విశాల ప్రపంచంలో సమాజ శ్రేయస్సు కోసం తపించేవారు బహు అరుదుగా ఉంటారు. సమాజానికి మంచి చేయాలని ఆజన్మాంతం శ్రమిస్తుంటారు. ఇదే కోవకు చెందిన వారు బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన దివంగత పడాల కృష్ణారెడ్డి. రెండు దశాబ్దాల క్రితం ఆయన నాటిన విద్యా విత్తు.. నేడు ఎన్నో విద్యా కుసుమాలను పూయిస్తోంది.
గ్రామస్తులకు విద్య అందించాలన్న తలంపుతో పందలపాకకు చెందిన పడాల కృష్ణారెడ్డి 23 ఏళ్ల క్రితం శ్రీపడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. విద్యాధికుడు, వ్యాపారవేత్త అయిన కృష్ణారెడ్డి ఓ సామాన్య రైతు కుంటుంబంలో జన్మించారు. కష్టపడి చదివి, ఉన్నతంగా ఎదిగారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే తపనపడ్డారు. గుళ్లూగోపురాలు కట్టించే కన్నా, పది మందికి జీవనమార్గాన్ని చూపే విద్యను అందించాలని నిశ్చయించుకున్నారు. స్నేహితుల సహకారంతో 1993లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా రూ.30 లక్షల వ్యయంతో అన్ని వసతులు, హంగులతో తన తండ్రి పేరిట గ్రామంలో ఉన్నత పాఠశాలను కట్టించారు. అలాగే రూ.4 లక్షలతో క్రీడా మైదానం అభివృద్ధి చేశారు. అంతటితో ఆగక అమెరికాలో 13 వేల డాలర్లు సేకరించి పాఠశాల అభివృద్ధికి శ్రమించారు.
చదువుకుని.. ఉన్నత స్థానాల్లో...
ఇప్పటి వరకు వేలాది మంది పందలపాకతో పాటు కొమరిపాలెం, తొస్సిపూడి, వెదురుపాక సావరం తదితర గ్రామాలకు చెందిన వారు ఈ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంతేకాక ఇటు చదువులోను, అటు క్రీడల్లోను అనేక మంది రాష్ట్రవ్యాప్తంగా పేరు గడించారు. డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా స్థిరపడిన వారెందరో ఉన్నారు. పాఠశాలపై ఉన్న మక్కువతో కృష్ణారెడ్డి స్థానికంగా ఉన్న ఆత్మీయులతో పాఠశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. వారి సహకారంతో అనేక అభివృద్ధి పనులు నిర్వహించారు.
తిరుగు పయనంలో తిరిగిరాని లోకానికి..
ప్రతిఏటా కృష్ణారెడ్డి స్వదేశానికి వచ్చి.. పాఠశాలపై మమకారంతో సందర్శించి వెళ్లేవారు. 2010లో ఇక్కడకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సంఘటనతో పాఠశాల పూర్యవిద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ.. ఆయన భార్య అనురాధ, కుమారులు ప్రవీణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఈ పాఠశాల బాగోగులను చూస్తున్నారు. గ్రామానికి చేసిన సేవలకు గుర్తింపుగా కృష్ణారెడ్డి కాంస్య విగ్రహాన్ని పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరిస్తున్నారు.
ఇరవై ఏళ్ల క్రితమే శ్రీమంతుడు
Published Thu, Feb 25 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement