బుధవారం హైకోర్టులో అంగీకరించింది. దీని క్రమబద్ధీకరణ కోసం బీపీఎస్ కింద పెట్టుకున్న దరఖాస్తును అధికారులు తిరస్కరించారని పిటిషనర్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి అనూష తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నిర్మాణాన్ని కూల్చివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును పదే పదే కోరారు. హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ నిర్మాణం కూల్చివేతపై ఇప్పటికే స్టే ఉందని, మరోసారి స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అనుమతే తీసుకోలేదు... ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమతి తీసుకోకుండానే భవనాన్ని నిర్మించారని, నిర్మాణం పూర్తయిన తరువాత అనుమతి కోసం దరఖాస్తు చేశారన్నారు. గడువు తేదీ ముగిసిన తరువాత దరఖాస్తు సమర్పించారని తెలిపారు. ఆగస్టు 31, 2018 నాటికి నిర్మాణాలు పూర్తయిన భవనాలకే బీపీఎస్ వర్తిస్తుందని వివరించారు. పిటిషనర్ 2018 డిసెంబర్ 29న భవన నిర్మాణానికి దరఖాస్తు సమర్పించారన్నారు. అలాంటప్పుడు ఆగస్టులో భవన నిర్మాణం పూర్తయిందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు పిటిషనర్ నాలుగు వ్యాజ్యాలు దాఖలు చేశారని, ఒక దానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. వారు ప్రమాణ పూర్వకంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను పరిగణనలోకి తీసుకున్నా ఆ భవనం అక్రమ నిర్మాణమే అవుతుందన్నారు. -
కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
సాక్షి, పశ్చిమ గోదావరి : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై రెండవ రోజు తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నాయి. నరసింహారావు పేటలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆక్రమించిన స్థలాల్లోని రోడ్లూ, నిర్మాణాలు అధికారులు తొలగించారు. నిన్న జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేయటంతో కూల్చివేత పనులు మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు జరగకుంగా ముందస్తు జాగ్రత్తలు సిద్ధం చేసిన ఎండోమెంట్ అధికారులు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు -
అక్రమ కట్టడాల కూల్చివేత
చిత్తూరు,రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాళెం సమీపంలో అక్రమంగా నిర్మించిన 28ఇళ్లను బుధవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో కిరణ్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. సర్వే నంబర్ 506–1లోని 1.28 ఎకరాల వాగు పోరంబోకు స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, షెడ్లను తొలగించారు. బాధితులు అడ్డుకుని, తమ ఆక్రోశించినా అధికారులు పట్టించుకోలేదు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ సాయంతో ఇళ్లను కూల్చివేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వంక పోరంబోకు స్థలంలో ఇళ్లను నిర్మించడంతోనే తాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూల్చివేతకు పూనుకున్నట్లు విచారణాధికారి కిరణ్ చెప్పారు. అయితే పేదలు నిర్మించుకున్న రెండు సెంట్ల స్థలమే మీకు కనిపిస్తుందా...? అంటూ స్థానికులు రెవెన్యూ సిబ్బందిపై ఎదురుతిరిగారు. ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికులను వారించారు. తహసీల్దార్ మాధవక్రిష్ణారెడ్డి, ఆర్ఐలు ఈశ్వర్, వసంత్, వీఆర్వో, వీఆర్ఏలు సుమారు 20మంది ఈ పనులను పర్యవేక్షించారు. అయితే తాము రూ.10 వడ్డీతో అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయొద్దని, రెండు రోజులు గడువు ఇస్తే తామే నిర్మాణాలను తొలగించి రేకులు, తలుపులు, సిమెంటు రాళ్లను తీసుకెళ్తామని బాధితులు విజ్ఞప్తి చేసినా అధికారులు ఖాతరు చేయలేదు. విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి, యోగేశ్వరరెడ్డి, సీపీఎం నేతలు నరసింహారెడ్డి, సెల్వరాజ్ అక్కడకు చేరుకుని బాధితుల పక్షాల అధికారులతో మాట్లాడారు. అయితే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఆగదని, అయితే బాధితుల్లో అర్హులైన పేదలుంటే వారు అర్జీలు ఇస్తే న్యాయం చేస్తామని విచారణాధికారి హామీ ఇచ్చారు. దీంతో చేసేది లేక స్థానికులు వెనుతిరిగారు. ఆత్మరక్షణలో రెవెన్యూ సిబ్బంది గత మూడు నెలల్లోనే అక్రమ కట్టడాలు నిర్మించినట్లు షార్ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా తెలుస్తోందని భావించిన విచారణాధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రేణిగుంట రెవెన్యూ సిబ్బంది ఆత్మరక్షణలో పడ్డారు. గత తహసీల్దార్ హయాంలో ఇచ్చిన అనుభవ ధ్రువపత్రాలతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో కొందరు వీఆర్వోలు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఎన్నికలకు ముందు అనధికారిక కట్టడాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ కట్టడాలకు కొందరు వీఆర్వోలు పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని, ప్రస్తుతం ఇళ్లు కూల్చేయడంతో బాధితులు వారిని శాపనార్థాలు పెడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. గతంలో అనుభవ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసినప్పటికీ ఎక్కడైనా ఫిర్యాదులొస్తే రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే గత నాలుగు నెలలుగా కొందరు వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలకు ఊతమిచ్చి రూ.లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతోనే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణాలు ఇటీవల కాలంలోనే జరిగినట్లు అధికారులు ధ్రువీకరించుకున్నారు. అయితే ఈ అక్రమాల వెనుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరిపైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన అక్కడున్న సిబ్బందిని హెచ్చరించడంతో కొంతమంది టెన్షన్‌కు గురవుతున్నట్టు సమాచారం. పలు ప్రయాసలకోర్చి నిర్మించుకున్న పేదలు మాత్రం బలిపశువులైపోగా, ఆమ్యామ్యాలకు పాల్పడిన వారు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత మిగిలిన చోట్ల కొనసాగుతుందన్న సంకేతాలు అందడం పలువురిలో గుబులు రేపుతోంది. ఇళ్ల కూల్చివేత బాధితుల రాస్తారోకో మండలంలోని ఎర్రమరెడ్డిపాళెంలో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో బాధితులు బుధవారం సాయంత్రం హైవేపై రాస్తారోకో చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ పేదల నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేసిన ఏవో కిరణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బలప్రయోగంతో ఇళ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకివాకం మాజీ సర్పంచ్ భాస్కర్‌యాదవ్ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. గాజులమండ్యం పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. -
వాగును పూడ్చు.. భవనం కట్టు
కోదాడ : సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఉలకవాగు ఆక్రమణకు గురైంది. అక్రమార్కులు కాగితాల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. అధికారుల చేతులు తడిపారు. అనుకూలంగా కాగితాలను మార్చుకున్నారు. ఇంకేముంది ఆగమేఘాల మీద అనుమతులు మంజూరయ్యాయి. జెట్ స్పీడ్‌తో వాగులో భవన నిర్మాణం కొనసాగుతుంది. మొదట ఈ నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఓ ప్రజాప్రతినిధి ఆ తరువాత పెద్దమనిషి అవతారమెత్తారు. అందరిని తానే ‘సరి’చేసి నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూశాడు. వందల అడుగుల వెడల్పుతో ఉన్న ఉలకవాగు మురుగుకాల్వ కన్నా చిన్నగా మారిపోయింది. ఇదేమిటం టే ఐబీ, రెవెన్యూ, మున్సిపల్‌శాఖ అధికారులు అది తమ పని కాదంటే తమ పని కాదని తప్పించుకుంటున్నారు. వాగు ఉందని చెబుతుంది వారే .. కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో సర్వే నంబర్ 936, 937లలో తమ్మర శేషగిరిరావుకు భూమి ఉంది. దీనిని తమ్మర వెంకటేశ్వరరావుకు జీపీఏ ఇచ్చాడు. దానిని ఆయన టీచర్స్ కాలనీ పేరుతో లే అవుట్ చేసి అమ్మాడు. జీపీఏ చేసే సమయంలో, లే అవుట్ చేసే సమయంలో అక్కడ ఉత్తరం వైపు వాగు ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కాని వాగు ఎంత వెడల్పుతో ఉందో సరిగా ఎక్కడ పేర్కొనలేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. భూమి యజమానికి తృణమో, ఫణమో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగితాల మీద ఒక రకంగాను, క్షేత్ర స్థాయిలో మరో రకంగాను వ్యవహారం నడిచింది. ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న భవనానికి ఎదురుగా 50 అడుగుల వెడల్పుతో ఉలకవాగు నీరు పోవడానికి వంతెన ఉంది. దానిని చూసైనా వాగు ఎంత వెడల్పు ఉందో ఇట్టే చెప్పేయవచ్చు కాని అధికారులు మాత్రం మూమూళ్ల మత్తులో అనుకూలంగా నివేదికలు ఇచ్చారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ‘సరి’ చేశాడు... ఉలకవాగులో సాగుతున్న భవన నిర్మాణంలో ప్రజాప్రతినిధి ఒక్కరు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట నిర్మాణాన్ని వ్యతిరేకించడమే కాకుండా వాగులో పూడికను తీయ్యించి చాలా హడావుడి చేశాడు. మున్సిపల్ అధికారులతో చెప్పి పనులు కూడా ఆపించాడు. ఆ తర్వాత తెరవెనుక మంతనాలు నడిపారు. వ్యతిరేకించే వారినందరిని తానే దగ్గరుండి ‘సరి’ చేసే పని చేపట్టాడనే ఆరోపణలు కాలనీలో గుప్పుమంటున్నాయి. కళ్లు మూసుకున్న అధికారులు ఉలక వాగులో ఒక ప్లాట్‌ను క్రమబద్ధీకరించడానికి యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్ అధి కారులు వెనుకా ముందు చూడకుండా క్రమబద్ధీకరించారు. అనుమతులు కూడా మంజూరు చేశారు. భవన నిర్మాణం విషయం కాలనీవాసులకు తెలియడంతో ఉలకవాగులో అక్రమ నిర్మాణాల వల్ల భారీ వర్షాలు వస్తే నీరు కాలనీ మీదకు వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు పనులను ఆపి వేశారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధి సైతం దీన్ని వ్యతిరేకించారు. దీంతో అక్కడ వాగు ఉందో లేదో చెప్పాలని రెవెన్యూ అధికారులను, ఐబీ అధికారులను మున్సిపల్ అధికారులు కోరగా రికార్డులలో వాగు లేదని రెవెన్యూ అధికారులు, వాగు ఉంది కాని ఎంత వెడల్పు ఉందో తెలవదని ఐబీ అధికారులు వింతైన సమాధానాలు ఇచ్చారు. దీంతో తాము ఏమి చేయలేమని మున్సిపల్ అ«ధికారులు చేతులెత్తేశారు. పనులు ఆపాం.. ఉలకవాగులో భవన నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో పనులు ఆపాం. రెవెన్యూ, ఐబీ అధికారులు వాగు విషయంలో సరైన విధంగా స్పందించలేదు. దీంతో మేము ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకు పనులు ఆపారో తెలపాలని భవన యజమాని అడగడంతో మా వద్ద సరైన కారణం లేక మళ్లీ అనుమతి ఇచ్చాం.-అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
నాకేంటి ? అంటున్న కార్పొరేటర్లు
-
కానిస్టేబుళ్లా మేస్త్రీలా ?
