అమర పోలీసుల సంస్మరణార్థం 10కె రన్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 16 నుంచి మూడు రోజుల పాటు 2కె, 5కె, 10కె రన్ పోటీలను నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసి, పోలీసు సేవలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో 5 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన సీనియర్ అధికారులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో తొలిసారి అమర పోలీసుల సంస్మరణార్థం రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.
అమెరికాలో ట్విన్ టవర్స్ ఘటన తర్వాత న్యూయార్క్ పోలీసు డిపార్టుమెంట్ (ఎన్‌వైపీడీ) ఏటా రన్ నిర్వహిస్తోందని, అలానే రాష్ట్రంలోనూ పోటీలు ప్రారంభించనున్నామని, ఇక నుంచి ఏటా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం 2కె, 5కె, 10కె పోటీలు నిర్వహిస్తున్నామని, అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఠీఠీఠీ.ఞౌజీఛ్ఛిటఠ.జీ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలానే హైదరాబాద్‌లోని మాదాపూర్, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, కుషాయిగూడ, అబిడ్స్, బంజారాహిల్స్, చార్మినార్, పంజాగుట్ట, ఉస్మానియా యూనివర్శిటీ, అంబర్‌పేట, నారాయణగూడ పోలీస్‌స్టేషన్లలోనూ పేర్లు నమోదు చేయించుకోవచ్చని చెప్పారు. 2కె రన్‌లో పాల్గొనే వారు రూ.250, 5కె రన్‌కు రూ.300, 10కె రన్‌కు రూ.350 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్నలిస్టులు ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతిస్తారని చెప్పారు. రన్‌లో విజయం సాధించిన వారికి మెడల్స్ అందజేస్తామని, పోటీలో పాల్గొనే వారికి టీ-షర్ట్‌లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు.
పోలీసు సేవలపై ‘ఎక్స్ పో’
పోలీసు సేవలపై అక్టోబర్ 15, 16 తేదీల్లో పీపుల్స్ ప్లాజాలో ‘‘ఎక్స్ పో’’ నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విభాగాల పోలీసు స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌త్రివేది, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా, రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్, సీఐడీ చీఫ్ సౌమ్యామిశ్రా, సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.