సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించింది. భవనాల ఎత్తులోనే కాదు.. భయం, బాధ్యత లేని అవి నీతిలోనూ దేశంలోకెల్లా అతి ఎల్తైన జంట ఆకాశహర్మ్యాలు ఎట్టకేలకు కూల్చివేతకు గురయ్యాయి. ఢిల్లీ శివారులో యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో 100 అడుగుల ఎత్తు వివాదాస్పద జంట భవంతులను సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం కూల్చివేసిన ఘటన అనేక విధాల చరిత్రాత్మకం. ఇంతటి భారీ స్థాయి కూల్చివేత జరగడం దేశంలో ఇదే తొలిసారి. ‘వాటర్ ఇంప్లోజన్’ పద్ధతిలో 12 సెకన్లలో చాకచక్యంగా ఆకాశహర్మ్యాల కూల్చివేత పూర్తి చేయడం, చుట్టు పక్కలి ఆవాసాలకు నష్టం వాటిల్లకుండా అతి పెద్ద ప్రక్రియను విజయవంతం చేయడం విశేషం.
వివిధ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణ నిబంధనల అతిక్రమణ నుంచి ఇప్పటికైనా పాల కులు నిద్ర నటించడం మానాల్సిన అవసరం దాకా అనేక అంశాల్ని ఈ కూల్చివేత తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ నిబంధనల యథేచ్ఛ ఉల్లంఘనకు నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ అతి పెద్ద ఉదాహరణ. భవన నిర్మాణ సంస్థ సూపర్‌టెక్ డెవలపర్స్‌తో చేతులు కలిపి నోయిడా అధికార యంత్రాంగం సాగించిన అవినీతికి కళ్ళెదుటి సాక్ష్యం. ఈ జంట ఆకాశహర్మ్యాలలో అనుమతించిన వాటికి మించి కట్టిన అంతస్థులు ఎక్కువ. ఒక్కముక్కలో వీటి ఎత్తు ఢిల్లీలోని చరిత్రాత్మక కుతుబ్ మినార్‌ను మించిపోయింది.
పైపెచ్చు ఈ బహుళ అంతస్థుల భవంతులు రెంటికీ మధ్య అంతరం కేవలం 9 మీటర్లే. ఫలితంగా, అనేక నివాసాలకు తగినంత గాలి, వెలుతురు రాని పరిస్థితి. భవన నిర్మాతలపై ఆ ప్రాంగణంలోని నివాసుల సంక్షేమ సంఘం 2012లోనే అలహాబాద్ హైకోర్ట్‌కు వెళ్ళింది. అవినీతి, అక్రమాలను గుర్తించిన కోర్ట్ 2014లోనే టవర్స్‌ను కూల్చివేయాల్సిందిగా ఆదేశించింది. సుప్రీమ్ కోర్ట్ సైతం దాన్ని సమర్థిస్తూ, బయ్యర్ల సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయమంటూ గత ఏడాదే ఆదేశించింది. ఆ కూల్చివేత భారీ పరిమాణం రీత్యా ఇప్పటికి జరిగింది.
భవన నిర్మాణ నిబంధనల్ని ఉల్లంఘించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లా విచ్చలవిడిగా సాగుతున్న ఆందోళనకర పరిణామం. నోయిడా ట్విన్ టవర్స్ అందుకు చిరు ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ నిబంధనలు ఏవైనప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ, ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల భవనాలు, బడాబాబుల విల్లాలు, భారీ అపార్ట్‌మెంట్లు కట్టడం ఇప్పుడు రివాజైంది. స్థానిక అధికార యంత్రాంగం చేతులు తడిపి, నోరు విప్పకుండా సాగుతున్న ఈ ధంధా ఆ పైన ప్రభుత్వాలు తరచూ ప్రకటించే భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో రాజముద్ర వేయించేసుకుంటోంది.
తప్పులు చేయడమే కాక, వేలెత్తి చూపినవారిని నిందిస్తూ, రకరకాలుగా సమర్థించుకొనే ప్రయత్నాలకూ మన దగ్గర కొదవ లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదీ గర్భంలో కట్టిన ఇంట్లో మాజీ సీఎం చంద్రబాబు కథ ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్ళ క్రితం చూశాం. అక్రమ కట్టడాల్ని కూల్చివేయడానికి సమకట్టిన ప్రభుత్వంపై అన్యాయం, అధర్మం, దుర్మార్గం అంటూ దుమ్మెత్తిపోయడం గమనించాం. చేసిన తప్పును కప్పిపుచ్చుకొంటూ, కక్షసాధింపు ముద్ర వేయాలనుకోవడం అవివేకం. అలాంటి వారందరికీ తాజా నోయిడా ఉదంతం ఒక చెంపపెట్టు.
దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే – ఈ ట్విన్ టవర్స్ వ్యవహారంలో ఇప్పటి దాకా ప్రభుత్వ అధికారులు, అగ్నిప్రమాద నివారక విభాగం వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం! మన దేశంలోని రాజకీయ, పాలనా యంత్రాంగాల్లోని అవినీతిని ఇది బట్టబయలు చేస్తోంది. ఇప్పటికీ అనేక నగరాల్లో సరైన అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలు సగానికి పైనే ఉంటాయని ఓ అంచనా. నిర్మాణాలపై సరైన నిఘా కానీ, నియంత్రణ కానీ, నిర్ణయాత్మకమైన చర్యలు కానీ లేకపోవడం ఇలాంటి అక్రమార్కులు బరి తెగించడానికి కారణమవుతోంది. ఈ ఉల్లంఘనల్లో భవన నిర్మాతలతో పాటు పాలకుల తప్పు కూడా కొంత లేకపోలేదు. కారణాలు ఏమైనా, స్థానిక ప్రభుత్వాలు తరచూ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్‌ఎస్) ప్రకటిస్తూ, జరిమానా విధింపుతో నిర్మాణాల్లోని తప్పుల్ని ఒప్పుల్ని చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను సర్కారీ ఆదాయ అవసరాలను తీర్చే కల్పవృక్షం, కామధేనువుగా చూస్తున్నాయి. భవన నిర్మాతలు సైతం తర్వాత డబ్బు కట్టి, రాజముద్ర వేయించుకోవచ్చనే ధీమాతో ఆది నుంచే అన్ని రూల్సునూ అడ్డంగా అతిక్రమిస్తూ, నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆ పద్ధతి మార్చుకొని, తాజా ఘటనతో భవన నిర్మాణ రంగంలో కొరవడ్డ నమ్మకాన్ని పునరుద్ధరించాలి. పారదర్శకంగా, నియమాలు పాటించాలి.
పాలకులు సైతం బీఆర్‌ఎస్ మంత్రజపం మానుకోవాలి. దోషులని తేలిన అధికారులు, భవన నిర్మాతలపై కఠిన చర్యలు చేపట్టాలి. ట్విన్ టవర్స్ నిర్మించిన సంస్థ మిగిలిన వారికి డబ్బులు వెనక్కి ఇవ్వడమో, ప్రత్యామ్నాయ ఫ్లాట్లు అందించడమో చేసినా, ఇప్పటికీ మరో 59 మంది బయ్యర్లకు న్యాయం జరగలేదు. ఈ అవినీతి హర్మ్యాలపై పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న బీజేపీ, ఎస్పీలు ఆ పని మాని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి. అన్నిచోట్లా బయ్యర్లు ట్విన్ టవర్స్ ప్రాంగణవాసుల లాగా సుదీర్ఘ పోరాటం చేయలేరు గనక నిర్మాణం కన్నా ముందే ప్రభుత్వాలే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఉల్లంఘనల్ని ససేమిరా అనుమతించబోమనే సంకే తాలివ్వాలి. అందుకు తాజా కూల్చివేత తొలి అడుగు కావాలి. అవసరమైతే ఇలాంటి కూల్చివేతలు మరిన్ని జరగాలి. అప్పుడే అందరిలో చైతన్యం పెరుగుతుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment