Twin Towers
-
9/11: చేదు జ్ఞాపకాలే అయినా పదిలంగా ఉంచేందుకు..
9/11 Attacks: సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ.బాధితులకు జ్జాపకార్థంగా ట్విన్ టవర్స్ కూలిన ప్రాంతం(గ్రౌండ్ జీరో) ఒక స్మారక భవనం, మ్యూజియం ఉంటాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 11న ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులు, వారి పిల్లలు, బంధువులు నివాళులు అర్పిస్తారు. అయితే ఇలా నివాళులు అర్పించటం వారసత్వంగా కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి నేటికి(బుధవారం) నాటికి 23 ఏళ్లు. స్మారక భవనం వద్ద ప్రతీ ఏడాది బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు మృతి చెందినవారి పేర్లు చదువుతూ నివాళి అర్పిస్తారు. మృతి చెందినవారి వారసులు, వారి పిల్లలు.. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమవారి పేర్లు చదివి స్మరించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. 23 ఏళ్లు గడుస్తున్నా.. దాడుల తర్వాత బాధితుల వారసులు వాళ్ల తాత, అమ్మమ్మ, నానమ్మలు పేర్లు స్మరించుకుంటూ నివాళులు అర్పించటం పెరుగుతోంది. అయితే గతేడాది సుమారు మొత్తం 140 మంది వారసులు దాడుల్లో మృతి చెందినవారికి నివాళులు అర్పించగా.. అందులో దాడులు జరిగిన అనంతరం పుట్టిన యువతీయువకులు 28 మంది ఉన్నారు. అయితే ఈ ఏడాది కూడా ఆ యువతీయువకులు తమవారికోసం నివాళులు అర్పించడానికి ఎదురు చూస్తున్నారు. బాధితులకు సంబంధించిన వారసులు అధికంగా వారి మేనకోడళ్లు, మేనల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వారి వద్ద మృతి చెందినవారి కథలు, ఫొటోలు, జ్ఞాపకాలు ఉన్నాయి.9/11 దాడులకు ప్రత్యక్ష సాక్ష్యులు, బాధితులతో అనుబంధం ఉన్నవారి సంఖ్య తగ్గినా స్మరించుకోవటం తరతరాలకు కొనసాగుతుందని 13 ఏళ్ల అలన్ ఆల్డిక్కీ అంటున్నాడు. గత రెండేళ్లుగా తన తాత, అనేక మంది వ్యక్తుల పేర్లను చదివి నివాళులు అర్పించాను. ఇవాళ (బుధవారం) బాధితుల పేర్లు చదివి నివాళులు అర్పిస్తానని అన్నాడు. ట్విన్ టవర్స్ దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన తన తాత అల్లన్ తారాసివిచ్ జ్ఞాపకాలను తన గదిలో భద్రపర్చుకున్నానని తెలిపాడు. దాడుల్లో మృతిచెందిన న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది క్రిస్టోఫర్ మైఖేల్ మోజిల్లో సోదరి పమేలా యారోస్జ్, ఆమె కుమార్తె కాప్రీ.. మెజిల్లో ఫొటోను చూపిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బుధవారం వీరు ఆయన పేరు చదివి నివాళులు అర్పించడానికి సిద్ధం ఉన్నారు. పమేలా యారోస్జ్ తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ విధంగా నాటి దాడులు, బాధితులకు సంబంధించిన జ్ఞాపకాలు రేపటి తరాలకు సజీవంగా కొనసాగనున్నాయి.సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని అల్‌ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశారు ఉగ్రదాడులు. -
కేసీఆర్ నిర్ణయం.. నూతన సచివాలయం సమీపంలో ట్విన్ టవర్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన నూతన సచివాలయం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్రస్థాయిలో కీలకమైన పనులన్నీ ఒకే చోట జరిగేందుకు మార్గం పడింది. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాధిపతుల (హెచ్ఓడీల) కార్యాలయాలను ఒకే గొడుగు కిందికి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం కొత్త సచివాలయానికి సమీపంలో ట్విన్ (జంట) టవర్లు నిర్మించాలని.. దీనికి సంబంధించి స్థలాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. హెచ్ఓడీల వివరాలపై ఆరా.. దేశం గర్వించేలా నిర్మించుకున్న కొత్త సచివాలయం ఉద్యోగుల విధి నిర్వహణకు అత్యంత అనువుగా ఉందని.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారని సమీక్షలో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో.. మౌలిక వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్విన్ టవర్లను నిర్మించే అంశంపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల పరిధిలోని హెచ్ఓడీల వివరాలు, మొత్తం ఉద్యోగుల సంఖ్య, అవసరమైన స్థలం, సదుపాయాలు తదితర అంశాలపై ఆరా తీశారు. సచివాలయానికి సమీపంలో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మంచి స్థలాలను అన్వేషించాలని.. హెచ్ఓడీల అధికారులు, సిబ్బంది తరచూ సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. సమీపంలోనే ట్విన్ టవర్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. స్థలం ఎంపిక పూర్తయిన వెంటనే ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరగాలని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూన్ 2 నుంచి రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాల విషయంలో.. సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎం కేసీఆర్‌కు వివరించారు. జూన్ 9 నుంచి కుల వృత్తులకు ఆర్థిక సాయం కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎంబీసీ కులాలు, రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతుల ప్రజలకు దశల వారీగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ గంగుల కమలాకర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 9న నిర్వహించ తలపెట్టిన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. అమరుల స్మారకం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ లుంబినీ పార్కు స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారకం వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ ఈఈ శశిధర్‌కు సూచించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బీఆర్కేఆర్ భవన్ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలంలో ట్వీన్ టవర్స్? ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్వీన్ టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కార్యాలయాల కోసం 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అవసర మని అంచనా వేసినట్టు సమాచారం. అంతమేర భవనాల నిర్మాణానికి ఆదర్శ్‌నగర్ స్థలం అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
అక్కడ టీడీపీ, జనసేన లేవు.. సజావుగా అక్రమ కట్టడాల కూలివేత!
కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్‌ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్‌ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు. దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది. కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు. దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా? చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు. అధికారం పోయాక ఎల్లో వాయిస్‌లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు. నొయిడాలో ట్విన్ టవర్స్‌ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి. -
నోయిడా ట్విన్ టవర్స్- ఏపీ ప్రజావేదిక.. రెండూ కరెక్టేనా!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వద్ద రెండు భారీ ట్విన్ టవర్స్‌ను కూల్చివేసిన ఘట్టం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సుమారు నలభై అంతస్తుల భవనాన్ని కేవలం తొమ్మిది సెకన్లలోనే కూల్చేవేయడం ఒక ముఖ్యమైన అంశం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరో ప్రధాన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక ఈ ఆదేశాలు వివాదాస్పదం కాలేదు. రాజకీయ పార్టీలు దీనిపై విమర్శలకు దిగలేదు. అక్రమ భవనం అని కోర్టు నిర్థారించింది. అంతకు ముందు గత ఏడాది కేరళలోని కొచ్చి వద్ద నదీతీర ప్రాంతంలో నిర్మించిన మరో భారీ బహుళ అంతస్తుల భవంతిని కూడా సుప్రీం ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. ఈ ఘట్టాలు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చాయనే చెప్పాలి. చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులకు ఈ పరిణామం అసౌకర్యం కలిగించినా, భవిష్యత్తులో బిల్డర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడడకుండా ఉండడానికి ఇది ఆస్కారం ఇస్తుంది. విశేషం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ సౌధం నేలకూలింది అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే మాత్రం విధ్వంసం అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదచల్లే యత్నం చేశాయి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో కృష్ణా కరకట్టను ఆనుకుని పలు భవనాలు వెలిశాయి. అవన్ని కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినవే. ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఏకంగా ప్రజావేదిక పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో ఒక అక్రమ నిర్మాణం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అధికారులు వద్దని సలహా ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నదీని అనుకుని ఎలాంటి నిర్మాణాలు జరగరాదు. దానికి నిర్దిష్టదూరంలోనే నిర్మాణాలు ఉండాలి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబే స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో బస చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు వచ్చి దీనిపై అభ్యంతరం చెప్పినా, వారిపై నిర్భంధాలు విధించారే కాని, చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు, లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన అతిథి గృహ భవనంలో మకాం చేశారు. దీనికి ప్రతిగా ఆయనకు రాజధాని భూముల పూలింగ్‌లో మినహాయింపులు ఇచ్చి లాభం చేశారన్న అభియోగం ఉంది. అది వేరే విషయం. చంద్రబాబు ఈ ఇంటిలో దిగడానికి కొన్ని నెలల ముందు ఆయన క్యాబినెట్‌లోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో వరదను పరిశీలించడానికి వెళ్లి, ఈ అక్రమ నిర్మాణాలను గమనించి వీటన్నిటిని తమ ప్రభుత్వం కూల్చివేస్తుందని అప్పట్లో ప్రకటించారు. తీరా సీన్ కట్ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధినేతే అలాంటి అక్రమ భవనం ఒకదానిలో దిగేసరికి ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. తన ఇంటి వద్ద సదుపాయంగా ఉంటుందని భావించి ప్రజావేదిక పేరుతో ఒక కన్వెన్షన్ హాల్ తరహాలో నిర్మించుకున్నారు. 2019లో టీడీపీని ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ ప్రజావేదికలో ఒక సదస్సు పెట్టి, ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించి దానిని కూల్చివేయాలని ఆదేశించారు. అంతే: చంద్రబాబుతో సహా, పలువురు టీడీపీ నేతలు, వారికి వంత పాడే మరికొన్ని ఇతర పార్టీల నేతలు ఇంకేముంది విధ్వంసం అంటూ ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చి ఏడాది అయిందంటూ మరోసారి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇదొక్కటే కాదు. ఏపీలో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా, చివరికి అది గోడ అయినా, దానిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనో టీడీపీ వారు అడ్డుకోవడం, వెంటనే స్టేలు తీసుకు రావడం చేశారు. చిత్రంగా గౌరవ హైకోర్టు వారు కూడా కారణం తెలియదు కాని, అలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎక్కువ సందర్భాలలో స్టే ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. కృష్ణా కరకట్టపై ఉన్న భవనాలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, కొందరు హైకోర్టు నుంచి స్టే పొందగలిగారు. చివరికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నీటిపారుదల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరిగోడను కూల్చినా టీడీపీ మీడియా, టీడీపీ నేతలు రచ్చ,రచ్చ చేశారు. న్యాయ స్థానం నుంచి కూడా వారికి కొంత సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి గోడ కట్టిన గీతం యూనివర్శిటీలో ఆ గోడను తొలగించినప్పుడు కూడా ఇదే తంతు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నోయిడాలో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలను కూల్చివేయించారు. ఈ కూల్చివేతకు సుమారు ఇరవై కోట్ల వ్యయం అయిందని వార్తలు వచ్చాయి. ఈ భవనాలను నిర్మించిన బిల్డర్లు తమకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అంత ఖరీదైన భవనాల నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కాని కొందరు మాత్రం ఇలా కూల్చడం కన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే బాగుండేదన్న వాదనను తీసుకు వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆ పని చేస్తే, ఇక ప్రభుత్వాలు దానిని మరింతగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతివాదన చేసేవారు అంటున్నారు. కూల్చివేత ఘట్టం పూర్తి అయ్యాక, ఈ వాద, ప్రతివాదాలకు పెద్దగా విలువ ఉండదు. మరికొన్ని ఘట్టాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో అఘాయిత్యాలకు పాల్పడిన రౌడీషీటర్ల ఇళ్లను, మతకలహాలకు కారకులైనవారి ఇళ్లను అవి అక్రమమైనవి అయితే బుల్ డోజర్లు తీసుకు వెళ్లి కూల్చివేశారు. దానిని సుప్రీంకోర్టు కూడా నిలువరించలేదు. దాంతో యూపీ ప్రభుత్వానికి బుల్ డోజర్ ప్రభుత్వం అన్న పేరు కూడా కొంతమంది పెట్టారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో వరదనీరు, డ్రైనేజీ వ్యవస్థ పారే నాలాల మీద ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూల్చలేదని న్యాయస్థానం ఒక సందర్భంలో ప్రశ్నించింది. దాంతో అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపుతూ ఆ ఇళ్లను పలు చోట్ల కూల్చివేశారు. బాచుపల్లి అనే చోట అనుమతులు లేకుండా నిర్మించిన 200 పైగా విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయినా ఇక్కడ ఎవరూ దానిని విధ్వంసంగా అభివర్ణించలేదు. ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ,దానికి వంతపాడే ఈనాడు, తదితర మీడియా మాత్రం ఆ తరహా ప్రచారం చేశాయి. నొయిడా ఘటన తర్వాత కూడా ప్రజా వేదికను తీసివేసిన విషయాన్ని విధ్వంసంగానే ప్రచారం చేస్తారా? ఏపీకి సపరేట్ రాజ్యాంగం ఉందని వారు భావిస్తారా?. కృష్ణానది అనుకుని ఉన్న విలాసవంత భవనాల ద్వారా కాలుష్యం నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా ఏపీ వరకు మినహాయింపు ఇవ్వాలని వీరు అభిలషిస్తారా? ఈ మొత్తం ప్రకియలో టీడీపీ, అనుబంధ మీడియా ఆత్మరక్షణలో పడినట్లయింది. సుప్రీం కోర్టు చేసింది విధ్వంసమా?లేక నిబంధనలు పాటించడమా అన్నదానిపై వీరు నోరు విప్పలేని పరిస్థితి. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోయారని అనుకున్న తదుపరి యథా ప్రకారం టీడీపీ కాని, వారి మీడియా కాని విధ్వంసపు రాతలు రాయకుండా ఉంటాయని భావించలేం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే రామోజీరావు తదితర మీడియా సంస్థల యజమానులు తామే ఓడిపోయామని ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును గద్దె ఎక్కించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చన్నది వారి ఆలోచన. ఇందు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా జగన్ వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్‌దే కరెక్టు అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల ద్వారా తేలిందని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్‌ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డీఎల్ఎస్) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్‌పై నెటిజన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్ పార్కింగ్, పికప్, డ్రాప్ జోన్స్, 91 బస్‌బేలు, 1,500 ఈసీఎస్ పార్కింగ్లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ను 5వేల మంది రీట్వీట్ చేశారు. ► ఓ రైల్వే స్టేషన్‌కు అంత సంక్లిష్టమైన డిజైన్ అవసరమా? ► నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్‌ను మరింత పెంచుతుంది. ► డిజైన్ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్‌లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్గంజ్ నివాసితులను ఏం చేస్తారు? ► హైప్డ్ డిజైన్‌తో అనవసరమైన ఖర్చు. సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు. చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ చార్జీ రూ.112 -
నోయిడా ట్విన్ టవర్స్‌లో అత్యాధునిక సిస్మోగ్రాఫ్, బ్లాక్ బాక్సులు
నోయిడా: వంద మీటర్ల ఎత్తయిన జంట సౌధాలను నేలమట్టం చేసే సందర్భాన్ని పరిశోధకులు తమ అధ్యయనం కోసం వినియోగించుకున్నారు. భవిష్యత్ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ బహుళ అంతస్తుల భవంతులను ఎంచుకున్నారు. వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ విధానంలో నోయిడా సెక్టార్93ఏలోని జంట భవనాలను ఆదివారం నేలమట్టంచేయడం తెల్సిందే. పేలుడుపదార్ధాల ధాటికి భవనం నేలను తాకే క్రమం, శిథిలాలు సమీప ప్రాంతాలపై చూపే ప్రభావం, తదితర సమగ్ర సమాచారం సేకరించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్ కెమెరాలతో సంఘటనను అన్ని వైపుల నుంచీ షూట్‌చేశారు. చదవండి: (నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి) పేలుడు ప్రభావాన్ని అంచనావేసేందుకు 20 అత్యాధునిక సిస్మోగ్రాఫ్‌లు, 10 బ్లాక్ బాక్స్‌లను ఆ భవనాల్లోనే బిగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీబీఆర్ఐ) శాస్త్రవేత్త దేబీ ప్రసన్న చెప్పారు. పేలుడు ధాటికి భూమి కంపనాలను గణించేందుకు సిస్మోగ్రాఫ్‌లను వాడారు. జెట్ డెమోలీషన్స్ అండ్ ఎడిఫీస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ భవనాలకు పేలుడుపదార్థాలు అమర్చి పేల్చేసింది. బ్లాక్ బాక్స్ బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!) -
నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!
-ఎస్.రాజమహేంద్రారెడ్డి రెండు ఆకాశ హర్మ్యాలు.. ఒకటి 32 అంతస్తులు, మరొకటి 29 అంతస్తులు. 12 సెకండ్లలో నేలమట్టమయ్యాయి. నోయిడా జంట టవర్ల నిర్మాణానికి అయిన ఖర్చు రూ.70 కోట్లు. కూల్చడానికి అయిన ఖర్చు రూ.20 కోట్లు. వెరసి అక్షరాలా మొత్తం రూ.90 కోట్లు 12 సెకండ్లలో మట్టిలో కలిసిపోయాయి. అక్రమ కట్టడం కుప్పకూలింది. అక్రమార్కులకు ఇదో పెద్ద హెచ్చరిక అని అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ, ఈ అక్రమ కట్టడం ఆకాశం ఎత్తు లేచే వరకు సాయం చేసిన అధికారులను ఏం చేశారు? వాళ్లనెలాగూ కూల్చలేం. కనీసం వాళ్ల ఉద్యోగాలనైనా కూల్చారా? కోర్టులు ఈ విషయంలో చొరవ తీసుకున్నట్టు లేదు. ప్రభుత్వాలు నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నాయి. టవర్లు కోర్టు ఆదేశానుసారం కూలిపోయాయి. శిథిలాలు పోగయ్యాయి. ఎంత ఇంకో మూడు నెలల్లో శిథిలాలను తొలగిస్తాం అని నోయిడా మున్సిపల్ అధికారులు మాటిచ్చేశారు. తాము ఖర్చు పెట్టిన రూ.20 కోట్లలో(కూల్చడానికి) టవర్ల నిర్మాణానికి వాడిన స్టీల్‌ను అమ్ముకుంటే రూ.15 కోట్లయినా వస్తాయని వారి అంచనా. మరి ఈ జంట టవర్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎటుపోవాలి? వారు అప్పో సప్పో చేసి ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు. ఇంకా నెలసరి వాయిదాలు(ఈఎంఐలు) చెల్లిస్తూనే ఉంటారు. వీరి గోస ఎప్పుడు తీరేనూ? ఢిల్లీలో సొంతింటి కల నెరవేర్చుకోలేక శివార్లలో ఉన్న నోయిడాలో కాస్త తక్కువ ధరకు ఈ కోరిక తీర్చుకొని ఉంటారు. ఈ రెండు టవర్లను(అపెక్స్, సెయాన్) నిర్మించిన సూపర్‌టెక్ కంపెనీ ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.180 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ డబ్బంతా నిరాశ్రయులైన ఫ్లాట్ యజమానులకు తిరిగి చెల్లించాలి. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బోపన్న, జస్టిస్ పార్దీవాలాల ధర్మాసనం ఈ నెల 26న ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తూ ‘కొనుగోలుదారులందరికీ వారు చెల్లించిన డబ్బు మొత్తం 12% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి’’ అని సూపర్‌టెక్ సంస్థకు స్పష్టం చేసింది. ముందస్తు చర్యగా సూపర్‌టెక్ రూ.1 కోటి మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో సెప్టెంబర్ 30లోగా జమ చేయాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలు అందేది ఎప్పుడో? కోర్టు నియమించిన అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ అక్టోబర్ మొదటివారంలో సూపర్‌టెక్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై కొనుగోలుదారులకు రావాల్సిన బకాయిలను లెక్కతేల్చి సమర్పిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సూపర్‌టెక్ కంపెనీ నెలవారీ ఆదాయం రూ.20 కోట్లని, అందులో రూ.15 కోట్లను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందని అమికస్ క్యూరీ వివరించారు. మిగతా రూ.5 కోట్ల సొమ్మును ఫ్లాట్ల కొనుగోలుదారులకు బకాయిలు చెల్లించేందుకు వినియోగిస్తామన్నారు. 59 మంది కొనుగోలుదారులకు చెల్లించాల్సి ఉందని మిగతా వాళ్లలో చాలామందికి డబ్బు తిరిగి చెల్లించడం గానీ, వేరే టవర్లలో ఫ్లాట్ కేటాయించడం గానీ జరిగిందని సూపర్‌టెక్ యజమాన్యం వెల్లడించింది. కొనుగోలుదార్లలో చాలామందికి ఎంతోకొంత ఇంకా రావాల్సి ఉందని తెలిసింది. టవర్లయితే 12 సెకండ్లలో నేటమట్టమయ్యాయి. కానీ, చివరి కొనుగోలుదారుడికి బకాయిలు అందేసరికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి కొనుగోలుదారులందరికీ వారి కష్టార్జితం వడ్డీతో సహా అందుతుందనే ఆశిద్దాం. వడ్డీ కడుతూనే ఉన్నాం.. సెయాన్‌లో ఫ్లాట్ కొనేందుకు 2011లో రూ.26 లక్షలు అప్పు తీసుకున్నాం. అన్ని అనుమతులు వచ్చాక నిర్మాణం చేపట్టారని నమ్మాం. అందుకే అప్పు తెచ్చి మరీ కొన్నాం. అక్రమ నిర్మాణమని కోర్టులు తేల్చడంతో గుండెలో రాయి పడ్డట్టు అయ్యింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. తెచ్చిన అప్పునకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాం. పెట్టిన డబ్బంతా మా చేతికి వస్తేగానీ కుటుంబం కుదుటపడదు. – కె.వర్మ (ఉద్యోగి) కనువిప్పు కావాలి 2009లో రూ.50 లక్షలు అప్పు తెచ్చి అపెక్స్ టవర్‌లో ఫ్లాట్ బుక్ చేశా. కోరుకున్న చోట ఇల్లు కొంటున్నామన్న సంతోషం కోర్టు ఆదేశంతో నీరుగారిపోయింది. అక్రమ కట్టడమని తేల్చడానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందో అర్థం కాలేదు. అనుమతులన్నీ ఉన్నాయని నిర్మాణ సంస్థ బుకాయించడం కూడా జీర్ణం కాలేదు. విధిలేక ఈ ఫ్లాట్‌కు బదులుగా సూపర్‌టెక్ సంస్థ ఇవ్వజూపిన వేరే ఫ్లాట్‌తో సరిపెట్టుకోవాల్చి వచ్చింది. కూల్చివేతతో వివాదం ముగిసినప్పటికీ డబ్బు చెల్లించాక మాకు ఇష్టమైన ఫ్లాట్‌ను పొందలేకపోయామన్న బాధ మిగిలే ఉంది. అక్రమ నిర్మాణాలకు తెగబడే బిల్డర్లకు, వారితో లాలూచీ పడి కళ్లు మూసుకొని అన్ని అనుమతులు మంజూరు చేసే అధికారులకు ఈ సంఘటన కనువిప్పు కావాలి. – గుప్తా (వ్యాపారి) ఆరంభం నుంచి నేలమట్టం దాకా.. ► 2004: నోయిడా ‘సెక్టార్ 93ఎ’లో గృహ సముదాయం కోసం సూపర్‌టెక్ సంస్థకు స్థలం కేటాయింపు (ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీలో) ► 2005: ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీ భవన నిర్మాణ ప్లాన్‌కు నోయిడా అథారిటీ అనుమతి మంజూరు. 10 అంతస్తుల చొప్పున 14 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి అనుమతి ► 2006: మరింత స్థలం కావాలన్న సూపర్‌టెక్ సంస్థ వినతికి నోయిడా అథారిటీ అంగీకారం. తొలుత అనుమతి ఇచ్చిన భవన నిర్మాణ ప్లాన్‌కు సవరణలు. 14 టవర్లకు బదులుగా మరో టవర్ నిర్మాణానికి ఓకే. దీంతో మొత్తం 15 టవర్లకు అనుమతి ఇచ్చింది. ► 2009: నిర్మాణ సంస్థ మరోసారి ప్లాన్‌ను మార్చి మరో రెండు టవర్ల(అపెక్స్, సెయాన్)ను అదనంగా చేర్చింది. అయితే, ఈ రెండు టవర్లలో 24 అంతస్తులు ఉండేటట్టుగా ప్లాన్ మార్చడంతోపాటు వెంటనే నిర్మాణం కూడా చేపట్టింది. దీనికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ► 2012: నిర్మాణ సంస్థ మరోసారి తన ప్లాన్‌ను సవరించి అపెక్స్, సెయాన్ టవర్లను 40 అంతస్తులకు పెంచింది. నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ► 2012 డిసెంబర్: ఎమెరాల్డ్ కోర్టు సొసైటీలోని కొందరు ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టుకు విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ► 2014: జంట టవర్లను కూల్చివేయాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని నోయిడా అథారిటీని తప్పుపట్టింది. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ► 2014 మే: అనుమతులన్నీ ఉన్నాయంటూ సూపర్‌టెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ► 2021 ఆగస్టు 31: దాదాపు ఏడేళ్ల వాదోపవాదాల తర్వాత జంట టవర్లను కూల్చివేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా పని పూర్తికావాలని ఆదేశించింది. ► 2022 ఫిబ్రవరి: మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ► 2022 మే 17: కూల్చివేత కాల పరిమితిని సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ► 2022 ఆగస్టు 28: జంట టవర్లు నేలమట్టం. సూపర్‌టెక్ సంస్థ నిర్మించిన 15 టవర్ల ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 650 ఫ్లాట్లు ఉన్నాయి. నేలమట్టమైన అపెక్స్, సెయాన్ టవర్లు ఇప్పటికీ నిలిచి ఉంటే మరో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు అదనంగా ఉండేవి. రూ. 31.5 లక్షలు రావాలి ‘‘నేను 2010లో సెయాన్‌లో రూ.42 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ కట్టడం అక్రమమని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే మా కుటుంబం యావత్తూ కుంగిపోయాం. బిల్డర్స్‌తోపాటు నోయిడా అథారిటీ కూడా దీనికి బాధ్యత వహించాలి. అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఎలా మంజూరు చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇదో పెద్ద అవినీతి సౌధం. 12 శాతం వడ్డీతో కలిపి నాకు రూ.80 లక్షలు బకాయిపడ్డారు. ఇందులో భాగంగా వేరేచోట ఇంకో ఫ్లాట్ ఇచ్చారు. అదిపోనూ ఇంకా రూ.31.5 లక్షలు రావాల్సి ఉంది’’ – పునీత్ (వ్యాపారి) -
నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి
నోయిడా: ఉత్కంఠ రేపిన సూపర్‌టెక్ జంట టవర్ల కూల్చివేత ఆదివారం మధ్యాహ్నం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పేలుళ్ల కారణంగా టవర్ల పరిసరాల్లోని రహదారులు, భవనాలు, చెట్లపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగింపు సాయంత్రం నుంచే మొదలైంది. అక్కడికి అత్యంత సమీపంలో ఉన్న ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ సొసైటీల నుంచి ఖాళీ చేయించిన కుటుంబాల్లో సగానికి పైగా తిరిగి తమ నివాసాలకు చేరుకున్నాయి. అధికారులు వారికి విద్యుత్, నీరు, వంటగ్యాస్ సరఫరాలను పునరుద్ధరించారు. తమ నివాసాలు సురక్షితంగా ఉన్నందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారీ పేలుళ్లతో ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ లోపల వెలుపల, ఇతర నివాస ప్రాంతాలు, రహదారులు, పరిసరాల్లోని చెట్లపై దుమ్ముధూళి దట్టంగా పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు ఆదివారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో పనివారిని రంగంలోకి దించారు. 500 మంది సిబ్బందితోపాటు, 100 నీటి ట్యాంకర్లు, 22 యాంటీ స్మోగ్ గన్స్‌లో ఊడ్చటం, తుడవటం వంటి పనులను చేపట్టినట్లు నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరి తెలిపారు. టవర్ల కూల్చివేతతో ఏర్పడిన 80 వేల టన్నుల శిథిలాలను తొలగించేందుకు 3 నెలలు పడుతుందని ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. దీనిని వృథాగా పడేయకుండా రీసైకిల్ చేసి, తిరిగి వినియోగిస్తామని పేర్కొంది. సెల్ఫీలతో జనం సందడి టవర్లు కూలిన తర్వాత సోమవారం కూడా జనం అక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలకు సమీపంలో సెల్పీలు, వీడియోలు తీసుకుంటున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నివాస సముదాయాలను నిర్మించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అధికార బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పెద్ద అబద్ధాల కోరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
కుప్పకూలిన అక్రమం
సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించింది. భవనాల ఎత్తులోనే కాదు.. భయం, బాధ్యత లేని అవి నీతిలోనూ దేశంలోకెల్లా అతి ఎల్తైన జంట ఆకాశహర్మ్యాలు ఎట్టకేలకు కూల్చివేతకు గురయ్యాయి. ఢిల్లీ శివారులో యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో 100 అడుగుల ఎత్తు వివాదాస్పద జంట భవంతులను సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం కూల్చివేసిన ఘటన అనేక విధాల చరిత్రాత్మకం. ఇంతటి భారీ స్థాయి కూల్చివేత జరగడం దేశంలో ఇదే తొలిసారి. ‘వాటర్ ఇంప్లోజన్’ పద్ధతిలో 12 సెకన్లలో చాకచక్యంగా ఆకాశహర్మ్యాల కూల్చివేత పూర్తి చేయడం, చుట్టు పక్కలి ఆవాసాలకు నష్టం వాటిల్లకుండా అతి పెద్ద ప్రక్రియను విజయవంతం చేయడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణ నిబంధనల అతిక్రమణ నుంచి ఇప్పటికైనా పాల కులు నిద్ర నటించడం మానాల్సిన అవసరం దాకా అనేక అంశాల్ని ఈ కూల్చివేత తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ నిబంధనల యథేచ్ఛ ఉల్లంఘనకు నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ అతి పెద్ద ఉదాహరణ. భవన నిర్మాణ సంస్థ సూపర్‌టెక్ డెవలపర్స్‌తో చేతులు కలిపి నోయిడా అధికార యంత్రాంగం సాగించిన అవినీతికి కళ్ళెదుటి సాక్ష్యం. ఈ జంట ఆకాశహర్మ్యాలలో అనుమతించిన వాటికి మించి కట్టిన అంతస్థులు ఎక్కువ. ఒక్కముక్కలో వీటి ఎత్తు ఢిల్లీలోని చరిత్రాత్మక కుతుబ్ మినార్ను మించిపోయింది. పైపెచ్చు ఈ బహుళ అంతస్థుల భవంతులు రెంటికీ మధ్య అంతరం కేవలం 9 మీటర్లే. ఫలితంగా, అనేక నివాసాలకు తగినంత గాలి, వెలుతురు రాని పరిస్థితి. భవన నిర్మాతలపై ఆ ప్రాంగణంలోని నివాసుల సంక్షేమ సంఘం 2012లోనే అలహాబాద్ హైకోర్ట్‌కు వెళ్ళింది. అవినీతి, అక్రమాలను గుర్తించిన కోర్ట్ 2014లోనే టవర్స్‌ను కూల్చివేయాల్సిందిగా ఆదేశించింది. సుప్రీమ్ కోర్ట్ సైతం దాన్ని సమర్థిస్తూ, బయ్యర్ల సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయమంటూ గత ఏడాదే ఆదేశించింది. ఆ కూల్చివేత భారీ పరిమాణం రీత్యా ఇప్పటికి జరిగింది. భవన నిర్మాణ నిబంధనల్ని ఉల్లంఘించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లా విచ్చలవిడిగా సాగుతున్న ఆందోళనకర పరిణామం. నోయిడా ట్విన్ టవర్స్ అందుకు చిరు ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ నిబంధనలు ఏవైనప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ, ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల భవనాలు, బడాబాబుల విల్లాలు, భారీ అపార్ట్మెంట్లు కట్టడం ఇప్పుడు రివాజైంది. స్థానిక అధికార యంత్రాంగం చేతులు తడిపి, నోరు విప్పకుండా సాగుతున్న ఈ ధంధా ఆ పైన ప్రభుత్వాలు తరచూ ప్రకటించే భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో రాజముద్ర వేయించేసుకుంటోంది. తప్పులు చేయడమే కాక, వేలెత్తి చూపినవారిని నిందిస్తూ, రకరకాలుగా సమర్థించుకొనే ప్రయత్నాలకూ మన దగ్గర కొదవ లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదీ గర్భంలో కట్టిన ఇంట్లో మాజీ సీఎం చంద్రబాబు కథ ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్ళ క్రితం చూశాం. అక్రమ కట్టడాల్ని కూల్చివేయడానికి సమకట్టిన ప్రభుత్వంపై అన్యాయం, అధర్మం, దుర్మార్గం అంటూ దుమ్మెత్తిపోయడం గమనించాం. చేసిన తప్పును కప్పిపుచ్చుకొంటూ, కక్షసాధింపు ముద్ర వేయాలనుకోవడం అవివేకం. అలాంటి వారందరికీ తాజా నోయిడా ఉదంతం ఒక చెంపపెట్టు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే – ఈ ట్విన్ టవర్స్ వ్యవహారంలో ఇప్పటి దాకా ప్రభుత్వ అధికారులు, అగ్నిప్రమాద నివారక విభాగం వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం! మన దేశంలోని రాజకీయ, పాలనా యంత్రాంగాల్లోని అవినీతిని ఇది బట్టబయలు చేస్తోంది. ఇప్పటికీ అనేక నగరాల్లో సరైన అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలు సగానికి పైనే ఉంటాయని ఓ అంచనా. నిర్మాణాలపై సరైన నిఘా కానీ, నియంత్రణ కానీ, నిర్ణయాత్మకమైన చర్యలు కానీ లేకపోవడం ఇలాంటి అక్రమార్కులు బరి తెగించడానికి కారణమవుతోంది. ఈ ఉల్లంఘనల్లో భవన నిర్మాతలతో పాటు పాలకుల తప్పు కూడా కొంత లేకపోలేదు. కారణాలు ఏమైనా, స్థానిక ప్రభుత్వాలు తరచూ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్ఎస్) ప్రకటిస్తూ, జరిమానా విధింపుతో నిర్మాణాల్లోని తప్పుల్ని ఒప్పుల్ని చేస్తున్నాయి. బీఆర్ఎస్ను సర్కారీ ఆదాయ అవసరాలను తీర్చే కల్పవృక్షం, కామధేనువుగా చూస్తున్నాయి. భవన నిర్మాతలు సైతం తర్వాత డబ్బు కట్టి, రాజముద్ర వేయించుకోవచ్చనే ధీమాతో ఆది నుంచే అన్ని రూల్సునూ అడ్డంగా అతిక్రమిస్తూ, నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆ పద్ధతి మార్చుకొని, తాజా ఘటనతో భవన నిర్మాణ రంగంలో కొరవడ్డ నమ్మకాన్ని పునరుద్ధరించాలి. పారదర్శకంగా, నియమాలు పాటించాలి. పాలకులు సైతం బీఆర్ఎస్ మంత్రజపం మానుకోవాలి. దోషులని తేలిన అధికారులు, భవన నిర్మాతలపై కఠిన చర్యలు చేపట్టాలి. ట్విన్ టవర్స్ నిర్మించిన సంస్థ మిగిలిన వారికి డబ్బులు వెనక్కి ఇవ్వడమో, ప్రత్యామ్నాయ ఫ్లాట్లు అందించడమో చేసినా, ఇప్పటికీ మరో 59 మంది బయ్యర్లకు న్యాయం జరగలేదు. ఈ అవినీతి హర్మ్యాలపై పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న బీజేపీ, ఎస్పీలు ఆ పని మాని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి. అన్నిచోట్లా బయ్యర్లు ట్విన్ టవర్స్ ప్రాంగణవాసుల లాగా సుదీర్ఘ పోరాటం చేయలేరు గనక నిర్మాణం కన్నా ముందే ప్రభుత్వాలే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఉల్లంఘనల్ని ససేమిరా అనుమతించబోమనే సంకే తాలివ్వాలి. అందుకు తాజా కూల్చివేత తొలి అడుగు కావాలి. అవసరమైతే ఇలాంటి కూల్చివేతలు మరిన్ని జరగాలి. అప్పుడే అందరిలో చైతన్యం పెరుగుతుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. -
ట్విన్ టవర్ల కూల్చివేత, ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు నోయిడా జంట టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆయన ప్రత్యేకత ఉంది. అహాన్ని జయించకపోతే... అది జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలిపే అద్భుత సందేశంతో టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లు కూల్చివేతను జీవిత సత్యంతో అన్వయించారు. నోయిడా టవర్ల కూల్చివేతను మండే మోటివేషన్‌కు ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనలోని ఈగో కొండలా పేరుకుపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన తనకు గుర్తు చేసిందన్నారు. కొండంత ఎత్తుకు చేరిపోయిన అహాన్ని అంతం చేయడానికి పేలుడు పదార్థాల అవససరం పడుతుందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహీంద్ర ఆలోచింపజేసే పోస్ట్‌తో ఏకీభవిస్తున్న ట్విటర్ యూజర్లు ఆయనను ప్రశంసించారు. మండే మోటివేషన్ ట్వీట్‌పై తమదైన శైలిలో కమెంట్ చేస్తున్నారు. తప్పు జరిగిందని అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది. వాస్తవానికి ఏ సమస్యకైనా తొలి పరిష్కారం అహాన్ని జయించడం. అలాకాకుండా ఈగో తిష్టవేసుకుని కూచుందో ఇహ..దాన్ని కూల్చేందుకు విస్ఫోటనం తప్పదు అని మరొక యూజర్ కమెంట్ చేశారు. Why am I using the demolition of the Noida towers for #MondayMotivation ? Because it reminds me of the dangers of letting our egos get too tall. Sometimes we need explosives to demolish the excess ego. pic.twitter.com/qSMl2qSera — anand mahindra (@anandmahindra) August 29, 2022 -
ట్విన్ టవర్ల కూల్చివేత.. ఫ్లాట్‌లో నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
లక్నో: నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఆదివారం అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వాటర్ పాల్ టెక్నిక్‌ను ఉపయోగించి.. బటన్ నొక్కి జంట భవనాలను నేలమట్టం చేశారు. కేవలం 9 సెకన్లలోనే ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే కూల్చివేత ప్రక్రియకు ముందుగానే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను ముందుగానే తాత్కాలికంగా ఖాళీ చేయించారు. ఇ అయితే సమీపంలో షెల్టర్ కల్పించిన వారు మాత్రం ఆదివారం ఉదయం వరకు తమ ఫ్లాట్లలోనే ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు వారు అక్కడి నుంచి షెల్టర్ కేంద్రాలకు వెళ్లారు. చదవండి: Noida Twin Towers Demolition: వ్యర్థాల తొలగింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా! కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంట్లో అలాగే పడుకుండిపోయాడు. ట్విన్ టవర్స్‌కు సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోని టాప్ ఫ్లోర్లో గాఢంగా నిద్రిస్తూ ఉండిపోయాడు. ఖాళీ చేయాల్సిన నిర్ణీత సమయానికి అతడు మేల్కోలేదు. జంట టవర్ల కూల్చివేత ముందు చివరిసారి అన్నిచోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒక టవర్లోని పై అంతస్తు ఫ్లాట్‌లో నిద్రపోతున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు.వెంటనే టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అతడ్ని నిద్ర లేపి అక్కడి నుంచి షెల్టర్‌కు పంపారు.కాగా కూల్చివేత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్ సభ్యుడు తెలిపారు. చదవండి: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి? -
ట్విన్ టవర్స్ కూల్చివేతకు ప్రధాన కారణాలు ఇవే..
-
వారి అవినీతికి ‘ట్విన్ టవర్స్’ సజీవ సాక్ష్యం: డిప్యూటీ సీఎం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్‌ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తర్‌ప్రదేశ్ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాలతో రాజకీయ నాయకులు, బిల్డర్స్, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణానికి 2004లో అనుమతులు లభించాయి. దీంతో అప్పటి సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. ‘సమాజ్ వాదీ పార్టీ అవినీతి, అరాచకాలకు నోయిడా ట్విట్ టవర్స్ సజీవ సాక్ష్యం. నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్పీ అవినీతి భవనం కూలిపోతుంది. ఇదే న్యాయం, ఇదే సుపరిపాలన.’ అని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. नोएडा का सुपरटेक ट्विन टॉवर श्री अखिलेश यादव और सपा के शासनकाल के भ्रष्टाचार और अराजकता की नीति का जीवंत प्रमाण है। आज मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के नेतृत्व में भाजपा की सरकार में सपा के भ्रष्टाचार की इमारत ढहेगी। यह है न्याय, यही सुशासन।#TwinTowers — Keshav Prasad Maurya (@kpmaurya1) August 28, 2022 డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపణలను తిప్పికొట్టింది సమాజ్ వాదీ పార్టీ. ‘ఈ అవినీత కట్టడం నిర్మించటానికి బీజేపీ సైతం కారణం. బీజేపీకి సూపర్‌టెక్ భారీగా నిధులు ముట్టజెప్పింది. కాషాయ పార్టీకి చెందిన ఆఫీసులో కూర్చుని ఓ బ్రోకర్ అందుకు బ్రోకరేజ్ అందుకున్నాడు.’ అని ఆరోపించింది. ఇదీ చదవండి: Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే.. -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి?
నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరిగిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై ఉత్కంఠకు తెరపడింది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఈ కూల్చివేతపై.. ట్విన్ టవర్స్ నిర్మాణ సంస్థ సూపర్ టెక్ స్పందించింది. నోయిడా డెవలప్మెంట్ అధికారులు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే కూల్చేసిన జంట భవనాల్ని నిర్మించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదని సూపర్ టెక్ అధినేత ఆర్కే అరోరా స్పష్టం చేశారు. టవర్స్ కూల్చివేయడంపై ఇప్పటికే సూపర్ టెక్ నుంచి ఇళ్ల కొనుగోళ్ల కోసం అడ్వాన్స్‌లు చెల్లించిన కస్టమర్ల ఆందోళనపై స్పందించారు. కంగారు పడొద్దు. "మేం 70వేల కంటే ఎక్కువ యూనిట్లను కొనుగోలు దారులకు డెలివరీ చేశాం. మిగిలిన వారికి షెడ్యూల్ టైమ్ ప్రకారం డెలివరీ అందించేందుకు కట్టుబడి ఉన్నాం. సుప్రీం కోర్ట్ ఉత్తర్వుతో ట్విన్ టవర్స్‌ను కూల్చేస్తున్నామని, ఆ ప్రభావం మా సంస్థ నుంచి కొనసాగుతున్న ఇతర ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపదని ఆర్కే అరోరా అన్నారు. సుప్రీం తీర్పు మాకు శిరోధార్యం "నోయిడాలోని ట్విన్ టవర్స్ 'అపెక్స్', 'సెయానే'లు సెక్టార్ 93ఏ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. నోయిడా అథారిటీ కేటాయించిన భూమిలో నిర్మించబడింది. 2009లో రెండు టవర్లతో సహా ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ ప్రణాళికలను నోయిడా అథారిటీ ఆమోదించింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్ బై చట్టాలకు అనుగుణంగా నిర్మించాం." అని ఆర్కే అరోరా పేర్కొన్నారు. "అయితే, మేం నిర్మించిన జంట భవనాల వల్ల సాంకేతిక కారణాల్ని ఎత్తి చూపిస్తూ రెండు టవర్లను కూల్చివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తా. తీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. చదవండి👉 ట్విన్ టవర్స్ కూల్చివేతలో మీకు తెలియని ఆసక్తికర విషయాలు! -
కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ (ఫొటోలు)
-
నేలమట్టమైన నోయిడా ట్విన్ టవర్స్
-
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. వ్యర్థాల తరలింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా!
లక్నో: నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై దేశమంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. వాటర్ పాల్ టెక్నిక్‌ను ఉపయోగించి..100 మీటర్ల దూరం నుంచి అధికారులు బటన్‌ను నొక్కడం ద్వారా టవర్లు నేలమట్టమయ్యాయి. 9 సెకన్లలోనే రెండు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాలు కూలడంతో దాదాపు 40 మీటర్లమేర దట్టమైన పొగ కమ్ముకుంది. చదవండి: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోపే.. అయితే ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. 55,000 నుంచి 80 వేల టన్నుల శిథిలాలను తరలించనున్నారు. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఇక ఈ రెండు భవనాల్లో ఒకటి 103 మీటర్ల ఎత్తు, మరొకటి 97 మీటర్ల ఎత్తు ఉన్నాయి. చదవండి: మీకు తెలియని ఆసక్తికర విషయాలు : ట్విన్ టవర్స్ కూలడానికి ఆ నలుగురే కారణం! కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు అవుతుండగా... 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు కూల్చివేతకు రూ. 20కోట్లు ఖర్చు అవుతోంది. రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ భవనాల ప్రస్తుత విలువ అక్షరాల 1, 200 కోట్లు. #WATCH | Noida, UP: Rubble of demolished #SupertechTwinTowers laid bare along with a cloud of dust in the vicinity after the demolition pic.twitter.com/0jxd4VVh0l — ANI (@ANI) August 28, 2022 ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు. #WATCH | 'Controlled implosion' turns Noida's #SupertechTwinTowers to dust pic.twitter.com/zDksI6lfIF — ANI (@ANI) August 28, 2022 దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అంతేగాక నోయిడాలోని ఓ స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగి ఇప్పటివరకు పరిసరాల్లోని 35 వీధి కుక్కలనుపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. -
పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 9 సెకండ్లలోనే పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు ముందుగానే స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్‌ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేశారు. ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చైతే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. అదే విధంగా ఆ దారిలో వచ్చే వాహనాలను మళ్లించారు. #WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws pic.twitter.com/pPNKB7WVD4 — ANI (@ANI) August 28, 2022 -
మీకు తెలియని ఆసక్తికర విషయాలు: ట్విన్ టవర్స్ కూలడానికి ఆ నలుగురే కారణం!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేశారు. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చి వేసింది. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ట్విన్ టవర్స్ కూల్చి వేతపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ►సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఆగస్ట్ 8 నుంచి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నోయిడా అధికారులు ఆధ్వర్యంలో ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థతో కూల్చివేత పనుల్ని ప్రారంభించారు. ►జంట భవనాల కూల్చి వేత పనుల్ని పూర్తి చేసినట్లు నోయిడా పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. భవనాల్ని నేల మట్టం చేసేందుకు సహాయక చర్యల కోసం 560మంది పోలీసులు, 100 రిజర్వ్ పోర్స్ సిబ్బంది, 4 క్విక్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగినట్లు చెప్పారు. ►ట్విన్ టవర్స్‌ను సెకన్ల వ్యవధిలో నేల మట్టం చేసేందుకు జంట భవనాల్లో 3,700 కేజీలకు పైగా పేలుడు పదార్థాల్ని నింపారు. ఇందుకోసం పిల్లర్స్‌కు సుమారు 7వేల రంద్రాలు చేశారు. వాటర్ ఫాల్ టెక్నిక్‌తో ఒక్క బటన్ నొక్కగానే సెకన్ల వ్యవధిలో కూల్చేందుకు 20వేల సర్క్యూట్‌ను సిద్ధం చేశారు. ►ప్రాజెక్ట్ ఇంజినీర్ల వివరాల ప్రకారం.. సూపర్‌టెక్ భవనాల్ని కూల్చే సమయం 9 సెకన్లు పడుతుంది. కూలిన వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో 12 నిమిషాల పాటు దట్టమైన శిధిలా పొగ కమ్ముకుంటుంది. కూల్చివేతతో 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాలు సేకరించే అవకాశం ఉండగా.. వాటిని తరలించేందుకు 3నెలల సమయం పట్టనుంది. ► కూలే సమయంలో కొన్ని సెకన్ల పాటు 30 మీటర్ల రేడియస్ వరకు కంపించనుంది. పేలుడు 30 మీటర్ల అధికారుల ప్రకారం, ఈ ప్రకంపనల పరిమాణం సెకనుకు దాదాపు 30మిల్లీ మీటర్లు ఉండవచ్చు. రిక్టర్ స్కేలుపై 0.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఎలా కంపిస్తుందో.. కూల్చి వేత సమయంలో నోయిడా టవర్స్ కంపిస్తాయి. ఇక 6 వరకు భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడిందని అధికారులు తెలిపారు. ► ట్విన్ టవర్స్ చుట్టు పక్కల సుమారు 7వేల కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తిరిగి వాళ్లు సాయంత్రం 5.30గంటలకు రావొచ్చని అన్నారు. కూల్చి వేతతో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్థానిక నివాసాల్లో గ్యాస్, పవర్ సప్లయ్ నిలిపివేశారు. సాయంత్రం 4 గంటలకు కరెంట్, గ్యాస్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ► సెక్టాకర్ 93ఏలో ట్విన్ టవర్స్‌ను నిర్మించిన ప్రాంతం చుట్టూ 450 మీటర్ల వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. బ్లాస్ట్ అనంతరం అంటే మధ్యాహ్నం 2.15 నుంచి 2.45గంటల వరకు వాహనాల రాకపో కలు ఆగిపోనున్నాయి. ► ట్విన్ టవర్స్ పక్కనే 8 మీటర్ల దూరంలో, మరికొన్ని 12 మీటర్ల దూరంలో భవనాలున్నాయి. దుమ్ము వ్యాప్తిని తగ్గించడానికి టవర్స్‌ను ప్రత్యేక వస్త్రంతో కప్పారు. ఈ ప్రాంతాన్ని ఒక నాటికల్ మైలు మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ► రూ. 100 కోట్ల బీమా పాలసీ కింద కూల్చివేత ప్రక్రియ జరుగుతుంది . ఈ బీమా ట్విన్ టవర్స్ పక్కనే ఉన్న భవనాలకు ప్రమాదం జరిగితే..నష్ట పరిహారంగా చెల్లించనున్నారు. ప్రీమియం, ఇతర ఖర్చులను సూపర్‌టెక్ భరించాలి. కూల్చివేత ప్రాజెక్ట్‌కు రూ. 20 కోట్ల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. కూల్చివేతతో టవర్స్ నిర్మాణం కోసం ఉపయోగించిన ఉత్త ఇనుము వల్లే సుమారు రూ.50కోట్లకు పైగా నష్టం. ► ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ అనే సంస్థ తొమ్మిదేళ్ల న్యాయపోరాటం తర్వాత రెండు టవర్లను కూల్చివేసే బాధ్యతను అప్పగించింది. ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా టవర్లను నిర్మించారని సుప్రీంకోర్టు గుర్తించిన తర్వాత వాటిని కూల్చేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నోయిడా అధికారులతో కలిసి పని చేసింది. ►ఒక్కో టవర్‌లో 40 అంతస్తులు నిర్మించాలని బిల్డర్ ప్లాన్ చేశారు. కోర్టు ఆదేశాల కారణంగా కొన్ని అంతస్తులు నిర్మించలేకపోయినా, పేలుడుకు ముందు కొన్ని మాన్యువల్‌గా విరిగిపోయాయి. టవర్లలో ఒకటైన అపెక్స్‌లో 32 అంతస్తులను కలిగి ఉంది. సెయానేలో 97ప్లాట్లు ఉన్నాయి. మరొకటి 29. అపెక్స్ 103 మీటర్ల పొడవు ఉండగా, సెయానే 97 వద్ద ఉంది. ప్లాన్ ప్రకారం 900+ ఫ్లాట్లు ఉన్నాయి, వీటిలో మూడింట రెండు వంతులు బుక్ చేయబడ్డాయి. మరికొన్నింటిని అమ్మేశారు. నిర్మాణంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని డెవలపర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ►9 ఏళ్ల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత జంట టవర్లను కూల్చివేస్తున్నారు. సవరించిన బిల్డింగ్ ప్లాన్‌లో భాగంగా ఈ టవర్లు నిర్మాణానికి ఆమోదం లభించింది. ఆ ఆమోదంపై సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీకి చెందిన నలుగురు స్థానికులు యూఎస్బీ తోతియా(80), ఎస్కే శర్మ(74), రవి బజాజ్ (65), ఎంకే జైన్ (59) నివాసితులు 2012లో కోర్టును ఆశ్రయించారు. మొదట్లో ఉద్యానవనం ఉన్న స్థలంలో టవర్లను నిర్మించినట్లు వారు తెలిపారు. అనుమతుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014లో అలహాబాద్ హైకోర్టు కూల్చివేతకు ఆదేశించగా..ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది. చదవండి👉 ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం
-
టిక్ టిక్ టిక్.. నోయిడా జంట భవనాల కూల్చివేత
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి. భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ సీఈఓ ఉత్కర్ మెహతా శనివారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ 150 శాతం సురక్షితమైనదని హామీ ఇచ్చారు. వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ టెక్నిక్ ఈ తరహా భవనాలు కూల్చివేయడానికి మూడు మార్గాలున్నాయి. డైమండ్ కటర్, రోబోటిక్ టెక్నిక్, పేలుడు పదార్థాలు.. ఇలా మూడు రకాలుగా భవనాల్ని కూల్చేయవచ్చు. అయితే కూల్చడానికయ్యే ఖర్చు, సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్‌ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్‌ను 1773లో ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. 2020లో కేరళలోని కొచికి సమీపంలో మారాడు పట్టణంలో కోస్తా తీర ప్రాంత నిబంధనలను అతిక్రమించి నిర్మించిన నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కూడా పేలుడు పదార్థాలను వినియోగించి కూల్చివేశారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది. వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు జంట భవనాల కూల్చివేత సమయంలో తమ ఇళ్లకి ఏం జరుగుతుందోనని, దుమ్ము ధూళి కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల కూల్చివేత సమయంలో వచ్చే ధూళి కొన్ని వారాల పాటు గాల్లోనే ఉండడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో నోయిడా ముందు వరసలోనే ఉంది. ఇప్పుడు వాయుకాలుష్యం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆ భవనాల పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్‌లో ఉంటున్న 5 వేల మందికిపైగా ఆదివారం ఉదయం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లనున్నారు. ‘‘మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. భవనాల కూల్చివేత సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మా ఇళ్లు ఏమయిపోతాయోనన్న భయాన్ని మాటల్లో చెప్పలేను’’ అని సీనియర్ రెసిడెంట్ ఆర్కె రస్తోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎస్ విలేజ్‌లో నివాసం ఉండే మౌసమి భవనాల కూల్చివేసిన తర్వాత ఏర్పడే దుమ్ము, ధూళికి ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012 రెండు జంట భవనాలు : అపెక్స్ (32 అంతస్తులు), సియాన్ (29 అంతస్తులు) భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600 నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా టవర్స్ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు -
ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంత ఖర్చా?.. ఎంత నష్టమంటే..
ఏళ్ల తరబడి ఆలోచన.. ఇంజనీర్ల ప్లాన్లు.. వందల నుంచి వేల మంది కూలీల కష్టం. దాదాపు మూడేళ్లపాటు శ్రమించి నిర్మించిన బిల్డింగులు. అలాంటి ఆకాశ హర్మ్యాలను కేవలం.. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం నేల మట్టం చేయబోతున్నారు. అయితే తమకిది సింపుల్ వ్యవహారం అంటున్నారు సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం బటన్ నొక్కనున్న చేతన్ దత్తా. ఆగస్టు 28, నొయిడా(New Okhla Industrial Development Authority) 93A సెక్టార్‌లోని జంట టవర్లు పేకమేడల్లా కూలిపోనున్నాయి. సూపర్‌టెక్ ట్విన్ టవర్లను కూల్చివేయడానికి బటన్‌ను నొక్కడం.. ఒక సాధారణ ప్రక్రియ అని అంటున్నారు బ్లాస్టింగ్ వ్యవహారాలను చూసుకునే చేతన్ దత్తా . ► ఇది చాలా తేలికైన వ్యవహారం. డైనమో నుంచి విద్యుత్‌ను పుట్టిస్తాం. ఆ తర్వాత బటన్‌ను ప్రెస్ చేస్తాం. ఇది 9 సెకన్లలో అన్ని షాక్ ట్యూబ్‌లలోని డిటోనేటర్లను మండిస్తుంది. మేం 50-70 మీటర్ల దూరంలో ఉంటాం. కానీ, మాకేం ప్రమాదం ఉండదు. కూల్చివేత సజావుగా సాగాలని మేం అనుకుంటున్నాం. బ్లాస్టింగ్ ఏరియా మొత్తం నాలుగు లేయర్ల ఇనుప జాలీలతో కవర్ అయ్యి ఉంటుంది. అలాగే రెండు లేయర్ల బ్లాంకెట్లను కప్పుతున్నాం. కాబట్టి, శిథిలాలు ఏవీ కూడా వాటిని దాటి బయటకు రాలేవు. కాకపోతే దుమ్ము మాత్రం రావొచ్చు అని చేతన్ దత్తా వెల్లడించారు. ► కేవలం తొమ్మిది సెకన్లలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. పేలుడు ధాటి, కూల్చివేత ప్రభావాల నేపథ్యంలో వైబ్రేషన్‌ను తగ్గించేందుకు కుషన్లను ఏర్పాటు చేశారు. ► చుట్టుపక్కల ఎమెరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీలు ఉన్నాయి. సుమారు ఐదు వేల మంది జీవిస్తున్నారు అక్కడ. అందుకే.. ఉదయం నుంచే వాళ్లను ఖాళీ చేయించి, తిరిగి పేలుడు అయ్యాక సాయంత్రం పూట వాళ్లను సేఫ్టీ క్లియరెన్స్ అనంతరం ఇళ్లలోకి అనుమతిస్తారు. ► మాస్క్‌లు, ఐ గ్లాస్లు ధరించాలని ఇప్పటికే సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా.. ఆంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. అలాగే ఫ్లెక్స్ ఆస్పత్రిలో 50 బెడ్లను సిద్ధంగా ఉంచారు. ట్రాఫిక్ మళ్లింపు సైతం ఉండనుంది. ► కూల్చివేతకు హర్యానా నుంచి తెప్పించిన 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► కూల్చివేత తర్వాత 32 అంతస్థులు, 29 అంతస్థుల బిల్డింగులు.. 35వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలను మిగల్చొచ్చనే అంచనాలో ఉన్నారు. 55 వేల టన్నుల శిథిలాలను ఎత్తి పారబోయడానికి కనీసం మూడు నెలలైనా పట్టొచ్చు. ఆగస్టు 21నే ఈ కూల్చి వేత జరగాల్సి ఉన్నప్పటికీ.. నొయిడా అథారిటీ విజ్ఞప్తి మేరకు మరో వారం ముందుకు జరిగింది. ► సుప్రీం కోర్టు ఆదేశాల అనుసారం.. సూపర్‌టెక్ సంస్థ ఈ కూల్చివేత ఖర్చులను భరించనుంది. అలాగే.. నొయిడా అథారిటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ కూల్చివేతను పర్యవేక్షించనున్నాయి. ► ఆగస్టు 28న గనుక ఏ పరిస్థితులతో అయినా కూల్చివేతను వాయిదా వేయాల్సి వస్తే.. వారం రోజుల్లో ఎప్పుడైనా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చని సుప్రీం కోర్టు సూచించింది. కానీ, ఆ గడువును మాత్రం దాటొద్దని హెచ్చరించింది. ► నొయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ► ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేయబోతున్న నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్ల(అపెక్స్, సెయానే టవర్లు) నిర్మాణ వ్యయం చదరపు అడుగులకు (చదరపు అడుగు) రూ. 933 వెచ్చించి మొత్తం 7.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం కలిగి ఉంది. ఈ లెక్క అప్పటి అంచనా ప్రకారం మొత్తం రూ.70 కోట్లు. అయితే, ► దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవశక్తి మరియు పరికరాలు అవసరం. ► సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో ఒక 3BHK అపార్ట్మెంట్ ధర దాదాపు రూ. 1.13 కోట్లు. ఈ రెండు భవనాల్లో దాదాపు 915 ఫ్లాట్లు ఉన్నాయని, వాటి ద్వారా కంపెనీకి దాదాపు రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చేది. ► మొత్తం 915 ఫ్లాట్లలో దాదాపు 633 ఫ్లాట్లు బుక్ చేయబడ్డాయి మరియు కంపెనీ గృహ కొనుగోలుదారుల నుండి దాదాపు 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు, సూపర్టెక్ని 12 శాతం వడ్డీతో గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని కోరింది. ► ఇది కాకుండా.. పేలుడు సమయంలో చుట్టుపక్కల ఏమైనా డ్యామేజ్లు జరిగితే!. ఇందుకోసం బిల్డింగ్ కూల్చివేత బాధ్యతలను తీసుకున్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ రూ.100 కోట్ల ఇన్సూరెన్స్‌కు వెళ్లింది. ► కూల్చివేతకు అయ్యే మొత్తం కాస్ట్.. అక్షరాల రూ.20 కోట్ల రూపాయలు. ఇందులో సూపర్‌టెక్ కంపెనీ ఐదు కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వనుంది. మిగతా పదిహేను కోట్ల రూపాయలు.. శిథిలాలు అమ్మకం(అందులో నాలుగు వేల టన్నుల స్టీల్ కూడా ఉంటుంది) ద్వారా సేకరించనుంది. ► నొయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. ► పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. ► నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. ఆ దూరం ఉండి ఉంటే.. ఇప్పుడు ఇంత భారీ విధ్వంసానికి తెర లేచేదే కాదు. ► నిబంధనల ఉల్లంఘనపై.. ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా రెండు భవనాలను కూల్చివేసి, అపార్ట్మెంట్ కొనుగోలుదారులకు డబ్బు వాపసు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 11, 2014 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ.. గృహ కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ.. ► దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు 2022 ఆగష్టు నెలను తుది గడువు ప్రకటించింది. ► ఇది నోయిడా అథారిటీ మరియు సూపర్టెక్ల మధ్య "అనుకూలమైన సంక్లిష్టత" ఫలితమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ► కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ జంట భవనాల కూల్చివేతను.. దేశంలోనే ఇప్పటిదాకా ఎత్తైన భవనాల కూల్చివేతగా చెప్తున్నారు. అందుకే ఈ కూల్చివేత ఒక చారిత్రక ఘట్టంగా దేశ చరిత్రలో నిలిచిపోనుంది. -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఏర్పాట్లు పూర్తి
-
Noida twin towers: కట్టేందుకు మూడేళ్లు... కూల్చేందుకు...తొమ్మిదే సెకన్లు
మూడేళ్ల పాటు నిర్మించిన ఆకాశ హర్మ్యాలవి. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం కానున్నాయి. నోయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకూ ఈ ట్విన్ టవర్స్‌ను ఎలా కూలుస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆగస్టు 28. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ జంట భవనాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తులున్న ఈ భవనాలను ఆగస్టు 21నే కూల్చేయాల్సి ఉన్నా భద్రతా ఏర్పాట్లకు అధికారులు గడువు కోరడంతో 28కి వాయిదా పడింది. ఏం జరిగింది? నోయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. దాంతో ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు ఈ నెలలో తుది గడువు ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లు ఇలా ? ► ఇంత ఎత్తైన భవనాల కూల్చివేత వల్ల పరిసర ప్రాంతాలకు, ఇతర నివాసాలకు నష్టం లేకుండా చూడటం సవాలుగా మారింది. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు చేపట్టారు. ► ట్విన్ టవర్స్ సమీపంలోనిఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీస్‌లో నివసిస్తున్న 5 వేల మందిని ఆగస్టు 28న ఖాళీ చేయిస్తున్నారు. ఉదయం 7.30కి ఇళ్లు వీడి, సాయంత్రం ఎడిఫస్ కంపెనీ చెప్పాకే తిరిగి రావాలి. ► వారికి చెందిన 1200 వాహనాలను కూడా తరలిస్తున్నారు. ► టవర్స్ సమీపంలోని నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకల్ని మధ్యాహ్నం 2.15 నుంచి 2.45వరకు నిలిపివేస్తారు. ► జంట భవనాలున్న ప్రాంతంలోకి ఆగస్టు 28 రోజంతా ప్రజలు, వాహనాలు, జంతువులు ఎవరినీ రానివ్వరు. ► చుట్టుపక్కల భవనాల్లోకి ధూళి, సిమెంట్ ముక్కలు పోకుండా మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. ► పేల్చివేతతో చుట్టుపక్కల భవనాలకు నష్టం జరగకుండా జంట భవనాల చుట్టూ కందకం తవ్వారు. అదనపు భద్రత కోసం మధ్యలో అతి పెద్ద కంటైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది! ► అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇలా కూలుస్తారు... ► కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30కు కంట్రోల్డ్ ఇంప్లోజన్ టెక్నిక్ సాయంతో కూల్చివేత జరుగుతుంది. ► రెండు భవనాలూ తొమ్మిది సెకండ్లలో పేక మేడలా నేలకొరుగుతాయి. దీన్ని ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ► 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. ► కూల్చివేతకు 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► సియాన్ టవర్‌లో పేలుడు పదార్థాలు నింపడం పూర్తయింది. ఎపెక్స్నూ పూర్తి కావచ్చింది. ► హర్యానాలోని పల్వాల్లో పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నుంచి పేలుడు పదార్థాలు తెప్పిస్తున్నారు. ► కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. ► కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా. వీటి తొలగింపుకే కనీసం మూణ్నెల్లు పడుతుంది. వీటి డంపింగ్‌కు సూపర్‌టెక్ కంపెనీ 5 హెక్టార్లు కేటాయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌కు పేరు ఖరారైంది. ట్విన్ టవర్స్‌గా పిలుస్తున్న దీన్ని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ)గా నామకరణం చేశారు. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. వాస్తవానికిది నాలుగు టవర్స్‌తో కూడిన సముదాయం. టీఎస్ఐసీసీసీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నతాధికారులకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. 2015 నవంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభమైంది. గురువారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తదితరులు ‘టీఎస్ఐసీసీసీ’ని సందర్శించి పనులపై సమీక్షించారు. 83.4 మీటర్లకు పరిమితం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఏడెకరాల్లో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. అప్పుడున్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్‌లో 15 మీటర్లకు మించిన ఎత్తులో నిర్మాణాలు జరపకూడదు. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి పురపాలక శాఖ అనుమతి ఇచ్చింది. మరోపక్క ఇంత ఎత్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 83.4 మీటర్ల ఎత్తుతో నిర్మించుకోవడానికి సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతించింది. ఈ మేరకు పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ‘టీఎస్ఐసీసీసీ’లో స్వరూప, స్వభావాలివీ.. నగర పోలీసు కమిషనరేట్ ఆగస్టు ఆఖరు కల్లా టీఎస్‌ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్ కార్యాలయం ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తదితరాలు సైతం అక్కడికే వెళ్తాయి. నాలుగు బ్లాకుల్లో (ఏ, బీ, సీ, డీ) 5.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు. బ్లాక్–ఏలో 20 అంతస్తులు (16216 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–బీలో 18 అంతస్తులు (12320 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–సీలో జీ+2 ఫ్లోర్లు (7920 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–డీలో జీ+1 ఫ్లోర్ (2230 చదరపు మీటర్లు విస్తీర్ణం). పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్‌తో నిర్మించే ఈ టవర్స్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ. భవనంపై హెలిప్యాడ్, 17వ అంతస్తులో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం ఉంటాయి. 900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి ఉంది. (చదవండి: పేపర్ లీక్ వ్యవహారం.. ఐదుగురు అధికారుల సస్పెన్షన్)