కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్‌ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది.
ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్‌ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు.
దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్‌మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్‌మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది.
కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు.
దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా?
చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు.
కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు.
అధికారం పోయాక ఎల్లో వాయిస్లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు.
నొయిడాలో ట్విన్ టవర్స్‌ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment