ఆమె మళ్లీ పోటీ చేసి గెలుస్తారు
కమల పూర్వికుల గ్రామంలో ప్రజల మనోగతం
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్‌ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు.
స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్‌దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్‌ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం.
ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు.
చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment