అక్రమ కట్టడాల కూల్చివేత | Illegal Constructions Collapse in Chittoor | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాల కూల్చివేత

Published Thu, Apr 25 2019 12:49 PM | Last Updated on Thu, Apr 25 2019 12:49 PM

Illegal Constructions Collapse in Chittoor - Sakshi

రాస్తారోకో చేస్తున్న బాధితులు

చిత్తూరు,రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాళెం సమీపంలో అక్రమంగా నిర్మించిన 28ఇళ్లను బుధవారం తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఏవో కిరణ్‌ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. సర్వే నంబర్‌ 506–1లోని 1.28 ఎకరాల వాగు పోరంబోకు స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, షెడ్లను తొలగించారు.  బాధితులు అడ్డుకుని, తమ ఆక్రోశించినా అధికారులు పట్టించుకోలేదు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ సాయంతో ఇళ్లను కూల్చివేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వంక పోరంబోకు స్థలంలో ఇళ్లను నిర్మించడంతోనే తాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూల్చివేతకు పూనుకున్నట్లు విచారణాధికారి కిరణ్‌ చెప్పారు. అయితే పేదలు నిర్మించుకున్న రెండు సెంట్ల స్థలమే మీకు కనిపిస్తుందా...? అంటూ స్థానికులు రెవెన్యూ సిబ్బందిపై ఎదురుతిరిగారు. ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికులను వారించారు. తహసీల్దార్‌ మాధవక్రిష్ణారెడ్డి, ఆర్‌ఐలు ఈశ్వర్, వసంత్, వీఆర్‌వో, వీఆర్‌ఏలు సుమారు 20మంది ఈ పనులను పర్యవేక్షించారు. అయితే తాము రూ.10 వడ్డీతో అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయొద్దని, రెండు రోజులు గడువు ఇస్తే తామే నిర్మాణాలను తొలగించి రేకులు, తలుపులు, సిమెంటు రాళ్లను తీసుకెళ్తామని బాధితులు విజ్ఞప్తి చేసినా అధికారులు ఖాతరు చేయలేదు. విషయం తెలుసుకున్న  మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ హరిప్రసాద్‌రెడ్డి, యోగేశ్వరరెడ్డి, సీపీఎం నేతలు నరసింహారెడ్డి, సెల్వరాజ్‌ అక్కడకు చేరుకుని బాధితుల పక్షాల అధికారులతో మాట్లాడారు. అయితే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఆగదని, అయితే బాధితుల్లో అర్హులైన పేదలుంటే వారు అర్జీలు ఇస్తే న్యాయం చేస్తామని విచారణాధికారి హామీ ఇచ్చారు. దీంతో చేసేది లేక స్థానికులు వెనుతిరిగారు.

ఆత్మరక్షణలో రెవెన్యూ సిబ్బంది
గత మూడు నెలల్లోనే అక్రమ కట్టడాలు నిర్మించినట్లు షార్‌ శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా తెలుస్తోందని భావించిన విచారణాధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రేణిగుంట రెవెన్యూ సిబ్బంది ఆత్మరక్షణలో పడ్డారు. గత తహసీల్దార్‌ హయాంలో ఇచ్చిన అనుభవ ధ్రువపత్రాలతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో కొందరు వీఆర్‌వోలు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఎన్నికలకు ముందు అనధికారిక కట్టడాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ కట్టడాలకు కొందరు వీఆర్‌వోలు పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని, ప్రస్తుతం ఇళ్లు కూల్చేయడంతో బాధితులు వారిని శాపనార్థాలు పెడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. గతంలో అనుభవ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసినప్పటికీ ఎక్కడైనా ఫిర్యాదులొస్తే రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే గత నాలుగు నెలలుగా కొందరు వీఆర్‌వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలకు ఊతమిచ్చి రూ.లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతోనే శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా ఇళ్ల నిర్మాణాలు ఇటీవల కాలంలోనే జరిగినట్లు అధికారులు ధ్రువీకరించుకున్నారు. అయితే ఈ అక్రమాల వెనుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరిపైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన అక్కడున్న సిబ్బందిని హెచ్చరించడంతో కొంతమంది టెన్షన్‌కు గురవుతున్నట్టు సమాచారం. పలు ప్రయాసలకోర్చి నిర్మించుకున్న పేదలు మాత్రం బలిపశువులైపోగా, ఆమ్యామ్యాలకు పాల్పడిన వారు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత మిగిలిన చోట్ల కొనసాగుతుందన్న సంకేతాలు అందడం పలువురిలో గుబులు రేపుతోంది.

ఇళ్ల కూల్చివేత బాధితుల రాస్తారోకో
మండలంలోని ఎర్రమరెడ్డిపాళెంలో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో బాధితులు బుధవారం సాయంత్రం హైవేపై రాస్తారోకో చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ పేదల నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేసిన ఏవో కిరణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బలప్రయోగంతో ఇళ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకివాకం మాజీ సర్పంచ్‌ భాస్కర్‌యాదవ్‌ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. గాజులమండ్యం పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement