బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై ఉగ్రవాది అంటూ అగ్రదేశం అమెరికాలో దాడి జరిగింది. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ దాడికి పాల్పడ్డారని ఇందర్జిత్ సింగ్ ముక్కెర్ అనే వ్యక్తి చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం తమ అదుపులోనే నిందితుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం నాడు అక్కడి జాత్యహంకారవాదులు 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడ్డారని స్థానిక సిక్కు మతానికి చెందిన ఓ సంస్థ పేర్కొంది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. దవడ భాగంలో ఓ ఎముక ఫ్రాక్చర్ అయినట్లు కూడా సమాచారం.
' ఈ ఘటనపై స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు', సహించరాని నేరంగా దాడిని పరిగణించి దర్యాప్తు చేయాలని వారిని కోరుతున్నట్లు ముక్కర్ పేర్కొన్నాడు. సిక్కు మత వేషధారణలో ఉండటం వల్ల, అతడి జాతీయత కనిపించడంతోనే ఈ దాడి జరిగిందని సిక్కు మత లీగల్ డైరెక్టర్ హర్ సిమ్రన్ కౌర్ అన్నారు. గత ఆగస్టులో సందీప్ సింగ్ అనే వ్యక్తిని 'టెర్రరిస్టు' అంటూ న్యూయార్క్ సిటీలో దాడి చేసిన విషయం విదితమే. 2012లలోనూ ఓ సిక్కు వ్యక్తి ఇంట్లోకి చోరబడ్డ ఆగంతకుడు కాల్పులు జరిపి ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఘటన అప్పట్లో అమెరికాలో సంచలనం సృష్టించింది.