Twenty years ago
-
ఎవరి కెరీర్‌ను ఎవరూ డిసైడ్ చేయలేరు
‘‘హిట్ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్‌తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. రవిబాబు దర్శకత్వంలో నరేశ్ హీరోగా పరిచయమైన ‘అల్లరి’ రిలీజ్ అయి నేటితో ఇరవై ఏళ్లు అవుతోంది. నటుడిగా తాను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయిన సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు. ► ‘అల్లరి’ సినిమా షూటింగ్ 2002 జనవరి 24న ఆరంభమైంది. 22న రవిగారు ఫోన్ చేసి, ఫోటోషూట్ చేసి ఎల్లుండి నుంచి షూటింగ్ అన్నారు. ‘నరేశ్ కొత్తవాడు, దర్శకుడిగా నువ్వు కొత్తవాడివే. ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోతో వెళితే బెటర్ ఏమో’ అన్నట్లుగా నాన్నగారు (ప్రముఖ దర్శక– నిర్మాత ఈవీవీ సత్యానారాయణ) కూడా చెప్పారు. కానీ రవిగారు నాపై నమ్మకంతో సినిమాను స్టార్ట్ చేశారు. అలా అక్కడి నుంచి ఈదర పోయి అల్లరి స్టార్ట్ అయ్యింది. నా 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 57 సినిమాలు చేశాను. ► కెరీర్ మధ్యలో ‘నేను’, ‘ప్రాణం’ వంటి సీరియస్ సినిమాలు చేశాను. ఇవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే ‘నేను’ చూసి, దర్శకుడు క్రిష్ ‘గమ్యం’లోని గాలి శీను క్యారెక్టర్‌కు తీసుకున్నారు. గాలి శీనుతో నాకు ‘శంభో శివ శంభో’ సినిమా చేసే అవకాశం వచ్చింది. గమ్యం, శంభో శివ శంభోలో చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎమోషన్‌ను కూడా చేయగలనని మేకర్స్ నన్ను నమ్మారు. ఈ సినిమాల వల్ల ‘మహర్షి’లో చేసే చాన్స్ వచ్చింది. ► నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్ వస్తున్నాయని చాలా మంది అన్నారు. నిజానికి ‘గమ్యం’ సినిమా నేను ఒప్పుకున్నదే. నాన్నగారు ఈ సినిమా చూశాక ‘‘కథగా చెప్పి ఉంటే ఈ సినిమా చేయవద్దనేవాడిని. బాగా చేశావ్. నీకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్లో ఫ్లాప్స్ రావడం వల్ల ఈవీవీగారు లేకపోవడం వల్లే నా సినిమాలు హిట్స్ కాలేదని అన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను చేసిన ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట..’ సినిమాలు హిట్ సాధించాయి. అయితే గత కొంతకాలంగా నాకు సరైన హిట్ రాలేదు. నాన్నగారిని ఓ దర్శకుడిగా కన్నా కూడా నేను ఓ ఫాదర్‌గా బాగా మిస్ అయ్యాను. ‘నాంది’(2021) సినిమా హిట్ సాధించినప్పుడు నాన్నగారు ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ► ‘మహర్షి’ తర్వాత ‘ఇక నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు’ అని ఓ ప్రొడ్యూసర్ అన్నారు. ‘నాంది’ హిట్ తర్వాత ఆయనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ ప్రొడ్యూసర్ నా మంచి కోసమే చెప్పి ఉండొచ్చు. అయితే ఎవరి కెరీర్ ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో ఎవరూ నిర్ణయించలేరు. ఎవరి కెరీర్‌ని ఎవరూ డిసైడ్ చేయలేరు. ► ప్రస్తుతం ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చేస్తున్నాను. మరో మూడు కథలను ఓకే చేశాను. నాకు ‘నాంది’తో హిట్ ఇచ్చిన విజయ్‌తో మరో సినిమా చేస్తాను. -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. ప్రపంచబ్యాంక్ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. దాదాపు నాలుగు నెలలపాటు సాగిన నిరసనల సందర్భంగా 25 వేలకు పైబడి కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అప్పటి సీఎల్పీ నేత రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనూ విద్యుత్ చార్జీల ఉద్యమం ఉధృతమైంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 90 మంది ఎమ్మెల్యేలతో విపక్షనేత డాక్టర్ వైఎస్సార్ నిరవధిక నిరాహారదీక్షను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ తగిలేలా చేశారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకు నేటి తెలంగాణ సీఎం, నాటి డిప్యూటీ స్పీకర్ కె.చంద్రశేఖరరావు లేఖ ద్వారా తమ అసంతృప్తిని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి కేసీఆర్ రాజీనామా చేసి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటునకు విద్యుత్‌చార్జీల ఉద్యమం, కాల్పుల ఘటన పరోక్షంగా కారణమైంది. ఆ రోజు ఏమైందంటే... విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించినా వేలాదిమంది కార్యకర్తలు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్‌బాగ్ వైపు సాగారు. బషీర్‌బాగ్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ కింద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. అశ్వికదళాలు సైతం కదంతొక్కాయి. అక్కడకు కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు ప్రయోగించి, గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ వైపునకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు పోలీసు కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకీ గుళ్లు తగిలి అసువులు బాశారు. ఆ విధంగా బషీర్‌బాగ్ ప్రాంతం రక్తసిక్తమైంది. చంద్రబాబు పాలనకు కౌంట్‌డౌన్.. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ పాలనకు కాల్పుల ఘటనతో కౌంట్‌డౌన్ మొదలైంది. ఆ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకచర్యలు, తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ డా.వైఎస్సార్ చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేసిం ది. 2004లో టీడీపీ పాలనను అంతమొందిస్తూ డా.వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద ముగ్గురు నేలకొరిగిన ప్రాంతం లో విద్యుత్ అమరవీరుల జ్ఞాపకార్థం ‘షహీద్‌చౌక్’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 28న నాటి క్రూరమైన కాల్పుల ఘటనను గుర్తుచేసుకుంటూ వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆ ముగ్గురు యోధులకు నివాళి, జోహార్లు అర్పించి వారిని గుర్తుచేసుకుంటున్నారు. -
ఇరవై ఏళ్ల క్రితమే శ్రీమంతుడు
విశాల ప్రపంచంలో సమాజ శ్రేయస్సు కోసం తపించేవారు బహు అరుదుగా ఉంటారు. సమాజానికి మంచి చేయాలని ఆజన్మాంతం శ్రమిస్తుంటారు. ఇదే కోవకు చెందిన వారు బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన దివంగత పడాల కృష్ణారెడ్డి. రెండు దశాబ్దాల క్రితం ఆయన నాటిన విద్యా విత్తు.. నేడు ఎన్నో విద్యా కుసుమాలను పూయిస్తోంది. గ్రామస్తులకు విద్య అందించాలన్న తలంపుతో పందలపాకకు చెందిన పడాల కృష్ణారెడ్డి 23 ఏళ్ల క్రితం శ్రీపడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. విద్యాధికుడు, వ్యాపారవేత్త అయిన కృష్ణారెడ్డి ఓ సామాన్య రైతు కుంటుంబంలో జన్మించారు. కష్టపడి చదివి, ఉన్నతంగా ఎదిగారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే తపనపడ్డారు. గుళ్లూగోపురాలు కట్టించే కన్నా, పది మందికి జీవనమార్గాన్ని చూపే విద్యను అందించాలని నిశ్చయించుకున్నారు. స్నేహితుల సహకారంతో 1993లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా రూ.30 లక్షల వ్యయంతో అన్ని వసతులు, హంగులతో తన తండ్రి పేరిట గ్రామంలో ఉన్నత పాఠశాలను కట్టించారు. అలాగే రూ.4 లక్షలతో క్రీడా మైదానం అభివృద్ధి చేశారు. అంతటితో ఆగక అమెరికాలో 13 వేల డాలర్లు సేకరించి పాఠశాల అభివృద్ధికి శ్రమించారు. చదువుకుని.. ఉన్నత స్థానాల్లో... ఇప్పటి వరకు వేలాది మంది పందలపాకతో పాటు కొమరిపాలెం, తొస్సిపూడి, వెదురుపాక సావరం తదితర గ్రామాలకు చెందిన వారు ఈ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంతేకాక ఇటు చదువులోను, అటు క్రీడల్లోను అనేక మంది రాష్ట్రవ్యాప్తంగా పేరు గడించారు. డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా స్థిరపడిన వారెందరో ఉన్నారు. పాఠశాలపై ఉన్న మక్కువతో కృష్ణారెడ్డి స్థానికంగా ఉన్న ఆత్మీయులతో పాఠశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. వారి సహకారంతో అనేక అభివృద్ధి పనులు నిర్వహించారు. తిరుగు పయనంలో తిరిగిరాని లోకానికి.. ప్రతిఏటా కృష్ణారెడ్డి స్వదేశానికి వచ్చి.. పాఠశాలపై మమకారంతో సందర్శించి వెళ్లేవారు. 2010లో ఇక్కడకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సంఘటనతో పాఠశాల పూర్యవిద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ.. ఆయన భార్య అనురాధ, కుమారులు ప్రవీణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఈ పాఠశాల బాగోగులను చూస్తున్నారు. గ్రామానికి చేసిన సేవలకు గుర్తింపుగా కృష్ణారెడ్డి కాంస్య విగ్రహాన్ని పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరిస్తున్నారు.