-
గుంటూరు మంత్రిగారి అల్లుడి పెత్తనం చూసారా..
-
విశాఖలో పచ్చనేతల ఇష్టారాజ్యం
-
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం
-
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం
'సాక్షి' ఫోన్ ఇన్ కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోకపోతే ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దించి సమూలంగా కూల్చివేస్తామని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు హెచ్చరించారు. అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా నిరోధించడంతో పాటు ఆయా ప్లాట్లపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేకుండా స్తంభింపజేస్తామని కమిషనర్ ప్రకటించారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొనే విషయంలో ప్రజలకు తలెత్తుతోన్న వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేకంగా ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు నేరుగా హెచ్ఎండీఏ కమిషనర్‌కు ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. లేఅవుట్లకు అనుమతిచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదని, హెచ్ఎండీఏ అనుమతి లేకుండా ఏర్పాటైన వాటిని అక్రమ లేఅవుట్లుగా పరిగణిస్తామని చిరంజీవులు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు ఇష్టం వచ్చినట్లు అనుమతులివ్వకుండా పంచాయతీ కమిషనర్ ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను తొలగించేందుకు ప్రత్యేకంగా 4 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. తొలుత చౌటుప్పల్ ప్రాంతంపై దృష్టి సారించామని, ఇక్కడ లెక్కకు మించి ఉన్న అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహానగర పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ మేరకు అక్రమాలను సరిదిద్దేందుకు నవంబర్ 2న ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ల ద్వారా రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పిస్తూ జీవో నెం.151 విడుదల చేసిందన్నారు. క్రమబద్ధీకరణ రుసుం కూడా చాలా తక్కువగా ఉందని.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసెంబర్ 31తో గడువు ముగియనున్నందున సకాలంలో స్పందించాలని కోరారు. అయితే... నిబంధనలకు లోబడి ఉన్న వాటినే క్రమబద్ధీకరిస్తాం తప్ప చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలు, లేఅవుట్లను అనుమతించమని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు లేకపోయినా... హెచ్ఎండీఏకు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి, తగిన డాక్యుమెంట్లు లేకపోయినా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల కింద దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు తమ సిబ్బంది వచ్చినప్పుడు వాటిని అందిస్తే సరిపోతుందన్నారు. ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు సేల్‌డీడ్, బిల్డింగ్ ప్లాన్ వంటివి సమర్పిస్తే మిగతా వాటిని ఆయా విభాగాల నుంచి తామే తెప్పిస్తామని వివరించారు. ముఖ్యంగా 18 మీటర్ల ఎత్తు (5 అంతస్తుల) వరకు ఉండే భవనాలకు ఫైర్, ఎయిర్పోర్ట్ అథార్టీ అనుమతులు అవసరం లేదని ఆపైన నిర్మించే వాటికి విధిగా ఆయా విభాగాల నుంచి ఎన్వోసీ లు తీసుకురావాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే తరుణంలో మీ మొబైల్ నంబర్ ఇస్తే వెంటనే ఓ పాస్వర్డ్ జనరేట్ అవుతుందని, దీని ఆధారంగా మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే చూసుకోవచ్చన్నారు. దళారుల మాటలు నమ్మొద్దని, ఇన్స్పెక్షన్ అధికారులు మీకు ఫోన్ చేసి వస్తారు.. మీ కళ్లముందే కొలతలు తీసుకొని చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని వెల్లడిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలో మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇతరులకు ఇవ్వకుండా మీరే ఆపరేట్ చేయాలని, అవి లేనివారు మండల కేంద్రంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఇచ్చే ఓచర్‌ను తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా వచ్చిన దరఖాస్తులను 6 నెలల్లోగా పరిష్కరించి అనుమతి పత్రాలు జారీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు.