ఎవరి కెరీర్‌ను ఎవరూ డిసైడ్‌ చేయలేరు | Allari Naresh Talks On Allari Movie twenty years | Sakshi
Sakshi News home page

ఎవరి కెరీర్‌ను ఎవరూ డిసైడ్‌ చేయలేరు

Published Tue, May 10 2022 5:33 AM | Last Updated on Wed, May 11 2022 5:43 PM

Allari Naresh Talks On Allari Movie twenty years - Sakshi

‘అల్లరి’ సినిమా షూటింగ్‌ 2002 జనవరి 24న ఆరంభమైంది. 22న రవిగారు ఫోన్‌ చేసి, ఫోటోషూట్‌ చేసి ఎల్లుండి నుంచి షూటింగ్‌ అన్నారు.

‘‘హిట్‌ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్‌ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్‌ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్‌తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్‌ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్‌ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. రవిబాబు దర్శకత్వంలో నరేశ్‌ హీరోగా పరిచయమైన ‘అల్లరి’ రిలీజ్‌ అయి నేటితో ఇరవై ఏళ్లు అవుతోంది. నటుడిగా తాను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయిన సందర్భంగా ‘అల్లరి’ నరేశ్‌ చెప్పిన విశేషాలు.

► ‘అల్లరి’ సినిమా షూటింగ్‌ 2002 జనవరి 24న ఆరంభమైంది. 22న రవిగారు ఫోన్‌ చేసి, ఫోటోషూట్‌ చేసి ఎల్లుండి నుంచి షూటింగ్‌ అన్నారు. ‘నరేశ్‌ కొత్తవాడు, దర్శకుడిగా నువ్వు కొత్తవాడివే. ఆల్రెడీ ప్రూవ్డ్‌ హీరోతో వెళితే బెటర్‌ ఏమో’ అన్నట్లుగా నాన్నగారు (ప్రముఖ దర్శక– నిర్మాత ఈవీవీ సత్యానారాయణ) కూడా చెప్పారు. కానీ రవిగారు నాపై నమ్మకంతో సినిమాను స్టార్ట్‌ చేశారు. అలా అక్కడి నుంచి ఈదర పోయి అల్లరి స్టార్ట్‌ అయ్యింది. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 57 సినిమాలు చేశాను.  

► కెరీర్‌ మధ్యలో ‘నేను’, ‘ప్రాణం’ వంటి సీరియస్‌ సినిమాలు చేశాను. ఇవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే ‘నేను’ చూసి, దర్శకుడు క్రిష్‌ ‘గమ్యం’లోని గాలి శీను క్యారెక్టర్‌కు తీసుకున్నారు. గాలి శీనుతో నాకు ‘శంభో శివ శంభో’ సినిమా చేసే అవకాశం వచ్చింది. గమ్యం, శంభో శివ శంభోలో చేసిన క్యారెక్టర్స్‌ వల్ల ఎమోషన్‌ను కూడా చేయగలనని మేకర్స్‌ నన్ను నమ్మారు. ఈ సినిమాల వల్ల ‘మహర్షి’లో చేసే చాన్స్‌ వచ్చింది.

► నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్‌ వస్తున్నాయని చాలా మంది అన్నారు. నిజానికి ‘గమ్యం’ సినిమా నేను ఒప్పుకున్నదే. నాన్నగారు ఈ సినిమా చూశాక ‘‘కథగా చెప్పి ఉంటే ఈ సినిమా చేయవద్దనేవాడిని. బాగా చేశావ్‌. నీకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్‌లో ఫ్లాప్స్‌ రావడం వల్ల ఈవీవీగారు లేకపోవడం వల్లే నా సినిమాలు హిట్స్‌ కాలేదని అన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను చేసిన ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట..’ సినిమాలు హిట్‌ సాధించాయి. అయితే గత కొంతకాలంగా నాకు సరైన హిట్‌ రాలేదు. నాన్నగారిని ఓ దర్శకుడిగా కన్నా కూడా నేను ఓ ఫాదర్‌గా బాగా మిస్‌ అయ్యాను. ‘నాంది’(2021) సినిమా హిట్‌ సాధించినప్పుడు నాన్నగారు ఉండి ఉంటే బాగుండేది అనిపించింది.

► ‘మహర్షి’ తర్వాత ‘ఇక నువ్వు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు’ అని ఓ ప్రొడ్యూసర్‌ అన్నారు. ‘నాంది’ హిట్‌ తర్వాత ఆయనే ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ ప్రొడ్యూసర్‌ నా మంచి కోసమే చెప్పి ఉండొచ్చు. అయితే ఎవరి కెరీర్‌ ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో ఎవరూ నిర్ణయించలేరు. ఎవరి కెరీర్‌ని ఎవరూ డిసైడ్‌ చేయలేరు.

► ప్రస్తుతం ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చేస్తున్నాను. మరో మూడు కథలను ఓకే చేశాను. నాకు ‘నాంది’తో హిట్‌ ఇచ్చిన విజయ్‌తో మరో సినిమా చేస్తాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement