9/11 Attacks: సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ.
బాధితులకు జ్జాపకార్థంగా ట్విన్ టవర్స్ కూలిన ప్రాంతం(గ్రౌండ్ జీరో) ఒక స్మారక భవనం, మ్యూజియం ఉంటాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 11న ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులు, వారి పిల్లలు, బంధువులు నివాళులు అర్పిస్తారు. అయితే ఇలా నివాళులు అర్పించటం వారసత్వంగా కొనసాగుతోంది.
ఈ ఘటన జరిగి నేటికి(బుధవారం) నాటికి 23 ఏళ్లు. స్మారక భవనం వద్ద ప్రతీ ఏడాది బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు మృతి చెందినవారి పేర్లు చదువుతూ నివాళి అర్పిస్తారు. మృతి చెందినవారి వారసులు, వారి పిల్లలు.. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమవారి పేర్లు చదివి స్మరించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది.
23 ఏళ్లు గడుస్తున్నా.. దాడుల తర్వాత బాధితుల వారసులు వాళ్ల తాత, అమ్మమ్మ, నానమ్మలు పేర్లు స్మరించుకుంటూ నివాళులు అర్పించటం పెరుగుతోంది. అయితే గతేడాది సుమారు మొత్తం 140 మంది వారసులు దాడుల్లో మృతి చెందినవారికి నివాళులు అర్పించగా.. అందులో దాడులు జరిగిన అనంతరం పుట్టిన యువతీయువకులు 28 మంది ఉన్నారు. అయితే ఈ ఏడాది కూడా ఆ యువతీయువకులు తమవారికోసం నివాళులు అర్పించడానికి ఎదురు చూస్తున్నారు. బాధితులకు సంబంధించిన వారసులు అధికంగా వారి మేనకోడళ్లు, మేనల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వారి వద్ద మృతి చెందినవారి కథలు, ఫొటోలు, జ్ఞాపకాలు ఉన్నాయి.
9/11 దాడులకు ప్రత్యక్ష సాక్ష్యులు, బాధితులతో అనుబంధం ఉన్నవారి సంఖ్య తగ్గినా స్మరించుకోవటం తరతరాలకు కొనసాగుతుందని 13 ఏళ్ల అలన్ ఆల్డిక్కీ అంటున్నాడు. గత రెండేళ్లుగా తన తాత, అనేక మంది వ్యక్తుల పేర్లను చదివి నివాళులు అర్పించాను. ఇవాళ (బుధవారం) బాధితుల పేర్లు చదివి నివాళులు అర్పిస్తానని అన్నాడు. ట్విన్ టవర్స్ దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన తన తాత అల్లన్ తారాసివిచ్ జ్ఞాపకాలను తన గదిలో భద్రపర్చుకున్నానని తెలిపాడు.
దాడుల్లో మృతిచెందిన న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది క్రిస్టోఫర్ మైఖేల్ మోజిల్లో సోదరి పమేలా యారోస్జ్, ఆమె కుమార్తె కాప్రీ.. మెజిల్లో ఫొటోను చూపిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బుధవారం వీరు ఆయన పేరు చదివి నివాళులు అర్పించడానికి సిద్ధం ఉన్నారు. పమేలా యారోస్జ్ తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ విధంగా నాటి దాడులు, బాధితులకు సంబంధించిన జ్ఞాపకాలు రేపటి తరాలకు సజీవంగా కొనసాగనున్నాయి.
సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని అల్‌ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్‌కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశారు ఉగ్రదాడులు.
Comments
Please login to add a commentAdd a comment