September 11 attacks
-
9/11: చేదు జ్ఞాపకాలే అయినా పదిలంగా ఉంచేందుకు..
9/11 Attacks: సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ.బాధితులకు జ్జాపకార్థంగా ట్విన్ టవర్స్ కూలిన ప్రాంతం(గ్రౌండ్ జీరో) ఒక స్మారక భవనం, మ్యూజియం ఉంటాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 11న ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులు, వారి పిల్లలు, బంధువులు నివాళులు అర్పిస్తారు. అయితే ఇలా నివాళులు అర్పించటం వారసత్వంగా కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి నేటికి(బుధవారం) నాటికి 23 ఏళ్లు. స్మారక భవనం వద్ద ప్రతీ ఏడాది బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు మృతి చెందినవారి పేర్లు చదువుతూ నివాళి అర్పిస్తారు. మృతి చెందినవారి వారసులు, వారి పిల్లలు.. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమవారి పేర్లు చదివి స్మరించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. 23 ఏళ్లు గడుస్తున్నా.. దాడుల తర్వాత బాధితుల వారసులు వాళ్ల తాత, అమ్మమ్మ, నానమ్మలు పేర్లు స్మరించుకుంటూ నివాళులు అర్పించటం పెరుగుతోంది. అయితే గతేడాది సుమారు మొత్తం 140 మంది వారసులు దాడుల్లో మృతి చెందినవారికి నివాళులు అర్పించగా.. అందులో దాడులు జరిగిన అనంతరం పుట్టిన యువతీయువకులు 28 మంది ఉన్నారు. అయితే ఈ ఏడాది కూడా ఆ యువతీయువకులు తమవారికోసం నివాళులు అర్పించడానికి ఎదురు చూస్తున్నారు. బాధితులకు సంబంధించిన వారసులు అధికంగా వారి మేనకోడళ్లు, మేనల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వారి వద్ద మృతి చెందినవారి కథలు, ఫొటోలు, జ్ఞాపకాలు ఉన్నాయి.9/11 దాడులకు ప్రత్యక్ష సాక్ష్యులు, బాధితులతో అనుబంధం ఉన్నవారి సంఖ్య తగ్గినా స్మరించుకోవటం తరతరాలకు కొనసాగుతుందని 13 ఏళ్ల అలన్ ఆల్డిక్కీ అంటున్నాడు. గత రెండేళ్లుగా తన తాత, అనేక మంది వ్యక్తుల పేర్లను చదివి నివాళులు అర్పించాను. ఇవాళ (బుధవారం) బాధితుల పేర్లు చదివి నివాళులు అర్పిస్తానని అన్నాడు. ట్విన్ టవర్స్ దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన తన తాత అల్లన్ తారాసివిచ్ జ్ఞాపకాలను తన గదిలో భద్రపర్చుకున్నానని తెలిపాడు. దాడుల్లో మృతిచెందిన న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది క్రిస్టోఫర్ మైఖేల్ మోజిల్లో సోదరి పమేలా యారోస్జ్, ఆమె కుమార్తె కాప్రీ.. మెజిల్లో ఫొటోను చూపిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బుధవారం వీరు ఆయన పేరు చదివి నివాళులు అర్పించడానికి సిద్ధం ఉన్నారు. పమేలా యారోస్జ్ తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ విధంగా నాటి దాడులు, బాధితులకు సంబంధించిన జ్ఞాపకాలు రేపటి తరాలకు సజీవంగా కొనసాగనున్నాయి.సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని అల్‌ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశారు ఉగ్రదాడులు. -
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
బీరూట్: కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్ కాయిదా చీఫ్ అయమాన్ అల్ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. ఈ విషయాన్ని జిహాదిస్టు వెబ్సైట్లను మానిటర్ చేసే సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. వీడియోలో అయమాన్ అల్ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడంపైనా మాట్లాడాడు. తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రం ప్రస్తావిచంలేదు. దీంతో ఈ వీడియో జనవరి తర్వాత రికార్డు చేసి ఉండవచ్చని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అభిప్రాయపడింది. 2020 ఫిబ్రవరిలోనే అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడటాన్ని బట్టి వీడియో తాజాది అని చెప్పలేమని సైట్ పేర్కొంది. 2020 చివరలో ఆయన అనారోగ్యంతో మరణించి ఉంటాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదలైంది. మొత్తం 61 నిమిషాల, 37 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదలైందని సైట్ డైరెక్టర్ రిటా కాట్జ్ తెలిపారు. 2021 జనవరి తర్వాత ఆయన మరణించి ఉండవచ్చని అన్నారు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్ అల్ జవహిరి ఆల్కాయిదా చీఫ్‌గా మారాడు. -
ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు
కాబూల్: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. -
సెప్టెంబర్ 11.. మానవత్వంపై దాడి
అహ్మదాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్ర దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి దారుణ ఘటనలు, విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని చెప్పారు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతీయ మానవ విలువల ప్రాధాన్యతను వివరించారని గుర్తుచేశారు. అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11(9/11) దాడికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం ఇచ్చారు. అంతేకాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ భవన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇక్కడ వసతి కల్పిస్తారు. బాలికల హాస్టల్ అయిన సర్దార్‌ధామ్ ఫేజ్–2 కన్యా ఛత్రాలయ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్ 11.. ప్రపంచ చరిత్రలో మర్చిపోలేని రోజు. మానవత్వంపై దాడి జరిగిన రోజుగా గుర్తుండిపోతుంది. ఆ రోజు మొత్తం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పించింది’’ అని అన్నారు. ఇలాంటి భీకర దాడుల నుంచి నేర్చుకున్న పాఠాలను సదా గుర్తుంచుకోవాలి్సన అవసరం ఉందని సూచించారు. మానవీయ విలువలను కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. సుబ్రహ్మణ్య భారతికి అంకితం తమిళ భాష అధ్యయనానికి బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో ప్రత్యేక పీఠాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పీఠాన్ని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఆయన వర్ధంతి సందర్భంగా అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఏక్ భారత్.. శ్రేష్ట భారత్ అనే భావనను సర్దార్ పటేల్ ముందుకు తెచ్చారని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి సాగించిన తమిళ రచనల్లోనూ ఇదే భావన స్పష్టంగా ప్రతిఫలించిందని పేర్కొన్నారు. సమాజానికి నూతన ఆత్మవిశ్వాసం బ్రిటిష్ పాలకులను తలవంచేలా చేసిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ స్ఫూర్తి, శక్తి నేడు ఐక్యతా శిల్పం రూపంలో మన ముందు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్ఫూర్తి, దేశ ఐక్యత, ప్రజల ఉమ్మడి ప్రయత్నానికి ఈ శిల్పం ఒక ప్రతీక అని కొనియాడారు. మన సంపద దేశం కోసం నైపుణ్యాల వృద్ధి(స్కిల్ డెవలప్మెంట్)కి అధిక ప్రాధాన్యం ఇస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని మోదీ చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ విధానం ఉద్దేశమని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మంది యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని వివరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్కా వికాస్’కు సబ్కా ప్రయాస్‌ను జత చేద్దామని చెప్పారు. విద్యార్థుల కోసం రూ.200 కోట్లతో సర్దార్‌ధామ్ భవన్‌ను నిర్మించిన విశ్వ పాటిదార్ సమాజ్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
లిటిల్ మిరాకిల్.. సంచలనం రోజునే
ఈ మధ్యకాలంలో తమ పిల్లలు పుట్టే తేదీలు వినూత్నంగా, క్రేజీగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దైవ సంకల్పమో లేక యాదృచ్ఛికమో తెలియదు గాని అమెరికాలో ఓ పాప క్రేజీ తేదీన జన్మించింది. అమెరికాకు చెందిన కామెట్రియోన్ మూర్ బ్రౌన్ ఈ నెల 11న(సెప్టెంబర్ 11) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన సమయం కూడా రాత్రి 9.11 గంటలకు. అంతేకాదు ఆ చిన్నారి బరువు కూడా 9 పౌండ్ల 11 ఔన్సులు. డాక్టర్ ఈ అంకెలు చెప్పగానే ఆ చిన్నారి తల్లిదండ్రులు తొలుత ఆశ్చర్యపోయారు. అనంతరం చరిత్రలో మర్చిపోలేని రోజున తమ పాప జన్మించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 11 ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం అదే రోజున చోటు చేసుకుంది. అమెరికా ఆర్థిక శక్తికి సూచికగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగింది సెప్టెంబర్ 11నే. అందుకే 9/11ను అమెరికన్లు మర్చిపోలేరు. సరిగ్గా ఆ సంఘటన జరిగి 18 ఏళ్లు పూర్తయిన రోజునే క్రిస్టినా బ్రౌన్ జన్మించింది. దీనిపై ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘లిటిల్ మిరాకిల్’ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. -
9/11 ఉగ్రదాడి ; కుండబద్దలుకొట్టిన సౌదీ
న్యూయార్క్ : అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసి, అటుపై అనేక యుద్ధాలకు కారణమైన ‘సెప్టెంబర్ 11 ఉగ్రదాడి’కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదా ఉగ్రవాదులు జరిపిన దాడులతో తనకేమాత్రమూ సంబంధంలేదని సౌదీ అరేబియా తేల్చిచెప్పింది. 2001నాటి దాడుల్లో భాగం పంచుకున్న ఉగ్రవాదులకు నిధులు అందజేసినట్లు వచ్చిన ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని పేర్కొంది. మాన్‌హట్టన్ కోర్టులో గురువారం జరిగిన విచారణలో సౌదీ తరఫు న్యాయవాది మిచెల్ కెల్లాగ్ ఈ మేరకు వాదనలు వినిపించారు. మూలాలు సౌదీలోనే! : అల్‌కాయిదాకు సౌదీ అరేబియానుంచి పెద్ద మొత్తంలో నిధులు వెళ్లాయని, ఆ నిధులతోనే ఉగ్రవాదులు సెప్టెంబర్ 11 దాడులకు పాల్పడ్డారని.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, సీఐఏ, 9/11కమిషన్, 9/11 రివ్యూ కమిషన్లు పలు రిపోర్టుల్లో పేర్కొన్నాయి. దాడుల్లో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదుల్లో అత్యధికులు సౌదీ జాతీయులేనన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు నిధులందించే వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చంటూ నాటి రిపబ్లికన్ ప్రభుత్వం ‘జస్టా’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ 9/11 సంబంధిత కేసుల్లో సౌదీని కూడా నిందితురాలిగా పేర్కొంటూ పలువురు బాధితులు కోర్టుల్లో దావాలు వేశారు. అది తప్పు.. ఒక్క ఆధారమూ లేదు: అమెరికా అధికారుల రిపోర్టుల్లోనూ సౌదీని నిందితురాలిగా పేర్కొనే ఏ ఒక్క ఆధారమూ లేదని న్యాయవాది మిచెల్కెల్లాంగ్ వాదించారు. ‘‘ఏవో కొన్ని ఊహాగానాలు, ముక్తాయింపుల ఆధారంగా నిందలు వేయడం సరికాదు. 9/11 దాడుల్లో సౌదీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలులేవు’’ అని పేర్కొన్నారు. దాడుల అనంతరం రిపబ్లిక్ ప్రభుత్వం చేసిన ‘జస్టా’ చట్టాన్ని 2016లో ఒబామా వీటో చేసిన సంగతి తెలిసిందే. సౌదీ తాజా వాదనలపై బాధితులు, అమెరికా ప్రభుత్వం స్పందించాల్సిఉంది. -
సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు అమెరికాలో న్యాయం
న్యూయార్క్ : ఉగ్రవాది అంటూ దూషణలతో పాటు దాడులకు గురయిన భారతీయ సంతతికి చెందిన ఓ సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. గతేడాది సిక్కు జాతీయుడిని దూషించి అతడిపై ముష్టియుద్ధానికి దిగిన కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. 9/11 దాడుల నేపథ్యంలో సెప్టెంబర్ 8న ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ కొందరు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇందర్జిత్ సింగ్ ముక్కర్ చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ప్రస్తుతం విచారణకు రాగా నిందితుడికి శిక్ష పడిందని చికాగో పోలీసులు తెలిపారు. నిందితుడి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అతడు ఇంకా టీనేజీలోనే ఉన్నందున జువెనైల్ హోమ్ కు తరలించినట్లు వివరించారు. సిక్కు కమ్యూనిటీకి 200 గంటల పాటు సేవ చేయడంతో పాటు దాదాపు రూ.3.24 లక్షలు ఫైన్ విధించారు. ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడి అతడికి ఊపిరాడకుండా చేశారని సిక్కు సంస్థ ఆరోపించింది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్‌లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇందర్ జిత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై ఉగ్రవాది అంటూ అగ్రదేశం అమెరికాలో దాడి జరిగింది. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ దాడికి పాల్పడ్డారని ఇందర్జిత్ సింగ్ ముక్కెర్ అనే వ్యక్తి చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం తమ అదుపులోనే నిందితుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం నాడు అక్కడి జాత్యహంకారవాదులు 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడ్డారని స్థానిక సిక్కు మతానికి చెందిన ఓ సంస్థ పేర్కొంది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్‌లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. దవడ భాగంలో ఓ ఎముక ఫ్రాక్చర్ అయినట్లు కూడా సమాచారం. ' ఈ ఘటనపై స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు', సహించరాని నేరంగా దాడిని పరిగణించి దర్యాప్తు చేయాలని వారిని కోరుతున్నట్లు ముక్కర్ పేర్కొన్నాడు. సిక్కు మత వేషధారణలో ఉండటం వల్ల, అతడి జాతీయత కనిపించడంతోనే ఈ దాడి జరిగిందని సిక్కు మత లీగల్ డైరెక్టర్ హర్ సిమ్రన్ కౌర్ అన్నారు. గత ఆగస్టులో సందీప్ సింగ్ అనే వ్యక్తిని 'టెర్రరిస్టు' అంటూ న్యూయార్క్ సిటీలో దాడి చేసిన విషయం విదితమే. 2012లలోనూ ఓ సిక్కు వ్యక్తి ఇంట్లోకి చోరబడ్డ ఆగంతకుడు కాల్పులు జరిపి ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఘటన అప్పట్లో అమెరికాలో సంచలనం సృష్టించింది.