
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం నగర పోలీసు విభాగానికి పెద్దపీట వేసింది. హోంశాఖకు మొత్తం రూ.1389.66 కోట్లు కేటాయించగా... ఇందులో రూ.574.2 కోట్లు (41.3 శాతం) నగర పోలీసు విభాగానికి దక్కాయి. ‘ట్విన్ టవర్స్’గా పిలిచే బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మించనున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (ఐసీసీసీ) మూడో విడతగా రూ.280.8 కోట్లు కేటాయించడం గమనార్హం. ‘పది లక్షల కళ్ల’ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాజెక్టుకు రూ.140 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.509 కోట్లు కేటాయించగా... ఈసారి కేటాయింపులు రూ.63 కోట్లు పెరిగాయి. పోలీసు అధికారులు ప్రతిపాదనలకు అనుగుణంగానే కేటాయింపులు ఉండటం విశేషం. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు రూ.42.97 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి. దాదాపు రెండేళ్ల క్రితం ఏర్పడిన రాచకొండకు పోలీసు కమిషనరేట్ నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించింది.
ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు..
బంజారాహిల్స్‌లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్‌లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.280.8 కోట్లు కేటాయించారు. నిర్మించతలపెట్టిన దాని కంటే ఎత్తు తగ్గడం, తదితర కారణాల నేపథ్యంలో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
మౌలిక వసతులకు రూ.10కోట్లు..
సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌లో భాగంగా పోలీసుస్టేషన్ల స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆధునిక హంగులతో కూడిన ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల ఏర్పాటు, ప్రత్యేకంగా రిసెప్షన్ తదితరాల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. కొత్తగా పోలీసుక్వార్టర్స్ నిర్మాణం, అభివృద్ధి, అధికారుల కార్యాలయాలు, సిబ్బందికి బ్యారెక్స్, యంత్రసామాగ్రి కొనుగోలు కోసం రూ.40 కోట్లు కేటాయించారు.
‘ట్రాఫిక్ టెక్నాలజీ’కి రూ.10 కోట్లు..
నగర ట్రాఫిక్ విభాగం ప్రమాదాల నిరోధం, నాన్ కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విధి నిర్వహణలో పారదర్శకతలకు ప్రాధాన్యం ఇస్తూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ పథకం కింద ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ ఏడాది రూ.10 కోట్లు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమేయం లేకుండా ట్రాఫిక్ నిర్వహణ, ఉల్లంఘనుల గుర్తింపు, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీ లక్ష్యాలుగా ఉన్న ఈ ప్రాజెక్టుకు తుది దశకు చేరింది. దీంతో పాటు జీపీఎస్ టెక్నాలజీతో పని చేసే డిజిటల్ కెమెరాలు, 3 జీ కనెక్టివిటీతో పని చేసే చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు, ఇతర ఊపకరణాలకు నిధులు కేటాయించారు. ఈ కోణంలో సైబరాబాద్‌కు రూ.5 కోట్లు, రాచకొండకు రూ.కోటి కేటాయించింది.
రూ.12 కోట్లతో వ్యవస్థీకృత నేరాలకు చెక్
సైబర్ నేరాలతో పాటు వ్యవస్థీకృతంగా రెచ్చిపోతున్న ముఠాల పైనా నగర పోలీసులు సాంకేతిక యుద్ధం చేయనున్నారు. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్స్, ఇతర ఉపకరణాలు ఖరీదుతో పాటు క్రైమ్ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకుగాను సర్కారు రూ.12 కోట్లు కేటాయించింది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో భాగంగా పోలీసు విభా గం అనేక ఎనలటిక్స్‌ను సమకూర్చుకుంటోంది. నేరగాళ్ల కదలికలపై నిఘా, అనుమానితుల గుర్తింపు తదితరాల కోసం వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సైబర్, క్రైమ్ ల్యాబ్స్‌తో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌లో భారీ స్థాయిలో బ్యాక్‌ఎండ్ సేవలు చేసే సాఫ్ట్‌వేర్స్‌తో పాటు వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్, రిట్రీవ్ సాఫ్ట్‌వేర్స్ సమీకరించుకున్నారు. ఈ బడ్జెట్‌తో అవసరమైన అదనపు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉన్న వాటి అభివృద్ధికి వీటిని వెచ్చించనున్నారు. సైబరాబాద్‌లో ఈ పద్దు కింద రూ.5 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది.
రాచకొండ కమిషనరేట్‌కు నిధులు..
2016లో ఆవిర్భవించిన రాచకొండ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా కమిషనరేట్ భవనం లేకపోవడంతో ఇప్పటికీ గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్‌లోనే కొనసాగుతోంది. సరూర్‌నగర్‌లోని వీఎం హోమ్ స్థలాన్ని కేటాయించినా... కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీం తో రంగారెడ్డి జిల్లాలో 56 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకు ంది. గురువారం నాటి బడ్జెట్‌లో కమిషనరేట్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు కేటాయించారు.
డేగ‘కళ్ల’ కోసం రూ.140కోట్లు..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.140 కోట్లు కేటాయించింది. సైబరాబాద్‌కు రూ.6 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది.
ప్రతిపాదనల మేరకు కేటాయింపులు
రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి ప్రతిపాదనల మేరకు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రతి ఠాణాను మోడల్‌గా మార్చడానికి, ట్రాఫిక్ స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేస్తాం. కమిషనరేట్ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇది తొలి దఫా నిధులు మాత్రమే. భూమి స్వాధీనం, అభివృద్ధి పూర్తి చేసిన తర్వాత రెండో దఫాగా అవసరమైన మొత్తం ప్రతిపాదిస్తాం. – మహేష్ మురళీధర భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment