సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని, అమరులైన పోలీసులను స్మరించుకోవాలని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఈ నెల 15న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో నిర్వహిస్తున్న పోలీస్ రన్‌కు సంబంధించిన టీ షర్ట్, మెడల్‌ను సీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలసి అనురాగ్‌శర్మ గురు వారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్‌లో 2కె, 5కె, 10కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ మెడల్ ఇస్తామని పేర్కొన్నారు. 2014 గౌహతిలో నిర్వహించిన డీజీపీల సమావేశంలో పోలీసుల త్యాగాలను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రధాని సూచించారని వివరించారు. దీనికోసం కేంద్రం ప్రారంభించిన వెబ్‌సైట్‌లో పోలీస్ సిబ్బంది చేసిన కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు అప్‌లోడ్ చేస్తున్నాయన్నారు.
గతేడాది రాష్ట్రంలోని వివిధ పోలీస్ సంస్థలు, పారా మిలిటరీతో కలసి పోలీస్ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈసారి కూడా ఈ నెల 14 నుంచి 16 వరకు నెక్లెస్‌రోడ్‌లో ఎక్స్‌పో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ రన్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. పోలీస్ రన్ నిర్వహణకు ఎస్.ఎల్.ఎన్ టెర్మినస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌పీ రెడ్డి రూ.5 లక్షల చెక్కును ఐజీ సౌమ్యామిశ్రా సమక్షంలో డీజీపీకి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment