20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్‌లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం..
సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
కారణాలు..
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన.
నాలుగోది ఫ్లాప్..
పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్‌కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు.
9/11.. పెంటగాన్ దాడి దృశ్యం
ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్‌టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్‌విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది.
బుష్ చెవిలో ఊదింది ఆయనే
సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది.
ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు.
అఫ్గన్ ద్వారా వేట
సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.
బైడెన్ గురించి లాడెన్ లేఖ!
తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు.
ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది.
అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా..
- సాక్షి, వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment