ఫ్లోరిడాలో తన గోల్ఫ్ కోర్టు సమీపంలో కాల్పులు
మాజీ అధ్యక్షుడు సురక్షితమని అధికారుల ప్రకటన
ఘటనను తీవ్రంగా ఖండించిన కమలా హారిస్
జులైలో జరిగిన కాల్పుల ఘటనలో వెంట్రుకవాసిలో తప్పించుకున్న ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే ట్రంప్ క్షేమంగానే ఉన్నట్టు ఆయన ప్రచార బృందం వెల్లడించింది.
ఫ్లోరిడాలో తన వెస్ట్ పామ్ బీచ్ నివాసం సమీపంలోని సొంత గోల్ఫ్ కోర్స్ లో గోల్ఫ్ ఆడుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవు‘అని ట్రంప్ ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ట్రంప్ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా ధ్రువీకరించింది. కాల్పుల శబ్దం వినిపించగానే గోల్ఫ్ కోర్స్ ను మూసేసి ట్రంప్ ను అక్కడి నుంచి హుటాహుటిన తరలించినట్టు తెలిపింది. మరోవైపు.. కాల్పుల ఘటన అనంతరం తాను సేఫ్‌గా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఘటన గురించి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అధికారులు నివేదించారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్టు కూడా సమాచారం లేదని స్థానిక పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
నాకు సమీపంలోనే కాల్పులు జరిగాయి. పరిస్థితి అదుపులో లేదనేది రూమర్లే. మీ అందరికీ ఓ విషయం గట్టిగా చెప్పదల్చుకున్నా. నేను బాగున్నా. సురక్షితంగా ఉన్నా. ఏదీ నన్ను అడ్డుకోలేదు. నన్నెవరూ ఆపలేరు. ఎప్పటికీ లొంగేదే లేదు.
:: డొనాల్డ్ ట్రంప్
ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మన దేశంలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటిస్తున్నా. ట్రంప్‌నకు అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించా.
:: అధ్యక్షుడు జో బైడెన్
ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొనే దుండగుడు ఏకే 47 మోడల్ వంటి తుపాకీతో సంచరించాడు. మాజీ అధ్యక్షుడిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే సదరు దుండగుడు ఆయుధంతో అక్కడికి వచ్చినట్లు గుర్తించాం. నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్ డొనాల్డ్ ట్రంప్‌నకు 400 నుంచి 500 గజాల దూరంలోనే తన ఆయుధంతో సిద్ధమవుతుండగా భద్రతా ఏజెంట్లు కాల్పులు జరిపాయి. నిందితుడు ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు.. విచారణ చేపట్టాం.
:::ఎఫ్‌బీఐ
ఈ ఘటనపై కమలా హారిస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అన్నారామె.
I have been briefed on reports of gunshots fired near former President Trump and his property in Florida, and I am glad he is safe. Violence has no place in America.
— Vice President Kamala Harris (@VP) September 15, 2024
ఇదీ చదవండి: ‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటు
ఇటీవలే హత్యాయత్నం
అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్న 78 ఏళ్ల ట్రంప్ పై రెండు నెలల క్రితమే హత్యాయత్నం జరగడం తెలిసిందే. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే యువకుడు సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. కుడి చెవికి తూటా తగిలింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం దయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే దుండగున్ని కాల్చి చంపారు. అనంతరం ట్రంప్ ను హుటాహుటిన అక్కడినుంచి తరలించారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment