‘ బచ్చల మల్లి’ మూవీ రివ్యూ | Bachchala Malli Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Bachchala Malli Review: ‘ బచ్చల మల్లి’ మూవీ రివ్యూ

Published Fri, Dec 20 2024 1:58 PM | Last Updated on Fri, Dec 20 2024 4:51 PM

Bachchala Malli Movie Review And Rating In Telugu

టైటిల్‌: బచ్చల మల్లి
నటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్‌రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు
నిర్మాతలు: రాజేశ్ దండా, బాలాజీ గుట్ట
దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌
సినిమాటోగ్రఫీ : రిచర్డ్‌ ఎం నాథన్‌
విడుదల తేది: డిసెంబర్‌ 20, 2024


కథేంటంటే.. 
ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్‌ బచ్చల మల్లి (అల్లరి నరేశ్‌) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్‌) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్‌ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు.

 నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్‌) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్‌ కుమార్‌), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే..
విలేజ్‌ బ్యాగ్రౌండ్‌, హీరో పాత్రకి నెగెటివ్‌ షేడ్స్‌ , రా అండ్ రస్టిక్ వాతావరణం.. ఈ నేపథ్యంతో కూడిన కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. బచ్చల మల్లి కూడా అలాంటి చిత్రమే. దర్శకుడు ఎంచుకుంది ట్రెండింగ్‌ సబ్జెక్ట్‌ అయినా తెరపై ఆకట్టుకునేలా కథనాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. పాత్రలను తిర్చిదిద్దిన విధానంపై పెట్టిన శ్రద్ధ.. కథనంపై పెట్టలేదు. 

హీరోకి విలనిజం లక్షణాలు ఉన్నా.. ప్రేక్షకులు ఆ పాత్రలో కనెక్ట్‌ కావాలి. అప్పుడే కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ బచ్చల మల్లి విషయంలో అది మిస్‌ అయింది. హీరో పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేదు. అసలు హీరోకి ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనేది అర్థం కాదు. యాక్షన్‌ సీన్స్‌ కూడా బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. 

 ఎమోషనల్‌ సీన్స్‌ కూడా అంతే. అప్పటి వరకు మూర్ఖంగా ఉన్న హీరో.. తల్లి ఒక మాట చెప్పగానే మారిపోవడం, హీరోయిన్‌ తండ్రితో చివరిలో ఓ ఎమోషనల్‌ డైలాగ్‌ చెప్పించడం..ఇవన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా ఎమోషనల్‌గా టచ్‌ చేయవు.  ఇక హీరో జీవితంలో జరిగే సంఘటనలు కూడా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. 

కథ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో పాత్ర పరిచయం, అతను మూర్ఖుడిగా మారడానికి గల కారణాలు కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి.  హీరో మూర్ఖుడిగా మారిన తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది.  ఓ కొత్త పాత్ర ఎంట్రీతో వచ్చే ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ కొత్త పాత్ర నేపథ్యం తెలిసిన తర్వాత సెకండాఫ్‌ కూడా రొటీన్‌ సీన్లతో నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. మూర్ఖత్వంతో సరిదిద్దుకోని తప్పులు చేయ్యొద్దని దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. 

ఎవరెలా చేశారంటే.. 

బచ్చల మల్లి పాత్రలో నరేశ్‌ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు . డైలాగు డెలివరీ బాగుంది. హనుమాన్‌ ఫేం అమృతా అయ్యర్‌, కావేరి పాత్రకు న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించింది. హీరో తండ్రిగా బలగం జయరాం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. 

అచ్యుత్ కుమార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. అయితే ప్రధాన కథకి ఆ పాత్రతో సంబంధమే ఉండదు.  హరితేజ, ప్రవీణ్‌, రావు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించాడు. 

సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ పాయింట్‌. పాటలు పర్వా లేదు.  సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement